మూడు పంచాయతీలుగా ప్రగడవరం!
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:54 PM
చింతలపూడి మండలంలోని మేజర్ పంచాయతీ ప్రగడవరం గ్రామాన్ని మూడు పంచాయ తీలుగా విభజించాలని ఆదివారం జరిగిన గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానించారు.
గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానం
చింతలపూడి, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): చింతలపూడి మండలంలోని మేజర్ పంచాయతీ ప్రగడవరం గ్రామాన్ని మూడు పంచాయ తీలుగా విభజించాలని ఆదివారం జరిగిన గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రగడవరం పంచా యతీ వైశాల్యంలో, జనాభాలో పెద్దది కావడం, ఎటువంటి అభివృద్ధి చెయ్యాలన్నా తగిన ఆదాయం లేకపోవడంతో వెనుకబడి ఉంది. విభజనకు గతంలో బ్యాన్ ఉండడంతో చేయలేకపోయారు. ఏడాదిగా ఈ సమస్యపై చర్చ జరుగుతోంది. 25 గ్రామాలు, 18 శివారు గ్రామాలు ఉన్న ఈ పంచాయతీని మూడు పంచాయతీలుగా విభజిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని డిమాం డ్లు వినిపిస్తున్నాయి. ఈ విషయం ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ దృష్టికి తీసుకురావడంతో ఆయన స్వయంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై గ్రామ సభలో తీర్మానం చెయ్యాలని సూచనలిచ్చారు. ఈ నేపథ్యం లో ఆదివారం కూటమి నాయకుల ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి పలువురి అభిప్రాయాలు తీసుకున్నారు. ఎవరి నుంచి ఎటువంటి అభ్యంతరం లేకపోవడంతో మూడు పంచాయతీలుగా విభజించాలని తీర్మానం చేశారు. పునుకుమాడు, ప్రగడవరం, వెగలపల్లి పంచాయతీలుగా చేయాలని గ్రామసభలో పలువురు సూచించారు. దీనిపై అభ్యంతరాలేమీ వ్యక్తం కాలేదు. మూడు రోజుల క్రితం చిన్న పంచాయతీలుగా మార్చుకోవ డానికి, సమీప మున్సి పాలిటీలోకి కలపడానికి ప్రభుత్వం బ్యాన్ ఎత్తివేసిం దని టీడీపీ గ్రామాధ్యక్షుడు టి.చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సభలో మాజీ ఏఎంజీ అధ్యక్షుడు జె.ముత్తారెడ్డి, కె.రాజశేఖర్‌రెడ్డి, కొప్పెర్ల నాగరాజు పాల్గొన్నారు.