పేదరికం పారిపోవాలి
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:36 AM
పేదరికం లేని సమాజం రావాలి. అంతకంటే మించి పేదరికంలో ఉన్న వారిని పైకి తెచ్చే దయాగుణం ఉన్న వారిని రంగంలోకి దింపాలి. ఈ రెండింటిని అధికార యంత్రాంగం సమన్వయం చేయాలి.
జిల్లాలో 99,905 బంగారు కుటుంబాలు, 6,429 మార్గదర్శుల గుర్తింపు
ఉద్యోగ కల్పన, వైద్య సేవలు, చిన్నపాటి అవసరాలు తీర్చడమే లక్ష్యం
ఈ నెల 19 నుంచి పీ–4 అంకురార్పణ
పేదరికం లేని సమాజం రావాలి. అంతకంటే మించి పేదరికంలో ఉన్న వారిని పైకి తెచ్చే దయాగుణం ఉన్న వారిని రంగంలోకి దింపాలి. ఈ రెండింటిని అధికార యంత్రాంగం సమన్వయం చేయాలి. వీలైతే ఈ నెల మూడో వారం నుంచే పేదరిక నిర్మూలనకు మహాయజ్ఞం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అనుగుణంగానే పీ–4 పేరిట అటు పేద కుటుంబాలను దత్తత తీసుకునే మార్గదర్శకులను ఎంపిక చేస్తున్నారు. ఏలూరు జిల్లాలోనే పేద రిక నిర్మూలనలో సుమారు లక్ష కుటుంబాలను లక్ష్యంగా తీసుకుంది. ఎవరిపైన ఒత్తిడి లేకుండా స్వచ్ఛంధంగా ముందుకు వచ్చేవారి కోసం యంత్రాంగం పరుగులు పెడుతోంది. అందరి లక్ష్యం పీ–4.
(ఏలూరు – ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చాక వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టింది. సంక్షేమం, అభివృద్ధి సమతూకంలో ఉండేలా జాగ్రత్త పడు తోంది. క్షేత్రస్థాయిలో అన్నింటిని విశ్లేషించిన తదుపరి పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం నడుం బిగించింది. పేదలను దాతల సాయంతో ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా పీ4 కార్యక్రమం రూపొందించింది. పేదరికంలో ఉన్న కుటుం బాలను గుర్తించేందుకు అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. జిల్లా వ్యాప్తంగా మారుమూల గ్రామాలే కాదు, పట్టణాల్లో దారిద్య్రరేఖకు అత్యంత దిగువన ఉన్న కుటుంబా లను దాదాపు ఇప్పటికే గుర్తించారు. ఈ కుటుంబాల ను పూర్తిగా ఆదుకునేందుకు, వారి జీవనశైలిలో పెనుమార్పులు తెచ్చేందుకు అనువుగా చకచకా పావులు కదుపుతున్నారు. ఈ తరహా కుటుంబాలను తక్కువ చేయకుండా బంగారు కుటుంబంగా నామ కరణం చేశారు. బంగారు కుటుంబాలను స్వయంశక్తి తో నిలిచేలా జీవం పోస్తారు. ఆయా కుటుంబాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలే కాకుండా, మౌలిక వసతుల కల్పనకు వీలుగా ప్రణాళిక సిద్ధం చేస్తారు.
బంగారు కుటుంబాల గుర్తింపు
ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 99వేల మందికిపైగా బంగారు కుటుంబాలను గుర్తించారు. ఆయా కుటుం బాల స్థితిగతులను నమోదు చేస్తున్నారు. ఆయా కుటుంబాలను దత్తత తీసుకునే వారిని మార్గదర్శకు లుగా వ్యవహరిస్తారు. వారే ఆయా కుటుంబాలకు అంతా తామై వ్యవహరిస్తారు. ఈ దిశగా బలమైన అడుగులు వేస్తే పేదరిక నిర్మూలన సాధ్యమని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి తగ్గట్టుగానే గడిచిన నాలుగువారాలుగా అధికార యంత్రాంగం యావత్తు తలమునకలై ఉంది.
అధికారులపై ఒత్తిడి..!
ముఖ్యమంత్రే స్వయంగా పేదరిక నిర్మూలనకు వీలుగా పీ–4కు తొలి ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ ప్రభావం కాస్త యంత్రాంగంపై ఒత్తిడికి దారితీసింది. పక్కా ప్రణాళిక, నమోదు, ఆచరణ ఒకే వరుసలో ఉండాల్సి రావడంతో క్షేత్రస్థాయి వరకు అధికారులకు సవాల్‌గా మారింది. ఈ క్రమంలోనే గత నెలలో మార్గదర్శకులు కోసం ఉపాధ్యాయులను పూర్తిగా భాగస్వామ్యం చేయాలని డీఈవో ఒక అడుగు ముందుకు వేయడం, ఆ వెంటనే వెనక్కి మళ్లడం కూడా జరిగిపోయింది. ఉపాధ్యాయులకు పీ–4 కార్యక్రమ లక్ష్యాలను విధిం చడం ఏ మాత్రం సరికాదని ఒక్కసారిగా నిరసనలు వెల్లువెత్తడంతో వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పీ–4 అమలులో మార్గదర్శకులు స్వచ్ఛందంగా వారంతట వారు మమేకం అయ్యేలా జాగ్రత్తలు తీసుకునేలా ప్రభుత్వం ఆదేశించింది.
మార్గదర్శి.. అత్యంత కీలకం
బంగారు కుటుంబాలను తీర్చిదిద్దడంలో వారిని దత్తత తీసుకునే మార్గద ర్శులే అత్యంత కీలకం. జిల్లా వ్యాప్తంగా 99,905 బంగారు కుటుంబాలను గుర్తించగా ఇప్పటి వరకు 54,945 మంది కుటుంబాలను దత్తత తీసుకున్నారు. దీని నిమిత్తం 6,429 మంది మార్గదర్శులు ముందుకు వచ్చారు. ఏలూరు నియోజకవర్గంలోనే అత్యధికంగా 1276 మంది మార్గదర్శులు ముందుకు రాగా, చింతలపూడిలో 1173, పోలవరంలో 1083, దెందులూరులో 831, కైకలూరులో 728, నూజివీడులో 591, ఉంగు టూరులో 539 మంది మార్గద ర్శులు బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఈ నెల మూడో వారం నుంచే కుదిరితే పీ– 4కు పూర్తిగా పదునుపెట్టాలని నిర్ణయించారు.