Share News

డ్వాక్రా గ్రూపులకు కోళ్ల పెంపకం

ABN , Publish Date - Nov 05 , 2025 | 12:49 AM

డ్వాక్రా మహిళలకు ఆదాయ వనరులు పెంచేందుకు ప్రభుత్వం కోళ్ల పెంపకం యూనిట్లు అందించే ఏర్పాటు చేస్తున్నది.

డ్వాక్రా గ్రూపులకు కోళ్ల పెంపకం

యూనిట్‌కు 10 కోళ్లు, 30 కేజీల దాణా, మందులు

ఆసక్తి చూపని మహిళలు..

ఎక్కడా మొదలుకాని పెంపకం

భీమవరం రూరల్‌, నవంబరు 4(ఆంధ్రజ్యోతి) : డ్వాక్రా మహిళలకు ఆదాయ వనరులు పెంచేందుకు ప్రభుత్వం కోళ్ల పెంపకం యూనిట్లు అందించే ఏర్పాటు చేస్తున్నది. మండలానికి 200 గ్రూపుల చొప్పున జిల్లాలో 4 వేల గ్రూపుల్లో 4 వేల యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే డ్వాక్రా గ్రూపుల్లో కోళ్ల పెంపకం చేసుకునేవారిని పరిశీలించారు. గ్రూపునకు యూనిట్‌ కింద సునాలీ కోళ్ళు 2 పుంజులు, 8 పెట్టలను అందిస్తారు. వీటితో పాటు 30 కేజీల దాణా, మందులు ఇస్తారు. మొత్తం మీద యూనిట్‌ కింద రూ. 5 వేలుకు సంబంధించిన కోళ్ళు, మెటీరియల్‌ను ప్రభుత్వం అందిస్తుంది. కోళ్ళ పెంపకం ద్వారా గుడ్లు ఉత్పత్తి చేసి వాటిని విక్రయించుకోవచ్చు. లేదంటే ప్రభుత్వం ద్వారా విక్రయ ఏర్పాట్లు చేస్తారు. 50 నుంచి 100 కోళ్లకు పైగా పెంచుకోవాలనుకున్న డ్వాక్రా గ్రూపులకు కూడా ప్రభుత్వం నుంచి సహకారం అందుతుంది. దీని ద్వారా మహిళలకు ఆదాయం కలిగించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. జిల్లాలో 30 వేల వరకు డ్వాక్రా గ్రూపులు ఉన్నప్పటికీ కోళ్ల పెంపకానికి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ఉన్న గ్రూపులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యూనిట్ల ఏర్పాటుకు కోళ్లు కూడా సిద్ధం చేసినట్లు జిల్లా యంత్రాంగం చెబుతుంది. ఇక డ్వాక్రా మహిళలే సిద్ధం కావాల్సి ఉంది.

జిల్లాలో ఇంకా వెనకడుగు

డ్వాక్రా మహిళలకు కోళ్ల పెంపకం ద్వారా ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తుంటే జిల్లాలో డ్వాక్రా మహిళలకు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేనట్టుగా కనిపిస్తున్నది. కోళ్ళ యూనిట్లు అందించే విఽషయంలో వారికి పూర్తిగా అవగాహన కలిగించలేదు. కోళ్లు ఇచ్చినప్పుడు అవి అమ్మకానికా అన్న సందేహాలు కూడా డ్వాక్రా మహిళల్లో వ్యక్తమయ్యాయి . గుడ్లు ఉత్పత్తి చేయించడంతో పాటు, కోడిపిల్లలు పొదిగించి వాటిని అమ్మకం ద్వారా ఆదాయం పొందేందుకు ఈ పథకం ఏర్పాటు చేసినట్టుగా అధికారుల నుంచిగాని, డ్వాక్రా లీడర్ల నుంచి గాని డ్వాక్రా మహిళలకు సమాచారం సమగ్రంగా అందలేదు. దీంతో ఇంకా జిల్లాలో కోళ్ల పెంపకం యూనిట్లు మొదలు కాలేదు. మిగిలిన జిల్లాల్లో అనుకున్న విధంగా నిర్వహణ జరుగుతున్నా ఇక్కడ మాత్రం వెనుకడుగు కనిపిస్తున్నది.

Updated Date - Nov 05 , 2025 | 12:49 AM