పొలిటికల్ జోష్!
ABN , Publish Date - Dec 28 , 2025 | 12:24 AM
రాజకీయ పక్షాల్లో 2025 సంవత్సరం సరికొత్త జోష్ నింపింది. ఏడాది కూటమి ప్రభుత్వ పాలన పూర్తి కావడంతో ప్రతి పక్షం వైసీపీ కాస్తా దూకుడు పెంచినా.. ఆ స్థాయిలో ప్రజలు పెద్దగా పట్టించుకో లేదు.
పార్టీల్లో పదవుల పందేరం
టీడీపీ అధ్యక్షుడిగా బడేటి చంటి
నామినేటెడ్ పదవులతో నేతల్లో హుషారు
సీపీఎం, సీపీఐల్లో పాతవారే కొనసాగింపు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
రాజకీయ పక్షాల్లో 2025 సంవత్సరం సరికొత్త జోష్ నింపింది. ఏడాది కూటమి ప్రభుత్వ పాలన పూర్తి కావడంతో ప్రతి పక్షం వైసీపీ కాస్తా దూకుడు పెంచినా.. ఆ స్థాయిలో ప్రజలు పెద్దగా పట్టించుకో లేదు. కూటమి పక్షాల్లో వివిధ నామినేటేడ్ పదవులు సమాంతరంగా దక్కాయి. కొన్నిచోట్ల అసంతృప్తులు రేగినా అవి పెద్దగా ప్రభావం చూపలేదు. కూటమి పార్టీ నేతలు అందరిని కలుపు కుం టూ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సా హం నింపుతూ పార్టీలు నడవడంతో పొరపొచ్చాలు రాలేదు. ఏడాది పాలన పూర్తయిన ప్పటి నుంచి టీడీపీ శ్రేణులు ఐక్యంగా జతకట్టి ప్రజల్లో గత పాలకుల విధ్వం సాలను ఎడగట్టి.. ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల ను ఏమీ చేస్తుందీ వివరించడంలో సక్సెస్ సాధించారు.
టీడీపీ అధ్యక్ష పగ్గాలందుకున్న బడేటి
జిల్లాలో ఐదు నెలలు నుంచి పార్టీ పదవులకు కసరత్తు చేసిన టీడీపీ అధిష్ఠానం జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య
(చంటి), ప్రధాన కార్యదర్శిగా జగ్గవరపు ముత్తారెడ్డి (చింతల పూడి)లను నియమించింది. కాగా టీడీపీ గత అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు నా యకత్వంలో సభ్యత్వ నమోదు, సూపర్ సిక్స్ సభ వంటి కార్యక్రమాల విజయవంతానికి పార్టీ శ్రేణులను ఏకతాటిపై నడిపించారు.
నామినేటెడ్‌తో సముచిత స్థానం
ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేసిన టీడీపీ నేతలు కీలక పద వులు దక్కాయి. ఉంగుటూరు సీటును జనసేనకు ఇచ్చిన టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులుకు డీసీసీబీ, ఆఫ్కాబ్ చైర్మన్లతో డబుల్ బొనాంజాతో తగిన గుర్తింపు నివ్వగా, పోలవరం నుంచి సీటు వదులుకున్న బొరగం శ్రీనివాస్‌కు ఏపీ ట్రైకార్ చైర్మన్ పదవి దక్కింది. చాలా కాలం పార్టీకి సేవలందిస్తున్న పెద్దిబోయిన శివప్రసాద్‌కు బీసీల కోటాలో ఇడా చైర్మన్ పదవిని అధిష్ఠానం కట్టబెట్టిం ది. మాల కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు (ఏలూరు)కు దక్కింది. శాప్ డైరెక్టర్ గా కొవ్వాసు జగదేశ్వరి (పోలవరం), శ్రీశైలం మల్లన్న దేవాలయం డైరెక్టర్‌గా కొప్పెర్ల నాగరాజు (చింతలపూడి), విజయవాడ దుర్గగుడి డైరెక్టర్‌గా మోరు శ్రావణి (పెద పాడు), గ్రీన్ అండ్ బ్యూటీఫికేషన్ డైరెక్టర్‌గా పల్లె శ్రీను (లింగపాలెం), రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా చోడే వెంకటరత్నం (ఏలూరు) పదవులు దక్కించుకున్నారు. తొమ్మిది వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ఎనిమిది భర్తీ చేశారు. కలిదిండి పాలకవర్గం ఏర్పాటు చేయలేదు. ఇందులో ఐదుగురు చైర్మన్ పదవులను కేటాయించారు. ఏలూరుకు మామిళ్లపల్లి పార్థసారథి, దెందులూరు నుంచి గారపాటి రామసీత, భీమడోలు ఏఎంసీ చైర్మన్‌గా శేషగిరి, పోలవరం నుంచి పొట్టా రామారావు, కైకలూరుకు పెన్మత్మ త్రినాథరాజు ఉన్నారు.
జనంలోకి దూసుకెళ్లిన జనసేన
అనుకున్న స్థాయిలో జనంలోకి దూసుకెళ్లిన జనసేన కూటమి పార్టీ కార్యక్రమాల్లో మమేకం అవుతూ జనసేన అధినేత లక్ష్యాలను ప్రజల్లోకి వివరిస్తోంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్, ఉమ్మడి జిల్లా అఽధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు సారథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ముందుకు సాగుతున్నారు. వైసీపీ చేపట్టిన విధ్వంసాలు, ఆందోళనలను తిప్పికొట్టడంలో నేతలు సక్సెస్ అయ్యారు. విజయవాడ ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఇటీవల పదవి అందుకున్న రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ఘంటసాల లక్ష్మి ప్రజల్లోనే ఉంటున్నారు. నామినేటేడ్ పదవుల్లోను సముచిత స్థానం ఈ పార్టీకి దక్కాయి. జిల్లాలో రెండు ఏఎంసీ స్థానాలను ఈ పార్టీకి కేటాయించారు. చింతలపూడి నుంచి చీదరాల దుర్గా పార్వతి, ఉంగుటూరు నుంచి సూరాత్తుల జ్యోతి దక్కించు కున్నారు. కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ నియమితులయ్యారు.
బీజేపీ సంస్థాగతంగా పురోభివృద్ధి
బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల వైపు చూస్తోంది. ఆసక్తి ఉన్న వారిని ఎంపిక చేయడానికి పార్టీ కేడర్‌ను సమాయత్తం చేస్తోంది. సుపరిపాలన యాత్ర, జీఎస్టీ సంస్కరణల పైన వివరిస్తూ కార్యక్రమాలను చేపట్టింది. జిల్లా బీజేపీలో పనిచేసిన కష్టపడిన వారికి పదోన్నతులు లభించాయి. ప్రస్తుతం ఉన్న జిల్లా అధ్యక్షుడు చౌటపల్లి విక్రమ్ కిశోర్ అందరిని క లుపుకుని వెళ్లడంతో రెండోసారి పార్టీ పగ్గాలు దక్కాయి. పార్టీకి అన్ని విధాల సహకారం అందిస్తూ నడుపుతున్న రాష్ట్ర కార్యదర్శి గారపాటి సీతారామంజనేయ చౌదరి (తపన)కు మరింత సముచిత స్థానం కల్పించింది. ఈయనతో పాటు బీజేపీ జిల్లా మోర్చా అధ్యక్షురాలిగా ఉన్న నిర్మలా కిశోర్ (పోలవరం)కు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవులు దక్కాయి. బీజేపీ జిల్లా కార్యవర్గంలో జనరల్ సెక్రటరీలుగా నగరపాటి సత్యనారాయణ, గాది రాంబాబు, దుర్గా నివాస్‌లతో పాటు 37 మంది ఈసీ మెంబర్లు, ఏడుగురు జిల్లా ఉపాధ్యక్షులను నియమించారు. బీజేపీలోను కొంతమందికి నామినేటేడ్ పదవులు వరించాయి. కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఏలూరుకు చెందిన కట్నేని కృష్ణప్రసాద్ , నూజివీడు ఏఎంసీ చైర్మన్ గిరిని కుంపటి అరుణ అనూహ్యంగా దక్కించుకున్నారు.
పసలేని పోరాటాలతో వైసీపీ
చెప్పుకోదగ్గ కేడర్ లేకపోయినప్పటికి వైసీపీ జిల్లా కేంద్రంలోనే ఆందోళనలకు ఉపక్రమించింది. రైతులకు గిట్టుబాటు ధరలు, విద్యుత్ ఛార్జీల పెంపుపై రాద్ధాంతం చేద్దామని చూసినా ఎవ్వరు పట్టించుకోలేదు. మధ్యలో యువత పోరు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లపై ఉద్యమాలు చేశారు. కూటమి ఏడాది పాలనపై బాబూ ష్యూరిటీకి గ్యారంటీ లేదంటూ వెన్నుపోటు పేరిట చేసిన ఆందోళనకు స్పందనే లేదు. ప్రభుత్వ వైద్యకళాశాలలను ప్రైవేట్‌పరం చేస్తున్నారంటూ వైసీపీ మూడు నెలలు పైగా ప్రజల నుంచి కోటి సంతకాల సేకరణతో వెళ్లినా మైలేజి రాలేదు. దెందులూరు, పోలవరం, చింతలపూడి, ఉంగుటూరు, నూజివీడులో పార్టీ కేడర్‌లో నిస్తేజం ఆవహించింది.
వామపక్షాలకు పాతవారే..
సీపీఐ,సీపీఎంలకు గతంలో ఉన్న జిల్లా కార్యదర్శులనే మళ్లీ కొనసాగింపు చేపట్టారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సీపీఎం నుంచి ఎ.రవి కార్యదర్శి పదవులను అలంకరించారు. ప్రధానంగా సీపీఐ ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఇసుక కేటాయింపు, కార్మికుల సమస్యలపై ఆందోళన చేయగా, సీపీఎం జీలుగుమిల్లిలో ఆయుధ కర్మాగారం నిలుపుదల చేయాలని, వివిధ కార్మికుల సమస్యలపై పోరాటాలు నెరిపాయి.
పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అధినేతలు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పీ–4 కార్యక్రమం ప్రారంభించడానికి మార్చి 11న నూజివీడు మండలం ఆగిరిపల్లిలో పర్యటించారు. అదే విధంగా డిసెంబరు 1న పెన్షన్ల పంపిణీ కోసం ఉంగుటూరు నియోజకవర్గంలో పర్యటించి పలు వరాల జల్లు కురిపించి పార్టీ నేతల్లో జోష్ పెంచారు.
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నవంబరు 1వ తేదీ ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం లో శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి ఆలయంలో ప్రహారీ, సుమారు ఏడుకోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈయన పర్యటన ఆ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది.
ఏలూరులో ఈనెల 22వ తేదీన మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజపేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, కేంద్రమంత్రి భూపతి శ్రీనివాసవర్మ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గారపాటి తపన చౌదరి హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.