ప్రమాదం.. చెంతనే!
ABN , Publish Date - Nov 16 , 2025 | 12:17 AM
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అగ్ని ప్రమాదానికి కారణమయ్యే వస్తువులు, సామగ్రి ప్రతి పోలీస్ స్టేషన్ చుట్టిముట్టే ఉన్నాయి. జిల్లాలో గతంలో స్టేషన్ల వద్ద మందుగుండు సామాగ్రి వల్ల జరిగిన ప్రమాద ఘటనలున్నాయి.
అగ్ని ప్రమాద వస్తువులు, ద్రవాల మధ్యలో పోలీసు విధులు.. రక్షణ చర్యలు శూన్యం
ఉమ్మడి జిల్లాల్లో పోలీస్ స్టేషన్లలో భారీ సంఖ్యలో సీజ్ చేసిన మోటర్ వాహనాలు
సీజ్ వాటికి ప్రత్యేక యార్డు ఏర్పాటు చేస్తే సిబ్బంది సురక్షితం
ఏలూరు క్రైం, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): జమ్మూ కశ్మీర్‌లో శుక్రవారం (ఈనెల 14వ తేదీ) అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. శ్రీనగర్‌లోని నవ్‌గామ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఈ పేలుడు సంభవించి తొమ్మిది మంది మృత్యువాత పడగా మరో 27 మంది తీవ్ర గాయాల పాలైనట్టు ప్రాథమిక సమాచారం. మృతుల్లో పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది ఉన్నారని వెల్లడిస్తున్నారు. ప్రమాదానికి కారణం సీజ్ చేసిన పేలుడు పదార్థాలను పోలీస్ స్టేషన్ ఆవరణలో పెట్టి వాటిని పరిశీలిస్తుండగా ఈ ఘటన జరిగి పోలీస్ స్టేషన్ ధ్వంసమైనట్టు అక్కడ అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటన నవ్‌గామ్ పోలీస్ స్టేషన్‌కే పరిమితం కాదు. ఉమ్మడి పశ్చిమ గోదా వరి జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లలో ఇంచుమించు ఇలాంటి పరిస్థితే నెలకొని ఉంది. అయితే అక్కడ వారు పేలుడు పదార్థాలను పోలీస్ స్టేషన్ ఆవరణలో భద్ర పరిచి ఉండవచ్చు. కాని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అగ్ని ప్రమాదానికి కారణమయ్యే వస్తువులు, సామగ్రి ప్రతి పోలీస్ స్టేషన్ చుట్టిముట్టే ఉన్నాయి. జిల్లాలో గతంలో స్టేషన్ల వద్ద మందుగుండు సామాగ్రి వల్ల జరిగిన ప్రమాద ఘటనలున్నాయి. ఏలూరు జిల్లాలో 33, పశ్చిమ గోదావరి జిల్లాలో 24 లా అండ్ అర్డర్ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్ల ప్రాంగణాల్లో సీజ్ చేసిన వాహనాలు సుమారు 4 వేలు ఉన్నాయి. ఏలూరు నగరంలో మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 700 వాహనాలు ఉన్నాయి.
ఎటుచూసినా ప్రమాద కారకాలే..
సాధారణంగా పోలీసులు వాహనాలు తనిఖీలు చేసిన ప్పుడు అనుమానాస్పదంగా ఉన్నవాటిని సీజ్ చేస్తారు. వివిధ దొంగతనాల కేసుల్లో రికవరీ చేసిన వస్తువులను, వాహనాలను స్టేషన్ ఆవరణలోనే భద్రపరుస్తారు. గంజా యి, ఇతర మాదక ద్రవ్యాలు, హత్య కేసులు, దోపిడీలు, దొంగతనాల్లో ఉప యోగించిన వాహనాలను సీజ్ చేసి స్టేషన్ ఆవరణలోనే భద్రపరుస్తున్నారు. దీపావళి పండు గకు ముందు అక్రమంగా బాణసంచా నిల్వ ఉంచిన వారిపై కేసులు నమోదు చేసి వాటిని తీసుకొచ్చి స్టేషన్ రూముల్లో భద్రపరుస్తున్నారు. ఇక సారా, గంజాయి, మద్యం కలిగిన వారిని అరెస్టు చేసి వాటిని సీజ్ చేసి స్టేషన్‌లోని రూముల్లోనే భద్రపరుస్తున్నారు. పాన్‌పరాగ్, గుట్కా వంటి వాటిని సీజ్ చేసి భద్రపరుస్తూనే ఉన్నారు. కానీ ఇవన్నీ అగ్ని ప్రమాదాలు జరిగితే త్వరితగతిన మంటలను వ్యాపింప చేసే పదార్థాలే.
జిల్లాలో కొన్నేళ్ల క్రితం చేబ్రోలు పోలీస్ స్టేషన్‌లో బాణసంచాను భారీగా పట్టుకుని స్టేషన్ ఆవరణలోనే పెట్టారు. రాత్రి ఏడు గంటల సమయంలో అప్పటి ఆ స్టేషన్ ఎస్‌హెచ్‌వో ఎం.సుధాకర్ (ప్రస్తుతం ఇంటిలిజెన్స్ డీఎస్పీ) తన సిబ్బంది స్టేషన్‌లో ఉండ గానే అకస్మాత్తుగా బాణసంచా పేలి పెద్ద ప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవ్వరు ఆవైపు లేకపోవడంతో ఎవరు ప్రమాదానికి గురి కాలేదు. సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయ్యారు. అప్పటి ఎస్‌ఐ సుధాకర్ సిబ్బందిని అప్రమత్తం చేసి రక్షణ చర్యలు తీసుకుని ఉన్నతాధికారులతో బేష్ అనిపించుకున్నారు.
ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద సీజ్ చేసిన 150 మోటారు సైకిళ్లను రోడ్డు పక్కనే పార్కు చేసి ఉంచడంతో రాత్రి వేళ గుర్తు తెలియని ఒక వ్యక్తి సిగరెట్ కాల్చి పడవేయడంతో అది కాస్త పెట్రోల్ పైపుకి నిప్పు రవ్వ అంటుకుని అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అనేక మోటారు సైకిళ్లు, రెండు లారీలు దగ్ధమయ్యాయి. జంగారెడ్డి గూడెం పోలీస్ స్టేషన్‌లోను ఇలాంటి సంఘటనే సంభవించింది.
స్టేషన్ల చుట్టూ మోటారు వాహనాలు
ప్రస్తుతం జిల్లాలో ఏ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన వివిధ కేసుల్లో సీజ్ చేసిన మోటారు సైకిళ్లు ఆ స్టేషన్ చుట్టూ ఉన్నారు. ప్రతి ట్యాంకులోనూ పెట్రోలే ఎంతో కొంత ఉంటుంది. ఒక వేళ పెట్రోలు లేకపోయినా ప్రతి వాహనానికి టైర్లు, ట్యూబులు ఉంటాయి. స్పాంజ్ సీట్లు ఉంటాయి. అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే మంటలు వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. రబ్బరు వస్తువులు, వైర్లు ఇలాంటివి స్టేషన్లలో ఉన్నాయి. ఇక స్టేషన్ రూముల్లో సీజ్ చేసిన మద్యం, పాన్‌పరాగ్, గుట్కా, గంజాయి వంటివి ఉన్నాయి. గతంలోనే ఒక రాష్ట్రస్థాయి ఉన్నతాధికారి ఇలాంటి సీజ్ చేసిన అన్నింటిని ప్రత్యేకంగా ఒక యార్డులాంటిది ఏర్పాటు చేసి అక్కడ భద్రపరిస్తే ఎంతో సురక్షితమని భావించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినప్పటికి బుట్టదాఖలైనట్లే తెలుస్తోంది.
ప్రస్తుతం పోలీసు అధికారులు, సిబ్బంది ప్రతి పోలీస్ స్టేషన్‌లో ప్రమాదపు అంచుల్లోనే తమ విధులను నిర్వర్తిస్తున్నారని భావించవచ్చు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ సమస్యలు పరిశీలించి అటు విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు, ఇటు వివిధ సమస్యలతో న్యాయం కోసం వచ్చే ప్రజలకు భద్రత కల్పించాలని విజ్ఞులు కోరుతున్నారు. జమ్మూ కశ్మీర్‌లో జరిగిన సంఘటనే ఇందుకు ఉదాహరణగా తీసుకుని ఉమ్మడి జిల్లాలో ఉన్న పోలీస్ స్టేషన్లలోని అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే వస్తువులు, ద్రవాలను వేరే ప్రాంతాల్లో భద్రపరచడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.