అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ధ్వంసం
ABN , Publish Date - Jul 26 , 2025 | 12:23 AM
ద్విచక్ర వాహనాలకు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను తొలగించి వాటిని ధ్వంసం చేసినట్లు ఎస్పీ కేపీఎస్.కిశోర్ తెలిపారు.
ఏలూరు జిల్లా పోలీసుల ప్రత్యేక డ్రైవ్
ఏలూరు క్రైం, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనాలకు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను తొలగించి వాటిని ధ్వంసం చేసినట్లు ఎస్పీ కేపీఎస్.కిశోర్ తెలిపారు. ఏలూరులో ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహిం చారు. తొలగించిన సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్పీ కిశోర్ సమక్షంలో రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ద్విచక్ర వాహనాలకు సంబంధింత కంపెనీలు ఇచ్చిన సైలెన్సర్లు కాకుండా ఎక్కువ శబ్దం వచ్చే వాటిని బిగించుకుని శబ్ద కాలుష్యం సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు తయారు చేసే కంపెనీలపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.
నంబర్ ప్లేట్‌పై స్టిక్కర్లు ఉంటే వాహనం సీజ్
కొంతమంది నంబర్ ప్లేట్లపై స్టిక్కర్లు అంటిస్తున్నారని అలాంటి వాహనాలను సీజ్ చేస్తామన్నారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం వాహనాలకు నెంబర్ ప్లేట్లు ఉండాలన్నారు. పిల్లల సౌకర్యం కోసం తల్లిదండ్రులు ద్విచక్ర వాహనా లను కొనిస్తున్నారని, వాటి ద్వారా సమస్యలను కూడా కొని తెచ్చుకోవద్దన్నారు. హైస్పీడు వాహనాలను పిల్లలకు ఇవ్వరాదని ఎస్పీ కిశోర్ సూచిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడపకూడదని, డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానులతో పాటు తల్లి దండ్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు, ఏలూరు త్రి టౌన్ సీఐ వి కోటేశ్వరరావు, టూటౌన్ సీఐ కె అశోక్‌కుమార్, ట్రాఫిక్ సీఐ లక్ష్మణబాబు, ఈగల్ టీమ్ ఆర్‌ఎస్‌ఐ పలువురు పాల్గొన్నారు.