Share News

నిర్వాసితుల మన్ననలు పొందాలి

ABN , Publish Date - Mar 14 , 2025 | 12:29 AM

ఆర్‌అండ్‌ ఆర్‌ సమస్యలను తెలుసుకుని పరిష్కరించి నిర్వాసితుల మన్ననలు పొందాలని ప్రాజెక్టు నూతన అడ్మినిస్ట్రేటర్‌ అభిషేక్‌ అన్నారు. గురువారం పోలవరం ప్రాజెక్టు కోండ్రుకోట పునరావాస కాలనీలో గురువారం ఆయన సందర్శించారు.

నిర్వాసితుల మన్ననలు పొందాలి
నిర్వాసితుల వద్ద సమస్యలు తెలుసుకుంటున్న ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌ అభిషేక్‌

పోలవరం/బుట్టాయగూడెం, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : ఆర్‌అండ్‌ ఆర్‌ సమస్యలను తెలుసుకుని పరిష్కరించి నిర్వాసితుల మన్ననలు పొందాలని ప్రాజెక్టు నూతన అడ్మినిస్ట్రేటర్‌ అభిషేక్‌ అన్నారు. గురువారం పోలవరం ప్రాజెక్టు కోండ్రుకోట పునరావాస కాలనీలో గురువారం ఆయన సందర్శించారు. పునరావాస కాలనీలో మౌలిక వసతులు తదితర అంశాలను స్వయంగా పరిశీలించారు. రైతు సేవా కేంద్రంలో పునరావాస కాలనీల సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి అన్ని సమస్యలకు పరిష్కారం చూపారు. కొన్ని వివాదాస్పద సమస్యలపై చర్యలు తీసుకోవాలని కొవ్వూరు భూసేకరణ అధికారులకు, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ అక్రమ ఆక్రమణలపై కొవ్వూరు డీఎస్పీతో మాట్లాడారు. నాలుగేళ్లుగా పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించడంతో నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేశారు. 18 ఏళ్ల వారికి పరిహారం విషయంలో నిబంధనలకు లోబడి మృతి చెందిన వారి వారసత్వ ప్యాకేజీల విషయంలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం స్థానిక పాఠశాలలో విద్యార్థులను జనరల్‌ నాలెడ్జి, ఇంగ్లీషు పరిజ్ఞానంపై ప్రశ్నించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తరువాత స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు పెడుతున్న పౌష్టికాహారం విషయంపై ఆరా తీశారు. చిన్నారుల బరువు ఎత్తు విషయాలు స్వయంగా కొలతలు, తూకం వేయించి చూశారు. ఈ సందర్భంగా ఐటీడీఎస్‌ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్‌ గంగు అనీల్‌కుమార్‌ శ్మశాన వాటికల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్‌డీవో రమణ, తహసీల్దార్‌ సాయిరాజు, ఐటీడీఎస్‌ ప్రతినిధి ఫిలోమెన్‌, పూనెం విష్ణు, బుచ్చిబాబు, కోండ్రుకోట సర్పంచ్‌ పైదా నాగరాజు, నిర్వాసిత ప్రజలు పాల్గొన్నారు.

జూన్‌లోగా నిర్వాసితులను తరలించాలి

ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజి అందజేసిన నిర్వాసితులను వారి కోసం నిర్మించిన కాలనీలకు జూన్‌లో వరదలు సంబవించడానికి ముందే తరలించాలని అధికారులను ఆయన ఆదేశించారు. గురువారం బుట్టాయగూడెం మండలం కేఆర్‌పురం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఆర్‌అండ్‌ఆర్‌ అధికారులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ముంపునకు గురైన 15 హేబిటేషన్‌లకు ఆర్‌ అండ్‌ఆర్‌ ప్యాకేజిని ఈనెల 20 తేదీలోగా సమర్పించాలని ఐటీడీఏ పీవో, ఆర్‌అండ్‌ఆర్‌ ఆఫీసర్‌ కె.రాములు నాయక్‌ను ఆదేశించారు.

Updated Date - Mar 14 , 2025 | 12:29 AM