గోవిందా.. గోవిందా..
ABN , Publish Date - Nov 02 , 2025 | 12:35 AM
గోవిందుని నామాలతో శ్రీవారి క్షేత్రం మార్మోగింది.
భక్తులతో కిటకిటలాడిన శ్రీవారి క్షేత్రం
ద్వారకాతిరుమల, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): గోవిందుని నామాలతో శ్రీవారి క్షేత్రం మార్మోగింది. కార్తీక మాసం ఏకాదశి పర్వదినం, శనివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు చిన వెంకన్న దర్శనానికి తరలివ చ్చారు. ఉదయం నుంచి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్లు, క్యూకాంప్లెక్స్‌లు, అన్నదానం వద్ద భక్తుల సందడి నెలకొంది. దాదాపు 20 వేల మంది స్వామి, అమ్మవార్లను దర్శించినట్లు ఆలయ అధికారుల అంచనా. దర్శనానంతరం వారంతా వకుళమాత అన్న ప్రసాద భవనానికి చేరుకుని ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
భక్తుల సెల్‌ఫోన్ కష్టాలు..
శ్రీవారి క్షేత్రానికి వచ్చిన భక్తులకు సెల్‌ఫోన్ కష్టాలు వెంటాడాయి. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి సెల్‌ఫోన్లు దాచేందుకు భక్తులు అవస్థలు పడ్డారు. శ్రీవారి దర్శనానికి సెల్‌ఫోన్ తీసుకెళ్లడం నిషేధం. దేవస్థానం ఏర్పాటుచేసిన ప్రత్యేక కౌంటర్లలో రూ.5 చెల్లించి వాటిని భద్రపరుచుకోవచ్చు. అయితే కౌంటర్ నిర్వహణలోపం భక్తులకు శాపంగా మారింది. స్వామి దర్శనం కంటే ముందకు సెల్‌ఫోన్ భద్రపరిచేందుకు గంటల తరబడి క్యూలో వేచి ఉన్నారు. దర్శనం అనంతరం ఫోన్ తిరిగి తీసుకునేందుకు కూడా గంటల తరబడి క్యూలో ఉండడం భారంగా మారింది. ఇదెక్కడి దారుణం స్వామీ అంటూ భక్తులు వాపోయారు.