వైద్యం చేయరు..!
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:28 AM
కుక్కునూరు, వేలేరుపాడు మం డలాల ప్రజలకు అత్యవసర వైద్యం అందడం లేదు.
కుక్కునూరు, వేలేరుపాడు పీహెచ్‌సీల్లో అందని సేవలు
క్లిష్టమైన కేసులు ఇతర ఆస్పత్రులకు రిఫర్
గిరిజనులకు తప్పని తిప్పలు
కుక్కునూరు, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): కుక్కునూరు, వేలేరుపాడు మం డలాల ప్రజలకు అత్యవసర వైద్యం అందడం లేదు. రాత్రివేళ ప్రాణపాయ స్థితిలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన రోగులు, బాధితులను 70 కిలో మీటర్ల దూరంలో తెలంగాణలోని భద్రాచలం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. లేదంటే 80 కిలోమీటర్ల దూరంలో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి వెళ్లాలి. రెండు నెలలుగా అంబులెన్స్‌లు అందుబాటులో లేవు. కుక్కునూరు, అమరవరం, వేలేరుపాడు, కోయిద ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రులున్నాయి. ఏజెన్సీ ప్రాంతం కావడంతో రాత్రి వేళ పాము కాటు, గిరిజన మహిళల కాన్పుల కేసులు ఎక్కువ. ప్రాథమిక వైద్యం అందించి భద్రాచలం లేదా జంగారెడ్డిగూడెం రిఫర్ చేస్తున్నారు. కుక్కునూరు, వేలేరు పాడు మండలాలకు కలిపి కమ్యూనిటీ హెల్త్‌సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదని ఏజెన్సీ వాసుల ఆవే దన వ్యక్తం చేస్తున్నారు.
తల్లి బిడ్డా క్షేమం
కుక్కునూరు మండలం వింజరం గ్రామ పరిధిలోని జిన్నెలగూడెం నుంచి బాలిం తను డోలిపై అమరవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి తెలంగాణ ఆస్పత్రి రిఫర్ చేయడంతో అక్కడ వైద్యం పొందిన తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారని జిల్లా వైద్యాధికారి అమృతం తెలిపారు. కుక్కునూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. భద్రాచలంలో చికిత్సపొందుతున్న సోయం హిర్మి ఆమె బిడ్డ ఆరోగ్య బాగుందని, మెరుగైన వైద్యసేవలందేలా అక్కడి సూప రింటెండెంట్‌తో మాట్లాడినట్లు తెలిపారు. ఆసుపత్రిలో ఆమెకు సహాయంగా ఒక నర్సును ఏర్పాటుచేశారు. అమరవరం ఆసుపత్రిని సందర్శించి వైద్య సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చారు. కుక్కునూరు, అమరవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్యసేవలందేలా చూడాలని సీపీఐ మండల కార్యదర్శి కొన్నే లక్ష్మయ్య కోరారు. త్వరలో కొత్తగా అంబులెన్స్ ఏర్పాటు చేయడంతోపాటు సీటర్ అంబులెన్స్‌ను ఏర్పాటు చేస్తామని వైద్యాధికారి తెలిపారు. అదనపు వైద్యాధికారి సురేశ్‌కుమార్ ఆమెతో ఉన్నారు.