పీహెచ్‌సీ వైద్యుల ఆందోళన బాట!
ABN , Publish Date - Sep 28 , 2025 | 12:41 AM
పీజీ వైద్యవిద్య క్లినికల్, నాన్ క్లినికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇన్‌సర్వీస్ కోటా సీట్లను పెంచాలని డిమాండ్ చేస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) వైద్యాధికారులు దశల వారీ ఆందోళనబాట పట్టారు.
పీజీ వైద్యవిద్య ప్రవేశాల్లో ఇన్‌సర్వీస్ కోటా తగ్గింపు, పరిమితులపై నిరసనలు
ల్యాబ్ టెక్నీషియన్ల మద్దతు
గ్రామాల్లో వైద్యసేవలకు విఘాతం
ఏలూరు అర్బన్, సెప్టెంబరు 27 (ఆంధ్ర జ్యోతి): పీజీ వైద్యవిద్య క్లినికల్, నాన్ క్లినికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇన్‌సర్వీస్ కోటా సీట్లను పెంచాలని డిమాండ్ చేస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) వైద్యాధికారులు దశల వారీ ఆందోళనబాట పట్టారు. శుక్రవారమే ప్రా రంభమైన ఈ ఆందోళనలో భాగంగా శనివారం రెండోరోజు నుంచి క్రమేణా ఉధృతిని పెంచు తూ కేవలం పీహెచ్‌సీ అవుట్ పేషెంట్ (ఓపీ) విధులకే పరిమితమయ్యారు. ఫలితంగా గ్రా మాల్లో నిర్వహించాల్సిన ఫ్యామిలీడాక్టర్ కాన్సెప్ట్, సంచార వైద్యచికిత్స, స్వచ్ఛనారీ, ప్రత్యేక వైద్య శిబిరాల వైద్యసేవలు నిలిచిపోయాయి. ఆది వారం నుంచి ఆందోళనను మరింత పెంచడా నికి ఏపీ పీహెచ్‌సీల వైద్యుల సంఘం ఇచ్చిన షెడ్యూలు మేరకు జిల్లాలో వైద్యాధికారులు వ్యవహరిస్తారని ఆ సంఘ జిల్లా అద్యక్ష, ప్రధా న కార్యదర్శులు డాక్టర్ ఆర్. గంగాభవాని, డాక్టర్ షేక్ జోషిమా వెల్లడించారు. కాగా వైద్యా దికారుల ఆందోళనవల్ల జిల్లాలో గ్రామీణప్రాంత రోగులకు ఇప్పటికిప్పుడు ఇబ్బందేమీ కలుగలేద ని, ప్రభుత్వ సూచనలమేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వైద్యసేవలకు ఎటువంటి విఘా తం లేకుండా చర్యలు తీసుకుంటామని డీఎం హెచ్‌వో డాక్టర్ పీ.జే.అమృతం తెలిపారు.
డిమాండ్లు ఇవీ..
కొవిడ్ మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను ఫణంగాపెట్టి వైద్యసేవలందించిన డాక్టర్ల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని పీహెచ్‌సీల వైద్యాధికారులు వాపోతున్నారు. పీజీ అడ్మిషన్లలో ఇన్ సర్వీస్ కోటా కింద సీట్లు లభిస్తాయనే ఆశతోనే గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పీహెచ్‌సీల్లో ఏళ్ల తరబడి వైద్య సేవలందిస్తున్నామని చెబుతున్నారు. దీనికనుగుణంగానే ప్రభుత్వం పీజీ వైద్యవిద్య అడ్మిషన్లలో ఇన్‌సర్వీస్ కోటా కింద పీహెచ్‌సీల వైద్యుల (ఎంబీబీఎస్)కు క్లినికల్ కోర్సుల్లో 30 శాతం, నాన్ క్లినికల్ కోర్సుల్లో 50 శాతంగా వున్న సీట్లను కొనసాగించాలని గతేడాది రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్‌సీల వైద్యులు సమ్మె చేసినా పట్టించుకోకుండా క్లినికల్ కోర్సులకు 20 శాతానికి, నాన్ క్లినికల్ కోర్సులకు 30 శాతానికి ఏకపక్షంగా తగ్గించేసిందని వివరించారు. ఈ ఇన్‌సర్వీస్ కోటా సీట్లను మళ్లీ ఈ ఏడాది మరింత తగ్గిస్తూ 7 క్లినికల్ కోర్సులకు 15 శాతం సీట్లను పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోవున్న ఇన్‌సర్వీస్ కోటాను సవరిస్తూ జారీచేసిన జీవో 99 ఉత్తర్వులను ఉపసంహరించుకుని పాతకోటా విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇన్‌సర్వీస్ కోటాను ఏటా మార్చకుండా రాబోయే సంవత్సరాలకు వర్తించేలా పారదర్శకతతో కూడిన ఏకీకృత విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాలని కోరుతున్నారు.
ఆందోళన కార్యారణ ఇలా..
జిల్లావ్యాప్తంగా 62 పీహెచ్‌సీలున్నాయి. ఒక్కో పీహెచ్‌సీకి ఇద్దరు చొప్పున వైద్యాధికారు లు విధులు నిర్వర్తిస్తుంటారు. ప్రతీ పీహెచ్‌సీకి రోజుకు సగటున 80 నుంచి 150 మంది వరకు రోగులు వస్తుంటారు. శనివారం నుంచి 104 వాహనాల్లో సంచారవైద్యసేవ, ఫ్యామిలీ డాక్టర్, తదితర గ్రామీణ ప్రాంతాలకెళ్లి అందించే వైద్య సేవలన్నీ నిలిపివేయగా, ఆదివారం వైద్యఆరోగ్య శాఖ అధికారిక విధులు, క్షేత్రస్థాయిలో వైద్య సేవలు, వాటిని నమోదు చేయడం, ప్రభుత్వ ఆరోగ్యపథకాల అమలు, పర్యవేక్షణ వంటివి పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన వాట్సాప్ గ్రూ పుల నుంచి వైదొలగుతారు. సోమవారం నుంచి అత్యవసర వైద్యసేవలైన డెలివరీలు, పాము కాటు, పాయిజనింగ్, రోడ్డుప్రమాదాలు వంటి కేసులకు మాత్రమే పరిమితమై, ఓపీ కేసులను బహిష్కరిస్తారు. ఈ నెల 30న జిల్లా కేంద్రంలో జిల్లాస్థాయి ఆందోళన శిబిరాన్ని ప్రారంభించి, డాక్టర్లందరూ నిరసనలో పాల్గొంటారు. అక్టోబ రు 1న ర్యాలీలు, 2న వైద్యాధికారుల సంఘం రాష్ట్ర కార్యవర్గం విజయవాడలో తీసుకునే కార్యాచరణను బట్టి తదుపరి దశ ఆందోళనను ఉధృతం చేస్తారు. పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న డాక్టర్లకు టైంబౌండ్‌తో కూడిన పదోన్నతులు ఇవ్వాలని కోరుతున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ సెకం డరీ హెల్త్ విభాగంలో పనిచేస్తున్న వైద్యులకు రెండేళ్లకే సివిల్ సర్జన్లుగా ప్రమోషన్లు వస్తుం డగా, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ విభాగంలో పనిచేస్తున్న వైద్యాధికారులు రిటైరయ్యేవరకు అదే కేడర్‌లో ఉండిపోతున్నారని వివరిం చారు. గిరిజన ప్రాంత పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యులకు ట్రైబల్ అలవెన్స్, వెహికల్ అలవెన్స్ ప్రభుత్వం చెల్లించడం లేదని చెబుతున్నారు. నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ల్యాబ్ టెక్నీషియన్ల మద్దతు
పీహెచ్‌సీల డాక్టర్ల ఆందోళనకు ఏపీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ల సంఘం మద్దతును ప్రకటించింది. వైద్యాఽధికారుల న్యాయబద్దమైన హక్కులసాధనకు ఆందోళన/సమ్మెలో ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొంటారని ఆ సంఘ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆర్.వి.ఎస్.ఎన్.మూర్తి, జిల్లా అద్యక్షుడు జి.ఆనందరావు, కార్యదర్శి పి.కరుణకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. –––––––––––––––––––