పురుగుల మందుతో జాగ్రత్త
ABN , Publish Date - Sep 16 , 2025 | 12:06 AM
వ్యవసాయం అంటేనే కష్టనష్టాలతో కూడుకున్న పని. ప్రకృతిలో మార్పులు చోటుచేసుకుంటే ఆరుగాలం పండించిన పంట చేతికొస్తుందో రాదోననే భయం అన్నదాతలను వేధిస్తుంది.
అత్తిలి/లింగపాలెం, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): వ్యవసాయం అంటేనే కష్టనష్టాలతో కూడుకున్న పని. ప్రకృతిలో మార్పులు చోటుచేసుకుంటే ఆరుగాలం పండించిన పంట చేతికొస్తుందో రాదోననే భయం అన్నదాతలను వేధిస్తుంది. ఉమ్మడి జిల్లాలో లక్షల ఎకరాలలో వరి, మొక్కజొన్న, పత్తి, మినుము, పెసర, పలురకాల ఉద్యాన, వాణిజ్య పంటలు సాగుచేస్తున్నారు. తెగుళ్ల నుంచి పంట రక్షించుకునే క్రమంలో పురుగు మందుల పిచికారీ సమయంలో రైతులు అనారోగ్యాల పాలవుతున్నారు. పురుగు మందులు అసలు, నకిలీ తెలుసుకునేందుకు మూత తీసి వాసన చూస్తుంటారు. పురుగు మందుల ఘాటుకు కడుపులో వికారం, వళ్లంతా దద్దుర్లు రావడం, ఊపిరితిత్తులు, కళ్లు, గొంతు సమస్యలు తలెత్తుతాయి. శరీర అవయవాల పని తీరు మందగించడం, కంటిచూపు తగ్గడం, ఊపిరి తిత్తులు పాడవడం వంటి అనారోగ్యకారణాలు చోటుచేసుకుంటాయని వైద్య నిపుణులు, వ్యవసా యశాఖ అధికారులు చెబుతున్నారు.
వీటిని పాటించాలి
పిచికారి చేసే సమయంలో రైతులు ముక్కు, నోటికి మాస్క్, చేతులకు గ్లౌజులు ధరించాలి.
తలకు రక్షణగా టోపీ పెట్టుకోవాలి.
శరీరం మొత్తం కప్పిఉంచే ఆఫ్రాన్ ధరించాలి.
ఉదయం, సాయంత్రం వేళల్లో గాలి వాలుగానే పిచికారి చేయాలి.
అనారోగ్య సమస్యలు వస్తే వైద్య సేవలు పొందాలి.
పురుగు మందు నేరుగా ట్యాంకులో కలపకూడదు. విడివిడిగా వేరే ప్రాంతాల్లో కలుపుకొని మిశ్రమాన్ని ట్యాంకులో పోసుకోవాలి.
పురుగు మందు, తెగుళ్లు మందు రెండింటిని కలిపి పిచికారి చేయవద్దు, విడివిడిగా కలుపుకోవాలి.
కలుపు నాశని మందును పిచికారి చేశాక ట్యాంకు శుభ్రంగా కడగాలి.
పురుగు మందు విరిగిపోతే దాన్ని పిచికారి చేయకూడదు.
పిచికారి సమయంలో ధూమపానం, మద్యపానం చేయకూడదు. పాన్‌పరాగ్, గుట్కాలు నమలకూడదు. వీటి ద్వారా పురుగు మందు అవశేషాలు నోటి ద్వారా ఊపిరితిత్తులకు చేరతాయి.
సేంద్రియ సాగు పద్ధతులు ఆచరించాలి
పురుగుమందులలో అధిక గాఢత వలన చర్మ సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తున్నాయి. మెదడుపై కూడా ప్రభావం చూపుతాయి. పురుగుమందుల పిచికారీ తర్వాత కళ్లు తిరగడం, వాంతులు, విరోచనాలు, కళ్లమంట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ విధానంతో క్రిమిసంహారక పురుగుమందులు లేకుండానే తెగుళ్లను నివారించవచ్చు.
– వి.ప్రదీప్‌కుమార్, ఏవో, లింగపాలెం