పది పరీక్షలకు పక్కా ప్రణాళిక
ABN , Publish Date - Dec 04 , 2025 | 01:19 AM
పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించే దిశగా ప్రభుత్వం, అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు.
భీమవరం రూరల్, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించే దిశగా ప్రభుత్వం, అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా విద్యా శాఖ అడుగులు వేస్తుంది. కార్యాచరణ రూపొందించి విద్యార్థులకు మెటీరియల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ నెల 6 నుంచి వంద రోజుల ప్రణాళికగా నడపనున్నారు.
వంద రోజుల ప్లాన్‌లో మార్పులు
ఈసారి టెన్త్ విద్యార్థుల ఉత్తీర్ణతపై దృష్టి పెట్టి విద్యాశాఖ వంద రోజుల యాక్షన్ ప్లాన్‌లో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే 12,890 విద్యార్థుల ఉత్తీర్ణత లక్ష్యంగా పెట్టుకున్నారు. వెనుకబడిన విద్యార్థులను ఉత్తీర్ణులు చేసే దిశగా బోధన ప్లాన్ రూపుదిద్దారు. ముందుగా ఏ, బీ, సీ, డీ నాలుగు కేటగిరీలుగా విద్యార్థులను విభజిస్తారు. ఏ, బీ లను వంద రోజుల ప్లాన్‌లో నడిపిస్తారు. సీ విద్యార్థులపైన ప్రత్యేక ఫోకస్ పెడతారు. ఇక డీ కేటగిరీ బాగా డల్లర్ విద్యార్థులుగా నిర్ణయించారు. వీరిలో ముగ్గురు విద్యార్థులను ఒక ఉపాధ్యాయునికి అప్పగిస్తారు. ఆ సబ్జెక్టులో వారిని ముందుకు తీసుకువచ్చేలా బాధ్యతలు అప్పగిస్తారు. దీనివల్ల ఫెయిల్ ప్లేస్‌లో ఉన్నా వీరు ఉత్తీర్ణత బాట పడతారు. ఇక నుంచి విద్యార్థులకు ప్రతిరోజు బోధన పూర్తయ్యాక వాటిపై పరీక్ష నిర్వహిస్తారు. గత ఏడాది వారానికి ఒకసారి పరీక్ష పెట్టారు దానిలో మార్పు తెచ్చారు. రోజు పూర్తయిన పరీక్షలో విద్యార్థుల ప్రతిభ వివరాలు ఒక మ్యాప్‌లో పొందుపరచాలి.
రేపు పేరెంట్స్, ఉపాధ్యాయ మీటింగ్‌లో చర్చ
ఈ నెల 5న జరగనున్న మెగా పేరెంట్, ఉపాధ్యాయ మీట్‌లో టెన్త్ విద్యార్థుల ప్రతిభపైన తల్లిదండ్రులతో చర్చ జరగనుంది. ఎస్‌ఐ పరీక్షలలో విద్యార్థులకు వచ్చిన మార్కులు బట్టి ప్లాన్ రూపుదిద్దనున్నారు. టెన్త్ విద్యార్థుల ప్రొగ్రెస్ రిపోర్ట్ క్తుప్లంగా పరిశీలించి విద్యార్థికి ఏవిధంగా బోధ న అవసరంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిర్ణయానికి రావాల్సి ఉంది.
ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ విద్యార్థులు
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి కాగా రేపటికి 100 రోజులు ఉంది. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిలవాలనే ప్రణాళిక నడుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో చివరి మూడు సంవత్సరాలు ప్రభుత్వ విద్యార్థులు టౌన్‌లో 50 శాతం లోపు ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేట్ వారు 90 శాతం పైన ఉన్నారు. గత ఏడాది 70 శాతం ఉత్తీర్ణతగా ప్రభుత్వ విద్యార్థులు నిలిచారు. ప్రైవేట్ విద్యార్థులు 90 శాతంగా ఉత్తీర్ణత సాధించారు. 2025–26 విద్యా సంవత్సరంలో 100 శాతం ఉత్తీర్ణత వైపు ప్రభుత్వ విద్యార్థులు నడిచేలా ప్రణాళిక ఏర్పాటు చేశారు.