Share News

అవ్వకు పింఛను.. మంత్రికి దీవెన

ABN , Publish Date - May 02 , 2025 | 12:21 AM

పూలపల్లిలో గురువారం ఉదయం మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌, సచివాలయ సిబ్బందితో కలిసి వృద్ధులకు పింఛన్లు అందజేశారు.

అవ్వకు పింఛను.. మంత్రికి దీవెన
వృద్ధురాలికి పింఛన్‌ అందజేస్తున్న నిమ్మల

పూలపల్లిలో మంత్రి నిమ్మల పింఛన్ల పంపిణీ

పాలకొల్లు రూరల్‌, మే 1 (ఆంధ్రజ్యోతి) : పూలపల్లిలో గురువారం ఉదయం మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌, సచివాలయ సిబ్బందితో కలిసి వృద్ధులకు పింఛన్లు అందజేశారు. దమ్మా అప్పల నరసమ్మ అనే అవ్వ ఇంటికి వెళ్లి పింఛన్‌ అందిస్తూ అవ్వా బాగున్నావా? అంటూ మంత్రి పలకరించారు. వృద్ధురాలు వచ్చావా నాయనా అనగానే.. నన్ను గుర్తుపట్టావా అని మంత్రి నిమ్మల అడిగారు. బాబా నీవు రామానాయుడువే కదా గుర్తుపట్టాను.. అనగానే స్థానికులు చప్పట్లు కొట్టారు. 97 ఏళ్ల వయసులో కళ్లు నలుపుకుంటూ చూస్తూ, ఆయన మాటను గుర్తుపట్టడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. స్థానికులు మంత్రితో మాట్లాడుతూ మీరు ఈ అవ్వకు బాగా తెలుసని, కరోనా సమయంలో సైకిల్‌పై మా వీధికి వచ్చి అందరితో పాటు అవ్వను పలకరించి బియ్యం, సరుకులు, కూరగాయలు అందించారని, అప్పటి నుంచీ బాగా గుర్తుండిపోయారని చెప్పారు. అవ్వకు పింఛన్‌ అందించ గా నీవు చల్లగా ఉండాలంటూ మంత్రిని అవ్వ దీవించింది. మంత్రి నిమ్మల వెంట ఏఎంసీ చైర్మన్‌ కోడి విజయభాస్కర్‌, ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, కార్యదర్శి పాలా శ్రీనివాసు, నాయకులు, తదితరులు ఉన్నారు.

ఎవరైనా సొమ్ములు అడుగుతున్నారా..?

పశ్చిమ ప్రత్యేకాధికారి సూర్యకుమారి ఆరా

భీమవరం టౌన్‌: చిన అమిరం గ్రామంలో పింఛన్ల పంపిణీలో గురువారం మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ, జిల్లా ప్రత్యేక అధికారి ఎ.సూర్య కుమారి పాల్గొన్నారు. పింఛన్ల పంపిణీ సక్రమంగా జరుగుతుందా, సిబ్బంది డబ్బులు అడుగుతున్నారా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదని లబ్ధిదారులు చెప్పడంతో ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి కుటుంబ యోగక్షేమాలు, పిల్లల చదువులు గురించి ఆరా తీశారు. పింఛను సొమ్ము దుర్వినియోగం చేయకుండా కుటుంబ అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు. ఆర్‌ఐ నాగభూషణం, గ్రామ కార్యదర్శి దుర్గాప్రసాద్‌, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2025 | 12:21 AM