Share News

విద్యార్థుల ప్రతిభకు మెరుగులు దిద్దేలా

ABN , Publish Date - Nov 20 , 2025 | 11:43 PM

విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య వారధిగా మారిన మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌ వచ్చే నెల 5న నిర్వహించనున్నారు.

విద్యార్థుల ప్రతిభకు మెరుగులు దిద్దేలా

5న మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ మీట్‌

భీమవరం రూరల్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య వారధిగా మారిన మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌ వచ్చే నెల 5న నిర్వహించనున్నారు. ఈ మధ్యనే జరిగిన ఎస్‌ఏ–1 పరీక్షల మార్కులపై టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించనున్నారు. విద్యార్థి చదువులో ఏ దశలో ఉన్నారు ? వారిని మరింత మెరుగుపరచడానికి ఏం చేయాలి అనే అంశంపై సమావేశం ప్రధాన అంశంగా సాగనుంది. దానిని బట్టి విద్యా సంవత్సరం చివరి పరీక్షలలో విద్యార్థులు ప్రతిభావంతులుగా మారడానికి అవకాశం ఉంటుంది.

ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో బోధనలో ఎన్నో మార్పులు తీసుకువచ్చింది. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు పాఠ్య పుస్తకాల బరువు తగ్గించారు. రెండు సెమిస్టర్ల విద్యా విధానం అందుబాటులోకి తెచ్చారు. వీటివల్ల కలిగిన ఉపయోగాలను జిల్లాలోని 1,375ప్రభుత్వ పాఠశాలల్లోని 90 వేల విద్యార్థు ల తల్లిదండ్రుల నుంచి ఉపాధ్యాయులు సమావేశంలో అడగనున్నారు.

టెన్త్‌ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి

2025–26 విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత పెంచేలా బోధన జరుగుతోంది. డిసెంబరు మొదటి వారం నుంచి 100 రోజుల ప్రణాళిక అమలుకానుంది. ప్రత్యేక మెటీరియల్‌తో బోధన, అదనపు తరగతు లు జరగనున్నాయి. ఏ, బీ, సీ, డీ కేటగిరీల వారీగా విద్యార్థులను కేటాయించి వెనుకబడిన వారిని ప్రత్యేక బోధన నిర్వహించనున్నారు. ఈ విద్యా సంవత్సరంలో టెన్త్‌ పరీక్షలకు ప్రభుత్వ పాఠశాలల నుంచి 12,890 మంది విద్యార్థులు, ప్రైవేట్‌ పాఠశాలల నుంచి 10,337 మంది, మొత్తం 23,227 మంది విద్యార్థులు పరీక్ష రాస్తారు. అందువల్ల ప్రభుత్వ పాఠశాలల్లోని టెన్త్‌ విద్యార్థుల తల్లిదండ్రులతో మెగా పేరెంట్‌, టీచర్‌ మీటింగ్‌లో విద్యాబోధనపైన ఇంటి వద్ద ఎలా చదివించాలో ఉపాధ్యాయులు మాట్లాడనున్నారు. గత ఏడాది టెన్త్‌ ఫలితాల్లో 70 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఈసారి నూరు శాతం ఉత్తీర్ణత ఆలోచన ఉంది. గత ప్రభుత్వ హయాంలో 2020–21 నుంచి 2023–24 సంవత్సరాలలో 40 నుంచి 50 శాతం మధ్యనే ఉత్తీర్ణతగా విద్యార్థులు నిలిచారు. దీనిని 70 శాతంగా తీసుకొచ్చిన ప్రభుత్వం 2025–26 ఉత్తీర్ణతపెరుగుదల టీచర్ల బాధ్యతగా పెట్టింది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారంతో అది సాధించాలని చూస్తున్నారు.

ముచ్చటగా మూడోసారి

ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు మెరుగ్గా చదవాలనే లక్ష్యంతో ప్రభుత్వం వుంది. అలా చదివినప్పుడే టెన్త్‌లోనూ నూరు శాతం ఉత్తీర్ణతతోపా టు మంచి ర్యాంకుల్లో నిలుస్తారు. ఇందు కు మెగా పేరెంట్‌, టీచర్స్‌ మీటింగ్‌ ఉప యోగపడుతుంది. గత ఏడాది డిసెంబ రులో, ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలో వీటిని నిర్వహించారు. ఇప్పుడు మూడోసారి నిర్వహించనున్నా రు. ఇందులో విద్యార్థి పరీక్షల మార్కుల ప్రోగ్రెస్‌పై చర్చిస్తారు.

Updated Date - Nov 20 , 2025 | 11:43 PM