పంచాయతీరాజ్ x రెవెన్యూ
ABN , Publish Date - Oct 16 , 2025 | 12:15 AM
ప్రభుత్వ కార్యాలయాల ప్రహరీ నిర్మాణంపై రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు గొడవ పడుతున్నాయి.
మండల పరిషత్, తహసీల్దార్ కార్యాలయాల మధ్య గోడ తగాదా
ప్రహరీ కూల్చివేశారంటూ రెవెన్యూ శాఖపై మండల పరిషత్ ఆరోపణ
పెంటపాడు, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కార్యాలయాల ప్రహరీ నిర్మాణంపై రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు గొడవ పడుతున్నాయి. పెంటపాడు మండలంలో మండల పరిషత్, తహసీ ల్దార్, మహిళా సమాఖ్య, ఎంఈవో, సర్వేయర్, హౌసింగ్, వ్యవసాయ శాఖ తదితర కార్యాలయలు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. మండల పరిషత్ నిధులు రూ.10 లక్షలతో ప్రాంగణం చుట్టూ ప్రహరీ నిర్మించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద గోడ కొంచెం మలుపు తిరిగింది. అక్కడ గోడను తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది కూల్చి వేశారని, ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన గోడను బాధ్యత కల్గిన అధికారులు ఎలా కూల్చి వేస్తారని మండల పరిషత్ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ స్థలం అక్కడి వరుకూ మాత్రమే ఉందని, దీనితో తాము గోడను ఆవిధంగా నిర్మించామని చెబుతున్నారు.
దీనిపై తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది మరో విధంగా చెబుతున్నారు. తొలుత తమకు గోడను ఇలా నిర్మాణం చేస్తామని చెప్పలేదని, గోడవరుకూ కట్టి ఫెన్సింగ్ వేస్తామన్నారన్నారు. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా గోడ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. తాము గోడను పడగొట్టలేదని ఉద యం నిర్మాణం చేయడంతో స్థలం చూసే ప్రయ త్నంలో అనుకోకుండా గోడ పడిపోయిందని చెబు తున్నారు. అయితే రెవెన్యూ వర్గాల వాదనను మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది ఒప్పుకోవడం లేదు. కొన్ని రోజుల క్రితం గోడ నిర్మాణం జరిగిందని, బుధవారం కేవలం ప్లాస్టింగ్ మాత్రమే చేయడం జరిగిందంటున్నారు
గోడ కూల్చడం సరికాదు
ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సి వారు ఇలా గోడను కూల్చడం సరికాదు సమస్య ఉంటే నేరుగా వచ్చి మాతో మాట్లాడాలి. ఇలా కూలగొట్టడం సమంజసం కాదు. కనీసం మాతో సంప్రదించలేదు ఇలా జరిగినందుకు చాలా బాధగా ఉంది. జరిగిన సంఘటన స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం.
– పీవీవీఎస్ రాంప్రసాద్, ఎంపీడీవో
మాకు చెప్పకుండా నిర్మించారు
గోడ నిర్మాణంపై ముందు మాకు ఒక విధంగా చెప్పారు. తరువాత ప్లాన్ మార్చి వేరేవిధంగా నిర్మించారు. కనీసం మాతో సంప్రదించలేదు. ఇలా చేయడం సరికాదు. మా వాళ్లు గోడ పడగొట్టలేదు. అప్పుడే కట్టిన గోడ కారణంగా స్థలం చూసేప్పుడు అది పడిపోయింది. దీనిపై గురువారం సర్వేయర్‌ని పిలిపించి సర్వే చేయిస్తాం.
– రాజరాజేశ్వరి, తహసీల్దార్