ధాన్యం కొనుగోళ్లు స్పీడ్
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:06 AM
జిల్లాలో ఽఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటిదాకా 4.19 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. జిల్లాలోని 63,892 మంది రైతుల వద్ద ధాన్యాన్ని సేకరించింది. ధాన్యం మొత్తానికి సొమ్ములు జమ చేసింది.
భారత ఆహార సంస్థకు బియ్యం అప్పగింత
ఇప్పటివరకు సేకరించిన ధాన్యం 4 కోట్ల 19 లక్షల టన్నులు
మొత్తం సొమ్ములు రూ. 974 కోట్లు జమ
మరో 30 వే ల టన్నులు వస్తాయని అంచనా
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ఽఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటిదాకా 4.19 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. జిల్లాలోని 63,892 మంది రైతుల వద్ద ధాన్యాన్ని సేకరించింది. ధాన్యం మొత్తానికి సొమ్ములు జమ చేసింది. సుమారు రూ. 974 కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. మరో 30 వేల టన్నులు రైతుల వద్ద నిల్వ ఉన్నాయని అధికారులు అంచనా వేశారు. రైతుల నుంచి కొనుగోలు చేయాలని కసరత్తు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల నుంచి మండలాల వారీగా వివరాలు సేకరించారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం 5 లక్షల టన్నుల ధాన్యం సేకరించేలా ఫ్రణాళిక చేసింది. జిల్లా పౌరసరఫరాల కార్పొరేషన్‌కు లక్ష్యాన్ని నిర్దేశించింది. తుఫాన్లు, అధిక వర్షాలు కారణంగా దిగుబడులు తగ్గాయి. దాంతో ధాన్యం కొనుగోళ్లు తక్కువయ్యాయి. లేదంటే లక్ష్యానికి మించి కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఈ ఏడాది ప్రైవేటు వర్తకులు జిల్లాలో కొనుగోలు చేయలేదు. తాడేపల్లి గూడెం, తణుకు మండలాల్లో రైతుల నుంచి తూర్పు గోదావరి జిల్లా రైతులు ధాన్యాన్ని కొనుగోలు చేసేవారు. ఈ ఏడాది కొనుగోలు చేయకపోవడంతో రైతులంతా ప్రభుత్వానికే విక్రయించారు. దాంతో ఽ4.20 లక్షల టన్ను లకు చేరుకోగలిగారు. మద్దతు ధర కూడా రైతులకు లభించింది. రైతుల వద్ద మిగిలి ఉన్న ధాన్యాన్ని కొను గోలు చేయడానికి జిల్లా అధికారులు ప్రణాళిక చేశారు.
భారత ఆహార సంస్థకు బియ్యం
రైతులకు సకాలంలో సొమ్ములు చెల్లించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. రాష్ట్రంలో రేషన్ బియ్యానికి మించి బియ్యం ఉత్పత్తి అవుతు న్నాయి. మిగులు బియ్యాన్ని కేంద్రం ఆధ్వర్యంలోనే భారత ఆహార సంస్థకు అప్పగించేలా సన్నాహాలు చేసింది. తద్వారా ప్రభుత్వంపై అంతగా బారం ఉండదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బియ్యానికి 48 గంటల వ్యవధిలోనే బిల్లులు మంజూరు చేస్తున్నది. దీనివల్ల రాష్ట్రంలో రైతులకు సకాలంలో సొమ్ములు చెల్లించే అవకాశం ఉటుంది. ఖరీఫ్‌లో 24 గంటల వ్యవధిలో రైతు ఖాతాలో సొమ్ములు జమ చేశారు. ముందుగానే ప్రభుత్వం సొమ్ములను తమ వద్ద సిద్ధంగా ఉంచుకుంది. అదే రైతులకు ప్రయోజనం చేకూర్చింది. సకాలంలో సొమ్ములు చేతికందాయి. రబీలోనూ ఇదే తరహాలో సొమ్ములు జమ చేసేలా ముందస్తు కార్యాచరణ రూపొందించింది.ఖరీఫ్‌లో ఉత్పత్తి అయ్యే బియ్యాన్ని కేంద్రానికి అప్పగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు సమ్మతించింది, జిల్లాలో 1.40 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రస్తుత ఖరీఫ్‌లో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు అప్పగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటిదాకా 68 వేల టన్నులు చేరిపోయాయి. మిగిలిన 72 వేల టన్నులు కూడా త్వరితగతిన అందజేయ నున్నారు. బియ్యానికి సంబంధించిన సొమ్ములను ఎఫ్‌సిఐ ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నది. ఇది వచ్చే రబీకి కూడా ఉపయోగ పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు పుష్కలంగా ఉంటాయి. రబీలో కొనుగోళ్లు వేగవంతం కానున్నాయి.