Share News

రైతుకు కోత కష్టాలు

ABN , Publish Date - Nov 07 , 2025 | 01:13 AM

తుఫాన్‌ దెబ్బ రైతులకు చుక్కలు చూపిస్తోంది. ఎకరా వరికోతకు రూ.9 వేలు ఖర్చవుతోంది.

రైతుకు కోత కష్టాలు
జగన్నాధపురంలో నేలనంటిన వరిపంట

ఎకరానికి రూ.9 వేలు

తుఫాన్‌ దెబ్బకు అదనపు భారం

తాడేపల్లిగూడెం రూరల్‌, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ దెబ్బ రైతులకు చుక్కలు చూపిస్తోంది. ఎకరా వరికోతకు రూ.9 వేలు ఖర్చవుతోంది. ఎకరా వరికోతకు మిషన్‌ నిమిత్తం గంటకు రూ.3 వేలు వ్యయం అవుతుంది. సాధారణంగా గంట 15 నిముషాల్లో కోత పూర్తయ్యేది. కానీ ప్రస్తుతం ఆ వ్యవధి 3 గంటలు దాటుతోంది. దీంతో ఎకరా వరికోతకు 3 గంటలకు గంటకు 3 వేలు చొప్పున రూ.9 వేలు ఖర్చు కనిపిస్తుంది. దీనికితోడు ధాన్యం ఆరబెట్టి బస్తాల్లో నింపి లారీలో ఎగుమతి చేసేందుకు బస్తాకు రూ.150 చెల్లించాల్సి వస్తోంది. అంటే ఎకరాకు 30 బస్తాల దిగుబడి వస్తే ఆ నిమిత్తం మరో రూ.4500 భరించాల్సిన పరిస్థితి. దీంతో ఎకరా వరిపంట లారీల్లో చేరడానికి ఎకరానికి రూ.13,500 భారం మోయాల్సి వస్తోంది. ఏడాదిపాటు కష్టపడి పండించిన పంట వది లేయలేక మరోపక్క కోసేందుకు భారం భరించలేక సతమతమవుతున్నారు. ఖర్చుభారం భయపెడుతుంటే మరోపక్క వాతావరణం హడలెత్తిస్తోంది.అకస్మాత్తుగా వర్షాలు వేదిస్తున్నాయి. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే ప్రభుత్వమే గిట్టుబాటు ధర పెంచి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ప్రభుత్వమే ఆదుకోవాలి..

–చనుబోయిన శ్రీను, తాళ్లపాలెం

తేమశాతం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ప్రస్తుతం వ్యయభారం తట్టుకోలేక పోతున్నాం. ఇంత చేసినా రైతుకు మిగిలేది ఏమీ కనపడటం లేదు. ప్రభుత్వం గిట్టు బాటు ధర పెంచితే కానీ రైతులకు పెట్టిన పెట్టుబడి చేతికి రాదు.

Updated Date - Nov 07 , 2025 | 01:14 AM