సార్వా ముగిసింది.. దాళ్వా జోరు
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:52 AM
దాళ్వా సీజన్‌లో వరి సాగులో జాప్యం లేకుండా రైతులు నారుమడులకు సన్నద్ధమయ్యారు.
వరి సాగు విస్తీర్ణం 2.27 లక్షల ఎకరాలు
8 వేల ఎకరాల నారుమడి అవసరం
ఇప్పటికే 3 వేల ఎకరాల్లో నారుమడులు
సంక్రాంతి నాటికి నాట్లు వేయాలని లక్ష్యం
దాళ్వా సీజన్‌లో వరి సాగులో జాప్యం లేకుండా రైతులు నారుమడులకు సన్నద్ధమయ్యారు. సార్వా మాసూళ్లకు తుఫాన్, వర్షాలతో ఆలస్యం కావడంతో దీనిని అధిగమించేందుకు మాసూళ్లు అయిన వెంటనే నారుమడి వేస్తున్నారు. జిల్లాలో దాళ్వా సాగు విస్తీర్ణం 2.27 లక్షల ఎకరాలు. 11 వేల ఎకరాల్లో నారుమడులు వేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 3 వేల ఎకరాల్లో నారుమడి వేశారు. మిగిలిన ప్రాంతాల్లో నారుమడుల పనులు ముమ్మరంగా చేస్తున్నారు.
భీమవరం రూరల్, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): దాళ్వా సాగు త్వరితంగా సాగితేనే దిగుబడులు బాగుంటాయని రైతుల నమ్మకం. అక్టోబరు రెండో వారంలో కురిసిన వర్షాలు, మూడో వారంలో మొంథా తుఫాన్‌తో సార్వా సీజన్‌లో పంట మాసూళ్లు ఆలస్య మయ్యాయి. ఆ ప్రభావం దాళ్వా నారుమడులపై పడింది. అయినప్పటికీ రైతులు సంక్రాంతి లోపే దాళ్వా నాట్లు వేసేలా ప్రణాళిక చేసుకుంటున్నారు. ఈ నెల 20లోపు వేసిన నారుమడులు జనవరి 15 లోపు నాట్లుగా వేసుకోవచ్చు. బెంగాలీ నాట్లు అయితే నారుమడి వేసిన 15 రోజులకే నాట్లు వేసుకోవచ్చు. ఆ లెక్కన సంక్రాంతి పండుగలోపు 70 శాతం పైగా నాట్లు వేసుకోవచ్చు.
విత్తన ఎంపికలో కొత్త రకాలు
దాళ్వా సీజన్‌లో సూపర్ ఫైన్ వరి రకాలను రైతులు ఎంచుకుంటున్నారు. ఎంటీయూ 1426, 1282 సూపర్ ఫైన్ రకాల సాగు పెరగనుంది. గతంలో ఎక్కువగా 1121, 1156, 1153 రకాలు సాగు చేసే వారు. 1156, 1153 కొనుగోలు పెద్దగా లేదు. వాటికి బదులు 1426, 1282 రకాలు కొనుగోలు బాగుంటుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.
డెల్టాలో దిగుబడి దెబ్బ
గడిచిన సార్వా సీజన్‌లో వరి సాగు ఆరంభంనుంచి వాతావరణం అనుకూలించడంతో అధిక దిగుబడులు రావచ్చని రైతులు భావించారు. పంట ఈనిక దశలో ప్రతికూల వాతావరణం రైతు ఆశలపై నీళ్లు చల్లింది. అల్పపీడనం, వర్షాలు నష్టం చేకూర్చింది. ముంపు వచ్చింది. దీంతో ఎండాకు తెగులు, పొడ మానుకాడ వచ్చింది. ఎకరాకు 20 బస్తాల లోపు దిగుబడికి పడిపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఎకరం పది బస్తాలే అయ్యాయి. మొదట్లో సార్వా పంట జిల్లాలో 4.5 లక్షల టన్నుల నుంచి 5 లక్షల టన్నులు వస్తుందని అంచనా వేశారు. 2 లక్షల ఎకరాలు మాసూళ్లు అయ్యేసరికి 3.5 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. చాలా మంది రైతులు నష్టాల్లో పడ్డారు.
గంటల్లో ధాన్యం సొమ్ము
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వం రైతులకు గంటల వ్యవధిలోనే ధాన్యం సొమ్ములు జమ చేసి రికార్డు నెలకొల్పిం ది. పెంటపాడు మండలం ఆకుతీగపాడుకు చెంది న తంగెళ్ల సూర్యనారాయణ మూడు లారీల్లో ధాన్యం విక్రయించారు. సుమారు 24 టన్నుల ధాన్యం మిల్లుకు పంపారు. మధ్యాహ్నం 12 గంట ల సమయంలో మిల్లుకు చేరవేస్తే అదే రోజు సా యంత్రం 4 గంటలకు అతని ఖాతాలో సొమ్ములు జమయ్యాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం. తుఫాన్, వర్షాలతో దిగుబడులు తగ్గాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం 3.58 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. రైతులకు రూ 811 కోట్లు జమ చేసింది. అందులో రూ.789 కోట్లు 24 గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. మరో 42 కోట్లు 48 గంటలలోపే జమ చేయడంతో రైతులు జోష్ మీదున్నారు.