Share News

పీ–4 దారెటో?

ABN , Publish Date - Oct 15 , 2025 | 12:29 AM

జిల్లాలో పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ–4 కార్య క్రమం దత్తత తీసుకోవడం దగ్గరే నిలిచిపోయింది.

పీ–4 దారెటో?
ఆగిరపల్లిలో ఎంపికైన బంగారు కుటుంబంతో సీఎం చంద్రబాబు (ఫైల్‌)

బంగారు కుటుంబాలకు సాంత్వన ఎన్నడో..

71,876 కుటుంబాల దత్తతకు..6,296 దాతలు ముందుకు..

ఇప్పటి వరకు దత్తత తీసుకున్నది 31,608 మందిని మాత్రమే

వసతులు, ఉపాధి కల్పనపై బంగారు కుటుంబాల ఆశలు

(ఏలూరు– ఆంధ్రజ్యోతి)

పేదరికం లేని సమాజమే లక్ష్యంగా పీ– 4 కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ఈ ఏడాది ఏప్రిల్‌ 11న ఆగిరిపల్లిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టారు. జిల్లా అంతా బంగారు కుటుంబాలు ఎంపిక చేసి రెండు నెలలవుతోంది. అయితే ఆచరణలో పేదలకు ఉపాధి, ఉద్యోగ, ఇతర శిక్షణ కార్యక్రమాలకు ఇంకా అంకురార్పణ జరగలేదు. దీంతో అనుకున్న లక్ష్యాలకు ఎప్పుడు చేరతారో అన్నది ప్రశ్నగా మారింది.

జిల్లాలో పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ–4 కార్య క్రమం దత్తత తీసుకోవడం దగ్గరే నిలిచిపోయింది. విద్యా,వైద్యం, ఉపాధి, ఉద్యోగాలు, ఇతర ఉపాధి శిక్షణలతో ప్రతీ పేద కుటుంబం అభ్యున్నతి సాధించాలన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. దాతల చేయూత కోసం జిల్లాలోని బంగారు కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. నూజివీడు మండలం ఆగిరిపల్లిలో ఏప్రిల్‌ 11న ఈ బంగారు కుటుంబాలతో, వ్యాపారవేత్తలతో సీఎం ముఖా ముఖి నిర్వహించారు. ఇందులో వేదికపైనే 60 కుటుంబాలను దత్తత తీసుకోవడానికి ఆరుగురు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. తదనంతరం నియోజకవర్గాల వారీగా బంగారు కుటుంబాల ఎంపికలకు జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేశారు. ఈ ప్రక్రియను ఆగస్టు 15వ తేదీ నాటకి డేటా ఎంట్రీ, బంగా రు కుటుంబాలు లెక్కలను తేల్చడం తో పాటు మార్గదర్శ కులను ఖరారు చేశారు.

ఊరట ఎన్నడో ?

జిల్లాలో 605 వార్డు సెక్రటరీల పరిధిలో మొత్తం 598 పరిసర ప్రాంతాల ను కలుపుతూ ఎంపిక చేపట్టారు. ఇందులో 27 మండలాలు, ఏలూరు కార్పొరేషన్‌, నూజివీడు, జంగారెడ్డిగూడెం మునిసిపాలిటీలతో పాటు చింతలపూడి నగర పంచాయతీని కలిపి మొత్తం 71,876 కుటుంబాల్లో లక్షా90,623 మంది సభ్యులను లెక్కగట్టారు. ఇందులో కేవలం 31,608 మందిని మాత్రమే 6,296 మంది దత్తత స్వీకరణకు అంగీకరించారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా లక్షా అరవైవేల మందికి పైబడి దత్తత స్వీకరణకు మార్గదర్శకులను ఒప్పించాల్సి ఉంది.

నిర్బంధం కాదు.. స్వచ్ఛందంగానే ..

పేదలను ఆదుకునే క్రమంలో వ్యాపారవేత్తలు, ఇతర స్వచ్ఛంద సంస్థలను ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగానే భాగ స్వామ్యులను చేయాలని ప్రభుత్వం స్పష్టంగానే ఆదేశించింది. ఆ క్రమంలోనే పేదలను ఆదుకునేందుకు కొన్ని ప్రభుత్వ శాఖలు రంగంలోకి దిగి తమ,తమ శాఖల ద్వారా ప్రయోజన పొందేవారిని, బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవ డానికి మార్గదర్శకులుగా ఎంపిక చేసింది. తీరా ఆచరణలో వ్యాపారవేత్తలు పేద కుటుంబాలను ఆదుకునే చర్యలు ప్రారంభించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

ఆగిరిపల్లిలో డ్రైవింగ్‌ శిక్షణతోనే సరి

నూజివీడు 60 కుటుంబాలను పారిశ్రామిక వేత్తలు ఆరు గురు దత్తత తీసుకోవడా నికి ముందుకు రాగా.. ఇందులో మంత్రి కొలుసు పార్థసారథి కుమారుడు నితిన్‌ కృష్ణ కొంతమంది ట్రైసైకిళ్లను అంద జేశారు. ఆగిరిపల్లి లోనే నూజివీడు సీడ్స్‌ దత్తత తీసుకుని బ్యాచ్‌కు 30 మందికి డ్రైవింగ్‌ స్కిల్స్‌ ట్రైనింగ్‌ ప్రారంభించారు. వరుణ్‌ మోటార్స్‌ ద్వారా నెల రోజులు శిక్షణ ఇప్పిస్తున్నారు. మొత్తం 90 మంది శిక్షణ పూర్తి చేయించి వారికి 10 శాతం లోన్‌ మొత్తంలో ఈ సంస్థ సహకారం అందించనుంది. 90 శాతం రుణంతో కార్లు కొనుగోలు చేయించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు.

ఎమ్మెల్యేల భాగస్యామం ఉంటే..

పేద కుటుంబాలకు స్థానికంగా ఉపాధి మార్గాలను కల్పించే విషయంలో స్థానిక ఎమ్మెల్యేలను ఈ పీ–4 కార్యక్రమంలో ప్రభుత్వం భాగస్వామ్యం చేసి.. క్షేత్రస్థాయిలో ఏమీ జరుగుతుందో పరిశీలన చేయిస్తే అనుకున్న లక్ష్యాలు నెరవేరే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే పీ–4 లక్ష్యం మరింతగా నెరవేరుతుందని పలువురు సూచిస్తున్నారు.

Updated Date - Oct 15 , 2025 | 12:29 AM