Share News

రొయ్యకు చేటు కాలం !

ABN , Publish Date - May 26 , 2025 | 12:18 AM

వారం రోజులుగా నిత్యం ఆకాశం మేఘావృతమై ఉదయం వర్షం పడతుండడంతో ఆక్వా రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది.

రొయ్యకు చేటు కాలం !
రొయ్యల పట్టుబడి చేస్తున్న కూలీలు

వాతావరణ మార్పులతో ఉక్కిరిబిక్కిరి

చెరువుల్లో ఆక్సిజన్‌ కొరత

మృత్యువాత పడుతున్న వనామి రొయ్యలు

భారీగా నష్టపోతున్న రైతులు

కలిదిండి/మండవల్లి, మే 25 (ఆంధ్రజ్యోతి) : వారం రోజులుగా నిత్యం ఆకాశం మేఘావృతమై ఉదయం వర్షం పడతుండడంతో ఆక్వా రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. రాత్రి సమయంలో వర్షం పడుతూ, పగటి పూట ఎండ వేడికి చెరువులో పీహెచ్‌ హెచ్చుతగ్గుల కారణంగా రొయ్యలు ఒత్తిడికి గురవుతున్నాయి. సాగు ఆశాజనకంగా ఉంటుందన్న గుంపెడు ఆశతో సాగు చేపట్టారు. నెల రోజులు అంతా సవ్యంగానే సాగింది. ఇంతలో వాతావరణ మార్పులు, విపరీతమైన ఉక్కపోతతో ఆక్వా రంగం తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది.

వాతావరణంలో మార్పులతో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చెరువుల్లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడి వనామి రొయ్యలు మృత్యువాత పడుతున్నాయి. చెరువులో పిల్ల వేసిన 18 నుంచి 30 రోజుల వ్యవధి కలిగిన సాగుకు వైట్‌స్పాట్‌, విబ్రియో వంటి వ్యాధులు సోకి రొయ్యలు మృత్యువాత పడుతున్నాయి. కలిదిండి మండలంలో 10 వేల ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు. సున్నంపూడి, కలిదిండి, కోరుకొల్లు, మట్టగుంట, దుంపలకోడు దిబ్బ, కొండూరు, గొల్లగూడెం, భాస్కరావుపేట, మూల్లంక గ్రామాల్లో 200 ఎకరాల చెరువుల్లో రొయ్యలు చనిపోతుండడంతో చిన్న సైజు రొయ్యలనే హడావుడిగా పట్టుబడి చేస్తున్నారు. వీటిని రొయ్యల కంపెనీల యజమానులు కొనుగోలు చేయకపోవడంతో వారు, ఆకి వీడు మార్కెట్‌లో అమ్ముకుంటున్నారు. ఎకరాకు రూ.లక్ష వెచ్చించి ఏరియేటర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఖరీదైన మందులు చల్లుతున్నప్పటికీ ఫలితం లేదని వాపోతున్నారు. ఇదే అదనుగా రొయ్యల వ్యాపారస్థులు సిండికేటుగా మారి ప్రస్తుతం రేటు కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో కనీసం పెట్టుబడులు రాక అప్పుల పాలవుతున్నామని వాపోతున్నారు. రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆక్వా రైతులు కోరుతున్నారు.

ఆక్వా రైతులు అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్షాల దృష్ట్యా చెరువుల్లో ఆక్సిజన్‌ హెచ్చు తగ్గులపై ఆక్వా రైతులు అప్రమత్తంగా ఉండాలని మత్స్యశాఖ ఏడీ రాజ్‌ కుమార్‌ తెలిపారు. చెరువుల్లో నిరంతరాయంగా ఏరియేటర్లు తిరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్‌ కోత విధిస్తే వెంటనే జనరేటర్‌ను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆక్సిజన్‌ టాబ్లెట్స్‌నుచెరువుల్లో వేయాలన్నారు. వైరస్‌ సోకి రొయ్యలు చని పోతుంటే వెంటనే పట్టుబడి చేయాలన్నారు.

Updated Date - May 26 , 2025 | 12:18 AM