Share News

అవయవ దానంతో పునర్జన్మ

ABN , Publish Date - Aug 12 , 2025 | 11:55 PM

పరోపకారార్ధం ఇదం శరీరం’ అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. మరణించిన తర్వాత శరీరం కట్టెల్లో కాలిపోయి లేదా మట్టిలో కలిసిపోవడం వల్ల మనిషి జీవితానికి అర్ధం ఉండదు.

అవయవ దానంతో పునర్జన్మ

నేడు జాతీయ అవయవ దాన దినోత్సవం

‘పరోపకారార్ధం ఇదం శరీరం’ అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. మరణించిన తర్వాత శరీరం కట్టెల్లో కాలిపోయి లేదా మట్టిలో కలిసిపోవడం వల్ల మనిషి జీవితానికి అర్ధం ఉండదు. మరణానంతరం మన శరీరంలో అవయవాలతో మరో కొంతమందిని మృత్యువుకి చేరువ కాకుండా కాపాడిన వారికి పునర్జన్మ ప్రసాదించడమే మానవ జన్మకు సార్థకం. మరణానంతరం ప్రజల హుృదయాలలో చిరంజీవులుగా మిగిలిపోయేవారు ప్రాణదాతలు. అవయవ దానంపై ఆగస్టు 13వ తేదీ జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

పోలవరం, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి)

ఒకరికి రక్తదానం చేయడం ద్వారా మరో ముగ్గురికి ప్రాణదానం చేయవచ్చనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఒక మనిషి అవయవ దానం వల్ల ఎంతోమందికి పునర్జీవం ఇవ్వవచ్చునని ఎంతోమంది అవయవ దాతలు ప్రత్యక్షంగా నిరూపించారు. అవయవదానం అనేది మరణించిన లేదా బ్రెయిన్‌డెడ్‌ వంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మరణించడానికి సిద్ధం ఉన్న వ్యక్తుల నుంచి అవయవాలు వేరొకరకి అమర్చడం. దీని వల్ల శరీరంలో ఆయా అవయవాలు విఫలమై రోగగ్రస్తులైనవారు పునర్జీవులవుతారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం జీవనదానం కార్యక్రమం పేరిట కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది.

అవయవదానం రెండు రకాలు..

1. సజీవ దానం.. బతికున్నవారు ఆరోగ్యంగా ఉండి అవయవాన్ని లేదా అవయవంలో కొంత భాగాన్ని దానం చేయండం. వీటిలో రక్తదానం, కాలేయం (లివరు)లో కొంతభాగం దానం చేయడం. మూత్రపిండం (కిడ్నీ) వంటివి. ఇవి చేసిన తర్వాత కూడా దాత ఆరోగ్యంగా జీవించవచ్చు.

2. జీవన్మృతి దానం (కెడావర్‌) : ఈ దానంలో మరణానంతరం అవయవాలు దానం చేయడం. మరణించిన వ్యక్తి నుంచి అవయవదానం చేయడం అంటే శరీరంలో ఏదో ఒక ప్రధాన అవయవ లోపంతో మృతి చెందడం లేదా ప్రమాదవశాత్తు బ్రెయిన్‌ డెడ్‌ కావడం వంటి కారణాల వల్ల మరణం సంభవిస్తే మృతి చెందిన వ్యక్తి దేహంలో మరొక వ్యక్తి జీవనానికి ఉపయోగపడే అవయవాలను దానం చేయడం.

దానం చేయగల అవయవాలు..

మనిషి మరణానంతరం తన శరీరం నుంచి 200 అవయవాలు, కణజాలాన్ని దానం చేయవచ్చు. కళ్లు, గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, క్లోమం, పెద్దప్రేగు, చిన్న ప్రేగులు, ఎముకలు, ఎముకలోని మూలు గలను దానం చేయవచ్చు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సత్వరమే స్పందించి దానానికి చర్యలు తీసుకుంటే సగటున ఏడుగురికి జీవితం ఇవ్వవచ్చు. సహజ మరణం తర్వాత ప్రాణవాయువు (ఆక్సిజన్‌) సరఫరా నిలిచిపోవడంతో శరీరంలో అవయవాలు పనికి రాకుండా పోతాయి. కేవలం కంటి కార్నియా, చర్మం, ఎముక, గుండె కవాటాలు, రక్త నాళాలు వంటి కణజాలాలు ఉపయోగపడతాయి. బ్రెయిన్‌ డెడ్‌ వ్యక్తుల నుంచి గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం, క్లోమం, ప్రేగులు లాంటి అవయవాలను సేకరించవచ్చు.

చర్మదానం..

బ్రెయిన్‌ డెడ్‌ వ్యక్తుల దేహాల నుంచి చర్మం సేకరించి కాలినగాయాలకు అమర్చే గ్రాఫ్టింగ్‌ ప్రక్రియ ద్వారా కొత్త జీవితం అందిస్తున్నారు. సేకరించిన చర్మాన్ని ఐదేళ్ల వరకు స్కిన్‌ బ్యాంకులలో భద్రపరచి ఉపయోగించుకునే వీలుంది. తక్కువ గాయాలతో వచ్చిన బాధితులకు వారి శరీరంలో వీపు, తొడల నుంచి చర్మాన్ని తీసి కాలిన చోట అతికించి చికిత్స చేస్తారు. తీవ్ర గాయాలైతే స్కిన్‌ బ్యాంకులోని చర్మంతో రోగికి తాత్కాలిక జవ రక్షణ కవచంలా గ్రాఫ్టింగ్‌ చేస్తారు.

ఎప్పుడు సేకరిస్తారంటే..

బతికి ఉన్నప్పుడు సజీవ దానం 18 ఏళ్లు నిండిన ఎవరైనా చేయవచ్చు. జీవన్మృతులు (బ్రెయిన్‌డెడ్‌) విషయంలో లింగ భేదం, వయోభేదం లేదు. చనిపోయిన తర్వాత అవయవాల మార్పిడి గంటల్లో జరిగిపోవాలి. గుండె ఆగి చనిపోతే కళ్లు, గుండె, కవాటాలు వంటి వాటిని 6 నుంచి 24 గంటల్లో సేకరించవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన కేసుల్లో ఎక్కువగా బ్రెయిన్‌డెత్‌గా ప్రకటిస్తారు. వీరి నుంచి గుండె నాలుగు గంటలు, కాలేయం 8 నుంచి 10 గంటలు, మూత్ర పిండాలు 24 గంటల్లో సేకరించాల్సి ఉంటుంది.

జూ బతికుండగా మూత్రపిండం వంటి దానం చేసినవారు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవడం చేయాలి. వైద్యుల సలహాలపై మందులు క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది.

దాతల నమోదు ఇలా..

అవయవదానం చేయాలనుకునే వారు నేషనల్‌ ఆర్గాన్‌ అండ్‌ టిష్యూ, ట్రాన్స్‌ ప్లాంట్‌ అసోసియేషన్‌లో లేదా ప్రాంతీయ స్థాయిలో జీవనదాన్‌ కార్యక్రమంలో తమపేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. దీనిలో ప్రత్యేక నంబరుతో దాతకు గుర్తింపు కార్డు వస్తుంది. ఈ నమోదు సంగతి దాత తమ కుటుంబ సభ్యులకు ఆప్తమిత్రులకు తప్పనిసరిగా తెలియజేయాలి.

గణాంకాలు ఇలా..

నేషనల్‌ ఆర్గాన్‌ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌వోటీటీఓ) ప్రకారం 2014 సంవత్సరంలో 6,916 అవయవమార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. 2022 నాటికి 16,000కు చేరాయి. 83 కేసులలో అవయవా లను జీవించి ఉన్న వ్యక్తుల నుంచి సేకరించారు. మరణించిన దాతలు 2014లో 408 మంది, 2023లో 1000కి పైగా ఉన్నారు. సీనీ నటుడు జగపతిబాబు 2022 ఫిబ్రవరి 12న తన పుట్టినరోజు సందర్భంగా అవయవదానానికి సంతకం చేశారు. వందకు పైగా ఆయన అభిమానులు కూడా ప్రమాణపత్రాలపై సంతకాలు చేశారు.

అవయవదానంపై అవగాహన కార్యక్రమాలు

2017లో ఫ్రాన్స్‌ అవయవదానాన్ని తప్పనిసరి చేసింది. ఇష్టం లేదని ప్రభుత్వానికి ముందు తెలియజేయకపోతే వైద్యులు అవ యవాలు సేకరిస్తారు. మిగిలిన దేశాలు ఈ పద్ధతిని అనుసరి స్తున్నాయి. భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన పెంచడానికి నమోదు వంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. పలు రకాల అపోహల వల్ల కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడం వల్ల దేశంలో అవయవ దాతల కొరత ఏర్పడింది. 1994లో మానవ అవయవాలు, కణజాలాల మార్పిడి చట్టం తెచ్చారు. 2011లో దానికి సవరణలు చేశారు. అవయవ, కణజాల మార్పిడి సంస్థ ఎన్‌ఓటీటీఓ ఈ ప్రక్రియలను పర్యవేక్షిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో జీవన్‌దాన్‌, ఇంకా మరి కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు దశాబ్ద కాలంగా అవయవదానంపై పనిచేస్తున్నాయి.

జూ కేంద్రం ప్రభుత్వం అవయవాలను త్వరితగతిన తరలించేం దుకు గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు ప్రభుత్వాలు దాతల అంత్య క్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని నిర్ణయించింది. దీనికి జిల్లా కలెక్టర్‌ లేదా ప్రభుత్వ ప్రతినిధి హాజరవుతారు.

Updated Date - Aug 12 , 2025 | 11:55 PM