Share News

నేటి నుంచి పీహెచ్‌సీల్లో ఓపీ సర్వీసులు బహిష్కరణ

ABN , Publish Date - Sep 29 , 2025 | 12:57 AM

పీజీ వైద్యవిద్య క్లినికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఇన్‌ సర్వీస్‌ కోటా సీట్లను తగ్గించడం, పరిమితులు విధించడాన్ని నిరసించడంతో పాటు, మరికొన్ని డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసు కోవాలంటూ అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల (పీహెచ్‌సీ) వైద్యులు చేపట్టిన ఆందోళనలో భాగంగా ఆదివారం వైద్యఆరోగ్యశాఖ అధికారిక వాట్సాప్‌ గ్రూపుల నుంచి వైదొలిగారు.

నేటి నుంచి పీహెచ్‌సీల్లో ఓపీ సర్వీసులు బహిష్కరణ
ఆందోళన కార్యక్రమాల నోటీసును డీఎంహెచ్‌వోకు అందజేస్తున్న పీహెచ్‌సీల వైద్యుల సంఘం జిల్లా నాయకులు, వైద్యాధికారులు

భారీవర్షాలు, వైరల్‌ జ్వరాల విజృంభణ వేళ వైద్యసేవలకు విఘాతం వద్దంటూ అధికారుల సూచన

ప్రొబేషన్‌ కాలంలో ఆందోళనల చట్టబద్ధతపై ఆరా

డీఎంహెచ్‌వో టెలీకాన్ఫరెన్సుకూ వైద్యుల స్పందన కరవు

ఇన్‌సర్వీస్‌ పీజీ కోటా సమస్యను పరిష్కరించాలని వైద్యుల పట్టు

ఏలూరు అర్బన్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : పీజీ వైద్యవిద్య క్లినికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఇన్‌ సర్వీస్‌ కోటా సీట్లను తగ్గించడం, పరిమితులు విధించడాన్ని నిరసించడంతో పాటు, మరికొన్ని డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసు కోవాలంటూ అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల (పీహెచ్‌సీ) వైద్యులు చేపట్టిన ఆందోళనలో భాగంగా ఆదివారం వైద్యఆరోగ్యశాఖ అధికారిక వాట్సాప్‌ గ్రూపుల నుంచి వైదొలిగారు. ఆందోళ నలో భాగంగా సోమవారం నుంచి అన్ని పీహెచ్‌సీల్లో అవుట్‌ పేషెంట్‌ (ఓపీ) విధులకు హాజరు కారాదని వైద్యులు నిర్ణయించారు.

సంచార వైద్యచికిత్స, డెలివరీలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విధులకు సంబంధించి రోజు వారీ కార్యకలాపాలు, క్షేత్రస్థాయి సందర్శనలు, పరిశీలనలు, పర్యవేక్షణ తదితర వివరాలను నమోదు చేసేందుకు వాట్సాప్‌ గ్రూపులను అధికారికంగా నిర్వహిస్తుంటారు. ఇవన్నీ పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ నియంత్రణలో నమోదు చేయా ల్సి ఉంటుంది. మరోవైపు భారీ వర్షాలు, తుఫాన్‌ల హెచ్చరికల నేపథ్యంలో అంటువ్యాధులు, వైరల్‌ జ్వరాలు, డయేరియా, మలేరియా వంటివి విజృం భించే సంకేతాల నేపథ్యంలో గ్రామాల్లో వైద్యసేవ లకు విఘాతం కలుగకుండా పీహెచ్‌సీల వైద్యా ధికారులు తమకు కేటాయించిన విధుల న్నింటికీ హాజరయ్యేలా ప్రభుత్వం చర్యల ను ప్రారంభించింది. ఈ క్రమంలో వైద్యసేవలను నిరాకరిం చడం కొనసాగితే అత్యవసర సర్వీసుల నిర్వహణ చట్టా(ఎస్మా)న్ని ప్రయోగించే విషయాన్ని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇదే విషయమై క్షేత్ర స్థాయిలో పీహెచ్‌సీ ల వైద్యుల సంఘం నాయకులకు సంకే తాలు పంపినట్టు సమాచారం.

86 శాతం వైద్యులు విధుల బహిష్కరణ

వైద్యుల ఆందోళనకు జిల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, నూజివీడు పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారు లు దూరంగా ఉన్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వర్తించే వైద్యాధికా రులంతా కాంట్రాక్టు ప్రాతిపదికన నియమితు లైనందున, నిబంధనల ప్రకారం వీరికి పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో ఇన్‌ సర్వీస్‌ కోటా ప్రయోజనాలు వర్తించవు. ఈ కారణంగానే అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో పనిచేసే డాక్టర్లు పీహెచ్‌ సీ మె డికల్‌ ఆఫీ సర్ల ఆందో ళన లో పా ల్గొ న డం లేదు. జిల్లాలో ఆదివారం 86 శాతం మంది వైద్యులు ఆందోళనలో పాల్గొన్నారని ఏపీ పీహెచ్‌సీల వైద్యుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ గంగాభవాని, డాక్టర్‌ జోషిమా తెలిపారు. వైద్యులకు గతేడాది ఉన్నతాధికారు లిచ్చిన హామీల్లో ఒక్కటి కూడా ఇంతవరకు అమలు చేయకపోవడం వల్లే ఆందోళనకు దిగాల్సి వచ్చిందని వివరించారు. ఇన్‌సర్వీస్‌ పీజీ కోటాను పరిమితం చేస్తూ జారీచేసిన జీవో 99 ఉత్తర్వులను రద్దు చేయాలని, చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమానికి హాజరయ్యే వైద్యులకు రూ.5వేలు అలవెన్సును మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో పీహెచ్‌సీల వైద్యుల ఆందోళన కార్యక్రమాలు, డిమాండ్లపై ఇప్పటికే డీఎంహెచ్‌వో డాక్టర్‌ అమృతంకు నోటీసును అందజేశామని వైద్యుల సంఘం జిల్లా నాయకులు తెలిపారు.

డీఎంహెచ్‌వో టెలీకాన్ఫరెన్సుకూ వైద్యులు డుమ్మా

పీహెచ్‌సీల వైద్యులు సోమవారం నుంచి ఓపీ సేవలు నిలిపివేయనున్నట్టు ప్రకటించడంతో అప్రమత్తమైన డీఎంహెచ్‌వో డాక్టర్‌ పీజే అమృతం ఆదివారం సాయంత్రం టెలీకాన్ఫరెన్సు నిర్వహించగా, అతికొద్దిమంది తప్ప మిగతా వారినుంచి స్పందన కరవైంది. వర్షాలు, అంటు వ్యాధులు ప్రబలే అవకాశంఉందని, స్వచ్ఛనారీ, సంచారవైద్యసేవలకు విఘాతం కలిగించవద్దని, ఆ మేరకు వైద్యులెవ్వరూ సమ్మెలోకి వెళ్లవద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఏవైనా సమస్యలుంటే ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి పరిష్కరించుకో వాలని సూచించారు. రాష్ట్రంలో బాపట్ల, మరికొన్ని జిల్లాల్లో వైద్యులెవ్వరూ ఆందోళన/సమ్మె లో పాల్గొనడం లేదని వివరిం చారు. జిల్లాలోని పీహెచ్‌సీల్లో వైద్యసేవలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేయాలని డీహెచ్‌, కమిషనర్లు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని హెచ్చరించారు.

నేటి నుంచి ఓపీ విధులకు దూరం..

దశలవారీ ఆందోళనలో భాగంగా సోమవారం నుంచి అన్ని పీహెచ్‌సీల్లో అవుట్‌ పేషెంట్‌ (ఓపీ) విధులకు హాజరు కారాదని వైద్యుల సంఘం నిర్ణయించింది. ఆ మేరకు ఓపీ సాధారణ వైద్యసేవలను బహిష్కరిస్తూనే, అత్యవసర వైద్యసేవలైన డెలివరీలు, రోడ్డుప్రమాదాలు, పాయిజనింగ్‌ కేసులను చూస్తారు. దీంతో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ఇప్పటికే ఆన్‌లైన్‌ వైద్య విధులు నిలిచిపోగా, సోమవారం నుంచి కీలకమైన ఓపీ సేవలు నిలిచిపోతుండడంతో గ్రామాల్లో రోగులకు ఇబ్బందులు తప్పేలా లేవు. కాగా మంగళవారం నుంచి ముఖగుర్తింపు ఆధారిత హాజరు (ఎఫ్‌ఆర్‌ఎస్‌ఏ) యాప్‌ నుంచి వైదొలగాలని నిర్ణయించారు.

ప్రొబేషన్‌ డిక్లరేషన్‌, రెగ్యులరైజేషన్‌ కాని వైద్యులపై దృష్టి సారింపు?

ఉద్యోగ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించేందుకు అదికారులు యోచిస్తున్నట్టు సమాచారం. ఆ ప్రకారం పీహెచ్‌సీల్లో వైద్యులుగా ఉద్యోగంలో చేరినవారికి రెండేళ్లపాటు ప్రొబేషన్‌ పీరియడ్‌ ఉంటుంది. ఈ రెండేళ్ల వ్యవధిలో విధులకు అనధికారిక హాజరు, వైద్యసెలవు, వైద్యసేవల్లో నిర్లక్ష్యం వంటివి లేకుండా వున్నవారికి ప్రొబేషన్‌ పీరియడ్‌ను విజయవంతంగా పూర్తిచేసినట్టుగా పరిగణించి, సర్వీసు క్రమబద్ధీకరణ నిమిత్తం ప్రతిపాదనలను జిల్లా అధికారుల ద్వారా ప్రభుత్వానికి పంపుతారు. ఆ మేరకు ఉద్యోగి సర్వీసు క్రమబద్ధీకరణ(రెగ్యులరైజేషన్‌)కు కనీసం మూడేళ్లు పట్టే అవకాశం ఉంటుంది. ప్రొబేషన్‌ కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాల్లో పాల్గొన రాదన్న నిబంధనతోపాటు, వైద్యసేవలందించిడంలో గైర్హాజరు, అధికారిక గ్రూపుల నుంచి వైదొలగడం వంటివన్నీ వైద్యవిధుల నిర్లక్ష్యం కిందకే వస్తాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో జిల్లాలోని 62 పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యాధికారుల్లో కేవలం 12మంది సర్వీసులు మాత్రమే రెగ్యులరైజేషన్‌ అయ్యాయని, మిగతా వారంతా ప్రొబేషన్‌ పీరియడ్‌లోనే వున్న విషయాన్ని గుర్తుచేశాయి. ఆ ప్రకారం ప్రొబేషన్‌ కాలంలో వైద్యవిధులకు అనుమతిలేకుండా గైర్హాజరైతే ప్రభుత్వం తన పరిధిలో చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని వివరించాయి.

Updated Date - Sep 29 , 2025 | 12:57 AM