ఘాటెక్కిన ఉల్లి
ABN , Publish Date - Dec 15 , 2025 | 12:36 AM
మార్కెట్‌లో ధరలు మండిపోతున్నాయి. ఉల్లి ఒక్కరోజులో ధర పెరిగింది. తాడేపల్లిగూడెం హోల్‌సేల్ మార్కెట్‌లో ధర క్వింటా రూ.500 పెరగడంతో రిటైల్ ధరల్లో భారీ వ్యత్యాసం వచ్చింది.
కూరగాయల ధరలు ప్రియం
పండ్ల ధరకు రెక్కలు
మార్కెట్‌లో ధరలు మండిపోతున్నాయి. ఉల్లి ఒక్కరోజులో ధర పెరిగింది. తాడేపల్లిగూడెం హోల్‌సేల్ మార్కెట్‌లో ధర క్వింటా రూ.500 పెరగడంతో రిటైల్ ధరల్లో భారీ వ్యత్యాసం వచ్చింది. నెలరోజులుగా కొండెక్కి కూర్చున కూరగాయల ధరలు దిగి రానంటున్నాయి. పండ్ల ధరలు సైతం భారీగా పెరగడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.
తాడేపల్లిగూడెం, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): మార్కెట్‌లో ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి. క్వింటా హోల్‌సేల్‌గా రూ.వేలకు విక్రయించారు. మహారాష్ట్ర లోనే పచ్చి ఉల్లి క్వింటా రూ.3500 ధరకు తాడేపల్లి గూడెంలోని ఒక వ్యాపారి కొనుగోలు చేసినట్లు తెలిసింది. కేంద్రం ఎగుమతులకు అవకాశం ఇవ్వడం ఉల్లి ధర అమాంతంగా పెరిగింది. వారం రోజులుగా మహారాష్ట్ర ఉల్లి క్వింటా రూ.2300 నుంచి 2500 కాగా ఈ వారం ఒకేసారి రూ.3వేలకు చేరింది. మొన్నటి వరకు గిట్టుబాటు కాని ధరలతో చూసి రైతులు, వ్యాపారులు నీరసించారు. ఇప్పుడు ఒకేసారి ధర పెరగడంతో మహారాష్ట్ర రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లి సాగు చేసిన కర్నూలు, కడప రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారి పంట అయనకాడి అమ్ముకున్నారు. ఈ పరిస్థితుల్లో మహారాష్ట్ర ఉల్లి రైతులకు కాసుల వర్షం కురియనుంది.
పండ్ల ధరలు పైపైకి..
మార్కెట్లో పండ్ల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించక దిగుబడి తగ్గడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయని వ్యాపారు లు చెబుతున్నారు. తాడేపల్లిగూడెం మార్కెట్ నాగ పూర్ కమలాలు, సిమ్లా యాపిల్స్‌కు పెట్టింది పేరు. ఇక్కడి వ్యాపారులు నేరుగా మహారాష్ట్రలోని నాగపూ ర్ నుంచి తీసుకొస్తే రిటైల్ వ్యాపారులు కొనుగోలు చేసుకుంటారు. నాగపూర్ కమలాలు సీజన్ ఈనెలా ఖరుకు ముగియనుంది. ప్రస్తుతం 20 కేజీల ట్రే రూ.1200 నుంచి రూ.1300 మధ్య విక్రయిస్తున్నారు. గత ఏడాది రూ.650 నుంచి 800 ధర ఉంది.
శ్రీగంగాధర రకం కమలాలు పంజాబ్ ప్రాంతంలో పండిస్తారు. ఈ కమలాల తొక్క దళసరిగా ఉంటుం ది. దీని ధర ట్రే రూ1000 నుంచి 1100 మఽధ్య ఉంది. గత ఏడాది రూ.500 నుంచి రూ.700 ధర ఉంది. 40 నంబర్ ఉండే ట్రేలో 90 కాయలు, 60వ నంబర్ ట్రేలో 120 కాయలు, 54 నంబర్ ట్రేలో 110, 72 నంబర్ ఉండే ట్రేలో 140 కాయలు ఉంటాయి. మరో వారంలో రాజస్థాన్ కమలాల సీజన్ ప్రారంభ మవుతోంది. ఇవి నాగపూర్ కమలాలను పోలి ఉం టాయి. రంగు పసిరిగా, చిన్నగా ఉంటాయి. ట్రే రూ. 1000 నుంచి 1100 మధ్య అమ్మకాలు సాగిస్తున్నారు. ఇవి కూడా గత ఏడాది రూ.700 నుంచి రూ. 800 ధర ఉన్నాయి. కమలాల్లో చిన్న కాయలు (సూరా) ను ఏరి ట్రేలలో వేస్తారు. ట్రే రూ.450 నుంచి 700 మధ్య అమ్ముతున్నారు. ఈసంవత్సరం కమలాలు సీజన్ ధరలు ఆశానంటాయి.
దిగిరాని కూరగాయలు
కూరగాయలు ధరలు దిగిరానంటున్నాయి. అధిక ధరతో కొనుగోలుదారులు నానా అవస్థలు పడుతున్నారు. కేజీల్లో కొనుగోలు చేసేవారు అరకేజీ, పావుకేజిలతో సరిపెట్టుకుంటున్నారు. ఎప్పుడు ధరలు తగ్గుతాయోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. సాధారణంగా కార్తీక మాసం తరు వాత కూగాయల ధరలు తగ్గుతాయి. ఇటీవల తుఫాన్లు, వర్షాలకు కూరగాయల తోటలు దెబ్బ తినడంతో దిగుబడి పడిపోయింది. బీరకాయ, వంకాయ, బెండ, కాకర, బీట్‌రూట్, పెండలం, కంద కిలో రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు. దొండ రూ.60, దోస రూ.50, క్యారెట్ రూ.60, క్యాప్సికమ్ రూ.100, టమాటా రూ.50, నాటు చిక్కుళ్లు రూ.150, సాధారణ చిక్కుడు రూ.120, కాలీఫ్లవర్ ఒకటి రూ.40, క్యాబేజీ కిలో రూ.40 ధరకు విక్రయించారు.
తాడేపల్లిగూడెంలో తగ్గిన చికెన్ ధర
జిల్లా వ్యాప్తంగా చికెన్ ధరలు స్థిరంగా ఉన్న ప్పటికీ తాడేపల్లిగూడెం మార్కెట్‌లో స్కిన్‌లెన్ చికెన్ ధర కిలో రూ.260 నుంచి రూ.240కు తగ్గించారు. విత్‌స్కిన్ చికెన్ రూ.220 ధరకు అమ్ముతున్నారు. వ్యాపారులు ఒక ఒప్పందానికి వచ్చి తగ్గించినట్లుగా తెలిసింది. జిల్లా వ్యాప్తంగా మాత్రం చికెన్ ధరలు తగ్గలేదు.
పెరిగిన గుడ్డు
గుడ్డు ధర కూడా వినియోగదారులకు భార మైంది. రిటైల్‌గా ఒక్క గుడ్డు రూ.8 విక్రయిస్తు న్నారు. అట్ట(30)గుడ్లు రూ.220 నుంచి 230 మధ్య ధర ఉంది. ఇటీవల గుడ్డు వినియోగం గణనీయంగా పెరిగింది. చలి తీవ్రత పెరగడంతో గుడ్డు నిల్వ సామర్ధ్యం పెరుగుతుందని, దీనితో ఎక్కువ నిల్వ చేసుకుంటున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఎగుమతులు కూడా పెరగడంతో ధరలు పెరిగాయని, శీతాకాలం ఇదే ధరలు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు.