Share News

ఉల్లి.. లొల్లి..

ABN , Publish Date - Sep 10 , 2025 | 12:08 AM

కర్నూలు ఉల్లి ధర దారు ణంగా ఉంది. వీటిని కొనుగోలు చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు.

ఉల్లి.. లొల్లి..
కర్నూలు ఉల్లిని పరిశీలిస్తున్న ఆర్డీవో ఖతీబ్‌ కౌసర్‌ భానో

రూ.12 ధరకు మార్క్‌ఫెడ్‌ కొనుగోలు

మార్కెట్‌లో రూ.3 నుంచి 4 మధ్య విక్రయాలు

కొనుగోలుకు ముందుకురాని వైనం

మార్కెట్‌లో కుళ్లిపోతున్న నిల్వలు

కర్నూలు రైతులు కూడా తరలించిన ఉల్లి లోడు

తాడేపల్లిగూడెం, సెప్టెబరు 9‘(ఆంధ్రజ్యోతి): కర్నూలు ఉల్లి ధర దారు ణంగా ఉంది. వీటిని కొనుగోలు చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ప్రభుత్వం కర్నూలు రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో మార్కెఫెడ్‌ ద్వారా క్వింటా రూ.1200 ధరకు కొనుగోలు చేస్తుంది. వీటిని ఇతర మార్కెట్లకు తరలిస్తుంది. దీనిలో భాగంగా 4 లారీల్లో తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్‌కు మార్కెఫెడ్‌ పంపిన ఉల్లి లోడు వచ్చింది. ఇక్కడ విక్రయించేం దుకు అధికారులు ఒక ప్రైవేట్‌ గోదాము వద్ద ఉంచారు. వీటిలో ఒకటిన్నర లారీలు మాత్రమే విక్రయాలు జరిగాయి. మిగిలిన ఉల్లి లారీల నుంచి దింపలేదు. అసలే దెబ్బతిన్న ఉల్లి అధిక లోడుతో ఇక్కడికి రావడంతో లారీల నుంచి ఉల్లిరసం బయటకు వస్తోంది. దించిన ఉల్లి కూడా కంపుకొడుతోంది. నాలుగు లారీల్లో 36 టన్నులు, 30 టన్నులు, 27 టన్నులు, 25 టన్నుల వంతున వేసి తీసుకొచ్చారు. ఒక లారీలో ఉన్న సరుకును పూర్తిగా అమ్మగా మరో లారీలో సగం మాత్రమే అమ్మారు. ఒకటిన్నర లారీల ఉల్లి మాత్రం ఒక మోస్తరుగా ఉండడంతో కిలో రూ.3 నుంచి 4 మధ్య విక్రయించారు. మిగిలిన ఉల్లిని కిందికి దించేందుకు కూడా సాహసం చేయడం లేదు. దీంతో మూడు లారీల్లోను ఉల్లి ఉండిపోయింది. దించుకుంటే వెళ్లిపోతామని కర్నూలు నుంచి వచ్చిన డ్రైవర్లు గగ్గోలు పెడుతున్నారు. తమకు కిరాయి ఇవ్వకపోయినా పర్వాలేదు. కనీసం దిగుమతి చేయాలని వేడుకుంటున్నారు.

కర్నూలు ఉల్లిని పరిశీలించిన ఆర్డీవో

తాడేపల్లిగూడెం మార్కెట్‌కు వచ్చిన నాలుగు లారీల ఉల్లిని తాడేపల్లిగూ డెం ఆర్డీవో ఖతీబ్‌ కౌసర్‌భానో మంగళవారం పరిశీలించారు. కొనుగోలు చేయడానికి వచ్చిన వారు, వ్యాపారులతో సమీక్షించారు. కర్నూలు నుంచి మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసి ఇక్కడకు పంపిన ఉల్లి పూర్తిగా పాడైందని, దీన్ని కొనుగోలు చేయడానికి చిరు వ్యాపారులు ముందుకు రావడం లేదని వ్యాపారులు ఆర్డీవోకు వివరించారు. నాణ్యమైన ఉల్లి కాకుండా కుళ్లిన ఉల్లిని ఎవరు కొనుగోలు చేయడం లేదని తెలిపారు. ఉల్లిని విక్రయించేందుకు వ్యాపారులు సహకరించాలని ఆమె కోరారు. ఆమె వెంట డీడీ పాపారావు, ఏడీ సునీల్‌, తాడేపల్లిగూడెం ఎఎంసీ కార్యదర్శి గౌస్‌భాషా, సూపర్‌వైజర్‌ ఫణికిషోర్‌, సిబ్బంది ఉన్నారు.

15 లారీల్లో తీసుకొచ్చిన కర్నూలు రైతులు

మార్క్‌ఫెడ్‌ పంపించిన నిల్వలతో పాటు కర్నూలు రైతులు కూడా తాడేపల్లిగూడెం మార్కెట్‌కు 15 లారీల ఉల్లిని మంగళవారం తెచ్చారు. స్థానికంగా ఉండే కొంతమంది వ్యాపారుల వద్దకు తీసుకొచ్చారు. నాణ్యతను బట్టి క్వింటా రూ.600 నుంచి రూ.1250 మధ్య ధర పలికింది.

Updated Date - Sep 10 , 2025 | 12:08 AM