అధికారులు చిత్తశుద్ధితో పనిచెయ్యాలి
ABN , Publish Date - Oct 01 , 2025 | 12:53 AM
పథకాల అమలు ద్వారా జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు.
జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం
భీమవరం టౌన్, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి):పథకాల అమలు ద్వారా జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(డీడీఆర్‌సీ) సమావేశం జరిగింది. ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యుఎస్, వైద్య ఆరోగ్యశాఖ, వ్యవసాయ, ఉద్యాన శాఖ, పౌర సరఫరాలు తదితర శాఖల ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును సమీక్షించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తోందని వాటి ఫలాలు ప్రజలకు చేరాలంటే అధికారులు క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి కోరారు. భీమవరం యనమదుర్రు డ్రైన్‌పై అసంపూర్తి నిర్మాణంలో ఉన్న మూడు వంతెనలు అప్రోచ్ రోడ్లు పూర్తి చేయవలసి ఉందని దీనికి రూ.36 కోట్లు ఖర్చు అవుతుందని ఎమ్మెల్యే అంజిబాబు చెప్పారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ప్రస్తావించానని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు.
తాడేపల్లిగూడెం, తణుకు ఎమ్మెల్యేలు బొల్లినేని శ్రీనివాస్, ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ రోడ్లు గోతులు పూడ్చడంతో ప్రయోజనం లేదని సింగిల్ లేయర్ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎగ్జిబిషన్స్, ర్యాలీలు, వర్క్‌షాప్‌లు సచివాలయ స్థాయి నుంచి జిల్లా స్థాయివరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ కరపత్రాన్ని కేంద్ర మంత్రి వర్మ, ఎమ్మెల్యేలు, కలెక్టర్, జేసీ ఆవిష్కరించారు. జడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్‌వో బి.శివన్నారాయణ రెడ్డి, జడ్పీ సీఈవో ఎం.శ్రీహరి, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
రూ.1,735 కోట్లతో జలజీవన్ పనులు
జిల్లాలో చేపట్టిన జలజీవన్ మిషన్ పనుల గురించి ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ అధికారి వివరిస్తూ జిల్లాలో రూ.1,735 కోట్ల అంచనాతో 1,489 పనులు ముంజూరు చేశారన్నారు. వీటిలో రూ.1,400 కోట్లను వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు కేటాయించారన్నారు. దీనికి అవసరమైన స్థల సేకరణను విజ్జేశ్వరం వద్ద పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు జేజేఎం కింద రూ.100.83 కోట్లు ఖర్చు చేసి 877 పనులను పూర్తి చేసినట్టు వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జిల్లాలో అమలవుతున్న వివిధ కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల అమలు తీరును డీఎంహెచ్‌వో డాక్టర్ గీతాబాయి వివరించారు. ఖరీఫ్ సీజన్‌కు యూరియా కొరత లేదని, రైతులు కోరిన విధంగా సరఫరా చేశామన్నారు. జిల్లాలో వ్యవసాయ రంగంలో డ్రోన్లు వినియోగంలో మన జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉందని వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు తెలిపారు.
జీఎస్టీ తగ్గింపు వ్యవసాయ రంగానికి మరింత ఊతం
రైతాంగాన్ని ప్రోత్సహించే దిశగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఉపయోగించే వస్తువులు, పనిముట్లపై భారీ మొత్తంలో జీఎస్టీ తగ్గింపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మరింత అండగా నిలి చాయని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. మంగళవారం భీమవరం మునిసిపల్ కార్యాలయం వద్ద లూఽథరన్ పాఠశాల గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్ అవగాహనలో భాగంగా వ్యవసాయ రంగంలో చేకూరిన ప్రయోజనాలపై అవగాహన కలిగించేందుకు పెద్దఎత్తున నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. మంత్రి వర్మ స్వయంగా ట్రాక్టర్ నడిపి ఉత్సాహపరిచారు. జీఎస్టీ తగ్గింపు ద్వారా వినియోగదారులకు చేకూరుతున్న ప్రయోజనాలను తెలియచెప్పేందుకు దసరా నుంచి దీపావళి వరకు దేశవ్యాప్తంగా ప్రచారం చేపట్టినట్టు మంత్రి వివరించారు. రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు కారణంగా ప్రతి ఒక్క కుటుంబానికి నెలకు మూడు నుంచి ఐదు వేల రూపాయల వరకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుతో సామాన్యులకు ఊరట లభించిందన్నారు. ట్రాక్టర్ల ర్యాలీలో కలెక్టర్ స్వయంగా ట్రాక్టర్‌ను నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు.