ఆక్రమణల చెరలో..
ABN , Publish Date - Jul 12 , 2025 | 01:17 AM
మండలంలోని పలు గ్రామాలకు చెందిన 1200 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించే చినపాలపర్రు బ్రాంచి కాల్వ (నల్లకాల్వ) ఆక్రమణలతో కుచించుకు పోయి చిన్నపాటి పంట బోదెలాగా మారింది.
శివారుకు చేరని సాగునీరు
ముదినేపల్లి, జూలై 11(ఆంధ్రజ్యోతి):మండలంలోని పలు గ్రామాలకు చెందిన 1200 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించే చినపాలపర్రు బ్రాంచి కాల్వ (నల్లకాల్వ) ఆక్రమణలతో కుచించుకు పోయి చిన్నపాటి పంట బోదెలాగా మారింది. కోడూరు ఛానల్ నుంచి చీలి ప్రత్తిపాడు, ముదినేపల్లి, చినపాలపర్రు గ్రామాలకు చెందిన ఆయకట్టుకు సాగు నీరందించాల్సిన ఈ నల్ల కాల్వలో నీరుపారే అవకాశమే లేకుండా పోయింది. ఈ కాల్వగట్టు పక్కనే చేపల చెరువులను తవ్వడం వల్ల కాల్వ వెడల్పు తగ్గి పూడుకుపోయింది. శివారున ఉన్న చినపాలపర్రు ఆయకట్టు భూములకు నీరందడం కష్టంగా మారింది. ఆ గ్రామ ఆయకట్టు రైతులు పోల్‌రాజ్ డ్రెయిన్, కోడూరు రోడ్ సైడ్ డ్రెయిన్ మురుగునీటిని ఇంజన్లతో తోడుకుని వరిసాగు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని, కాల్వను సర్వేచేసి వెడల్పు పెంచేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామ టీడీపీ నాయకుడు దుక్కిపాటి చక్రధర్ కోరారు.