సాగునీటికి..మహర్దశ
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:09 AM
జిల్లా జలవనరులశాఖ సర్కిల్ పరిధిలో కాల్వలు, డ్రెయిన్ల బాగుచేతకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. ఇప్పటికే కొన్ని పనులు పురోగతిలో ఉండగా, వేసవి ప్రారంభం అయ్యే నాటికి అన్ని పనులు పూర్తి చేయను న్నారు.
ఓఅండ్‌ఎంతో తూడు,గుర్రపుడెక్క తొలగింపు పనులు
మార్చి నెలాఖరు నాటికి పూర్తి : ఎస్‌ఈ దేవప్రకాశ్
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
జిల్లా జలవనరులశాఖ సర్కిల్ పరిధిలో కాల్వలు, డ్రెయిన్ల బాగుచేతకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. ఇప్పటికే కొన్ని పనులు పురోగతిలో ఉండగా, వేసవి ప్రారంభం అయ్యే నాటికి అన్ని పనులు పూర్తి చేయను న్నారు. సాగునీటి ప్రవాహానికి అడ్డంకులు అధిగమించే దిశగా ప్రక్షాళనకు అధికారులు శ్రీకారం చుట్టారు. మునుపెన్నడూ లేని విధంగా ప్రభుత్వం రూ.9.11 కోట్ల మంజూరు చేయడంతో అన్నదాతకు ఇక్కట్లు తీరనున్నాయి.
జిల్లాలో గోదావరి, కృష్ణా కాల్వల కింద సాగు, తాగునీటికి ప్రవాహానికి అవరోఽధాలుగా ఉన్న తూడు, గుర్రపుడెక్క, కిక్కిస తొలగింపునకు జలవనరులశాఖ ఈ ఏడాది ముందస్తు ఏర్పాట్లతో కసరత్తులను మొదలెట్టింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో కాల్వలు,డ్రెయిన్ల ప్రక్షాళన పనుల ఊసెత్తకుండా సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేశారు. తాజాగా 2025–26 సంవత్సరానికి జిల్లాలో ఓఅండ్‌ఎం పనులు చేయడానికి రూ.9.11 కోట్ల వ్యయంతో 201 పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు.
మార్చి నాటికి కాల్వల్లో పూడికలు తొలగింపు
గోదావరి, కృష్ణా కాల్వలు వెంబడి జంగిల్ క్లియరెన్స్ జనవరిలో చేపట్టనున్నారు. ఆపై కాల్వలు ఇరువైపులా పేరుకుపోయిన మట్టిదిబ్బలను తొలగిస్తారు. అనంతరం గుర్రపు డెక్క, ఇతర వ్యర్థాలను తొలగించడానికి రంగం సిద్ధం చేయనున్నారు.
రెండు పంటల సీజన్లకు సంబంధించి కాల్వల ప్రక్షాళన ఓఅండ్‌ఎంలో చేపట్టనున్నారు. ప్రధానంగా కాల్వలు కట్టేసే ముందు గుర్రపుడెక్క, తూడు, కిక్కిస తొలగింపునకు వీలుగా ద్రావకం పిచికారీ చేస్తారు.
కాల్వలకు నీరు విడుదల చేయగానే లాట్లుగా పేరుకుపోయిన తూడును మనుషుల ద్వారా నీటి సంఘాల పర్యవేక్షణలోనే రైతులు తొలగించనున్నారు.
ప్రతీ డిస్టిబ్యూటరీ సంఘం పరిధిలో కొంత మేర పనులను నామినేషన్ పద్ధతిలో కేటాయించడంతో సకాలంలో రైతులు సాగునీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించడంలో ముందుండి వారి అవసరాలను తీర్చుకుంటారు.
పనులిలా..
జిల్లాలో గ్రౌండ్‌వాటర్ డివిజన్ పరిధిలో రూ.1.71 కోట్లతో 62 పనులు, డ్రెయినేజీ డివిజన్ పరిధిలో రూ.2 కోట్ల 43 లక్షల14 వేలతో 65 పనులు, ఏలూరుఇరిగేషన్ డివిజన్ పరిధిలో రూ.4 కోట్ల 71 లక్షల 45వేలతో 71 పనులు,స్పెషల్ మైనర్ ఇరిగేషన్ డివిజన్ పరిధిలో రూ.25 లక్షలతో మూడు పనులు చేపట్టనున్నారు.
డిసెంబరు నాటికి డ్రెయిన్లు
డిసెంబరు నెలాఖరు నాటికి మేజర్, మైనర్ డ్రెయిన్లలో పేరుకుపోయిన సిల్టుతీత, గుర్రపుడెక్క, తూడు, కిక్కిసలను తొలగించాలని నిర్ణయించారు. స్థానికంగా ఉన్న నీటి సంఘాల ఆధ్వర్యంలో ఈ పనులు నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం చేయాలని అధికారులు ఏఈలకు ఆదేశాలను జారీ చేశారు.
నిర్దిష్ట ప్రణాళికతో చేస్తున్నాం
కాల్వలు, డ్రెయిన్లలో గుర్రపుడెక్క, కిక్కిస, సిల్టు తొలగింపు పనులను నిర్దిష్ట ప్రణాళిక మేరకు చేపడుతున్నాం. నిధుల కొరత లేదు. నీటి సంఘాల ఆధ్వర్యంలో నామినేషన్ పద్ధతిలో ఈ పనులు సాగుతున్నాయి. మార్చి నాటికి అన్ని పనులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
– సీహెచ్ దేవప్రకాశ్, జలవనరులశాఖ ఎస్‌ఈ