రూ.4 కోట్లు వృథా
ABN , Publish Date - Jun 23 , 2025 | 12:15 AM
జిల్లాలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఏర్పాటు కలగానే మిగిలింది.
కలగా మిగిలిన నర్సింగ్ కళాశాల
భవనం నిర్మించారు
కళాశాల ఏర్పాటు కాలేదు
ఐదేళ్లుగా నిరుపయోగం
నరసాపురం, జూన్ 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఏర్పాటు కలగానే మిగిలింది. తొమ్మిదేళ్ల క్రితం కాలేజీ మంజూరైనా నేటికీ తరగతులు ప్రారంభం కాలేదు. రూ.4 కోట్లతో నిర్మించిన భవనం నిరుపయోగంగా మిగిలింది. రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం జిల్లాకు నర్సింగ్ కళాశాల ను మంజూరుచేసింది. అప్పట్లో ఉమ్మడి జిల్లాలో కాలేజీని ఎక్కడ ఏర్పాటు చేయాల ని తర్జనభర్జన పడ్డారు. చివరికి నరసాపురం లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భవన నిర్మాణానికి రూ.3.50 కోట్లు విడుదల చేశారు. 2016లో అప్పటి ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు పనులకు శంకుస్థాపన చేశారు. ఏడాదిలో పనులు పూర్తి చేసి తరగతుల్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిధుల కొరత కారణంగా పనులు అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేదు. ఇటు కాలే జీని ప్రైవేట్ భవనంలో ఏర్పాటు చేయలేదు. తరువాత వైసీపీ ప్రభుత్వం అసంపూర్తి నిర్మాణం పూర్తి చేయడానికి మరో రూ.50 లక్షలు మంజూరు చేసింది. 2020 నాటికి పనులు పూర్తయ్యాయి. మరో రూ.50 లక్షల వరకు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. తర్వా త నిధులు రాకపోవడంతో పనులు పూర్తి కాలేదు. అప్పటి నుంచి భవనం నిరుపయో గంగా మిగిలింది. ఇటు కాలేజీని ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రభుత్వ కాలేజీల్లో చదవాలని ఆశ పడిన నర్సింగ్ విద్యార్థులకు నిరాశే మిగిలింది. ఇక్కడ కాలేజీని ఏర్పాటు చేస్తే జిల్లా వాసులతోపాటు సరిహద్దునున్న కృష్ణా, కోనసీమ విద్యార్థులకు నర్సింగ్ కాలేజీ అందుబాటులో ఉంటుంది.
ప్రభుత్వం చొరవ చూపాలి
అప్పటి కూటమి ప్రభుత్వం నర్సింగ్ కళాశాల మంజూరు చేసింది. గత ప్రభుత్వ హయాంలో అరకొర నిధులిచ్చి చేతులు దులుపుకున్నారే తప్ప కాలేజీని ఏర్పాటు చేయలేదు. విద్యార్థుల చదువు లను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పనులు పూర్తి చేయించి కాలేజీని అందుబాటులోకి తీసుకురావాలి.
పొన్నాల నాగబాబు, మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్