Share News

ఉపాధి.. ఉఫ్‌..!

ABN , Publish Date - Dec 22 , 2025 | 12:10 AM

ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది.

ఉపాధి.. ఉఫ్‌..!

ఉపాధి హామీ పథకం పేరు ఇక నుంచి జీ రామ్‌ జీ

నిబంధనలు కూడా మార్చిన కేంద్ర ప్రభుత్వం

జాబ్‌ కార్డు స్థానే గ్రామీణ్‌ రోజ్‌గార్‌ గ్యారెంటీ కార్డు

పనుల కేటాయింపుపై అనుమానాలెన్నో..!

ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఇప్పటివరకు కొనసాగుతున్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వికసిత్‌ భారత్‌–గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవిక మిషన్‌ గ్రామీణ్‌ (జీ రామ్‌ జీ)గా పేరు మార్చింది. కొత్త నిబంధనలతో జిల్లాలో ఉపాధి పనులపై ప్రభావం పడనుంది.

ఏలూరు సిటీ, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలకు ఉపాఽధి హామీ పథకం పెద్ద భరోసానే ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేని కూలీలకు పనులు కల్పించే లక్ష్యంతో ఉపాధి హామీ పథకాన్ని 2005లో కేంద్ర ప్రభుత్వం మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రవేశ పెట్టింది. కూలీలు హాజరు అనుసరించి వచ్చిన మెటీరియల్‌ కాంపోనెంట్‌తో గ్రామాలలో సీసీ రహదారులు, సచివాలయ భవనాలు, హెల్త్‌ క్లినిక్‌లు, అంగన్‌వాడీ భవనాలు వంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ప్రస్తుతం ఈ పథకం పేరు మార్చడంతోపాటు నిబంధనలు మార్పుతో అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు నిధులను కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలకు కేటాయించేది. నూతనంగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం 60 శాతం నిధులు కేంద్రం, 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాల్సి వుంది.

పథకంలో కొత్త మార్పులు

వికసిత్‌ భారత్‌–గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవిక మిషన్‌ (గ్రామీణ్‌) పథకంలో అనేక మార్పులు చేశారు. గతంలో కూలీలకు పనిదినాలు 100 ఉండగా తాజాగా 125 రోజులకు పెంచారు. ఏడాదిలో 60 రోజులు విరామం (వ్యవసాయ సీజన్‌లో) ఇస్తారు. గతంలో మంజూరు చేసిన జాబ్‌ కార్డు బదులుగా గ్రామీణ్‌ రోజ్‌గార్‌ గ్యారెంటీ కార్డు ఇవ్వనున్నారు. కార్డు కాలపరిమితి మూడేళ్లు మాత్రమే. ప్రత్యేక వర్గాలకు స్పెషల్‌ కార్డులు మంజూరు చేస్తారు. ప్లానింగ్‌ విధానంలో మార్పులలో భాగంగా రాష్ట్రాలకు లేబర్‌ బడ్జెట్‌ ఉండదు. కేంద్రం నుంచే నిధులు నిర్దేశిస్తారు. కరవు/ డిమాండ్‌ పెరిగితే అదనపు ఖర్చును రాష్ట్రాలే భరించాలని నూతన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. పనులు ఎంపికలో భాగంగా వికసిత్‌ గ్రామ పంచాయతీ ప్రణాళిక, పీఎం ఘటీ శక్తితో అనుసంఽధానం, నీటి భద్రత, గ్రామీణ మౌలిక సదుపాయాలు, ఉపాధి, వాతావరణ చర్యలపై దృష్టి సారిస్తారు.

ఇక నుంచి జరిమానా రూ.10వేలు

ఉపాధి హామీ పథకం నిర్వహణలో ఏదైనా లోపాలు జరిగినా, అక్రమాలు జరిగినా గతంలో రూ.వెయ్యి జరిమానా విధించేవారు. ఇప్పుడు రూ.10 వేలు వరకు జరిమానా విధిస్తారు. పనిరోజులు పెరిగినా రాష్ట్రాలపై ఆర్థిక భారం పడనుంది. గ్రామీణ ప్రాంతాల్లో పనుల కేటాయింపులు తగ్గే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

జిల్లాలో ఉపాధి హామీ పథకం ఇలా..

జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి జిల్లాలో 6,44,699 జాబ్‌ కార్డులుండగా 3,64,000 కుటుంబాలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో 2,50,231 కుటుంబాలకు సంబంఽధించి 4,15,952 మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో 91,36,267 పనిదినాల్లో రూ.256 కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ పనులతో పాటు కందకాలు, పంట సంజీవిని కుంటలు, ఇంకుడు కుంటలు, చెరువుల్లో పూడికతీత, ఫీల్డ్‌ ఛానల్స్‌, వ్యక్తిగత కంపోస్ట్‌ పిట్స్‌, హార్టీకల్చర్‌, హౌసింగ్‌లో కొన్ని పనులు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో సీసీ రహదారులతో పాటు ఇతర అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం ఈ పనులు కేటాయింపు ఎలా ఉంటుందనేది సందేహాస్పదంగా మారింది.

Updated Date - Dec 22 , 2025 | 12:10 AM