జనం ముందుకు వెళ్లలేక..
ABN , Publish Date - Jul 26 , 2025 | 12:44 AM
ఒకవైపు వైసీపీ కేడర్‌లో ఇంతకు ముందున్న ఉత్సాహం లేదు. నాయ కుల జాడ లేదు. అంతకంటే మించి నాలుగేళ్ల కైపు దిగి, చేష్టలుడిగి పార్టీ భవిష్యత్తు ఏమిటనే తర్జనభర్జన.
వైసీపీ కేడర్‌లో నైరాశ్యం
సీనియర్ల వరుస అరెస్టులు
నాయకత్వం ఆదేశించినా ఒకట్రెండు కార్యక్రమాలతో సరి
కేడర్ సరే.. నేతలెక్కడ అనే ప్రశ్న అన్నిచోట్ల..
ఆఖరుకి అంతర్గత చర్చలకూ దూరమే
ఒకవైపు వైసీపీ కేడర్‌లో ఇంతకు ముందున్న ఉత్సాహం లేదు. నాయ కుల జాడ లేదు. అంతకంటే మించి నాలుగేళ్ల కైపు దిగి, చేష్టలుడిగి పార్టీ భవిష్యత్తు ఏమిటనే తర్జనభర్జన. ఇప్పటివరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపెట్టిన నిరసన కార్యక్రమాలు తూతూ మంత్రంగానే సాగాయి. నియోజకవర్గ స్థాయిలో పార్టీలో చడీచప్పుడు లేదు. గతంలో సోషల్ మీడియా వేదికగా చెల రేగారు.. ఇప్పుడు వారి జాడ తగ్గింది. జిల్లా నాయకత్వం అధినాయకత్వం పిలుపు ఇస్తేనే తప్ప రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి లేదు. తాజాగా లిక్కర్ స్కాంలో సీనియర్ నేతలు ఒక్కొ క్కరుగా జైలుబాట పట్టడం, జిల్లాకు చాన్నాళ్లు ఇన్‌చార్జిగా ఉన్న మిథున్‌రెడ్డి వంటి వారికి జైలు తప్పకపోవడం సహజంగానే పార్టీ కేడర్‌లో తీవ్ర గందరగోళం నింపింది.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
అధికారంలో ఉన్న ఐదేళ్లు కింద నుంచి పైవరకు అంద రూ పేట్రేగిపోయేవారు. సోషల్ మీడియాలో అడ్డమైన కామెంట్లు చేసేవారు. ప్రతీదానిని రాజకీయం చేసేవారు. ఏదొక వంకన గొడవలకు దిగేవారు. ఎన్నికల వరకు వైసీపీలో ఇదే పరిస్థితి. ఆ తర్వాత ఏడాది కాలంగా వైసీపీలో నైరాశ్యమే తాండవిస్తోంది. ఇప్పుడు వైసీపీ క్షేత్రస్థాయిలోని కేడర్‌లో కొంత కదలిక తెచ్చేందుకు కొన్ని వారాలుగా శతవిధాలా ప్రయత్నిస్తోంది. అనేక మందిని జిల్లా కమిటీల్లో నామినేట్ చేశారు. మరికొందరిని నామి నేట్ చేస్తామని హామీలు ఇస్తున్నారు. ఇంత చేసినా రాష్ట్రంలో సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా వివిధ ఆరో పణలపై జైలుకు వెళ్తున్నారు. భవిష్యత్తులో బిగ్‌బాస్‌ను కూడా అరెస్టు చేస్తారన్న సమాచారం వారికి పుండు మీద కారం చల్లినట్టుగా ఉంది. గతంలో ఏ చిన్న విషయానికైనా వైసీపీ అనుకూలురు అతిగా రియాక్ట్ అయ్యేవారు. వీధు ల్లోకి వచ్చి యాగి చేసేవారు. కాని ఇప్పుడు అరెస్టుల పర్వం కాస్తా జిల్లా స్థాయి సీనియర్ నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ప్రత్యేకించి నియోజకవర్గాల్లో కన్వీనర్లే పార్టీపరంగా కేడర్‌కు ఊతమిస్తారని భావించిన దానికి భిన్నమైన పరిస్థితులే నెలకొన్నాయి. అధినాయకత్వం పిలుపు ఇచ్చినప్పుడల్లా కన్వీనర్లు ఆరోజు ప్రజలకు కని పించి ఆ తర్వాత మాయమవుతున్నారు. కొందరైతే వ్యక్తి గత పనులకే పూర్తి సమయం కేటాయిస్తున్నారు. ప్రత్యే కించి పార్టీకి ఇప్పటికిప్పుడు చేయాల్సిందేమీలేదన్నట్టుగా మిన్నకుండిపోతున్నారు. ఫలితంగా ఎలాంటి సంకేతాలు లేక కేడర్ మెతకపడింది. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లోను దాదాపు ఇదే తరహా పరిస్థితులు ఉన్నాయి.
దెందులూరు నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ అబ్బయ్య చౌదరి ఇప్పుడు పార్టీకి పార్ట్‌టైమర్‌గా ఉన్నారు. వ్యక్తిగత పనుల కోసం ఆయన విదేశాల్లోనే ఎక్కువ కాలం గడుపు తున్నారు. కొన్నాళ్లపాటు నియోజకవర్గానికి వచ్చి స్థానికు లతో భేటీ అయ్యి ఒకటి రెండు కార్యక్రమాలకే పరిమిత మవుతున్నారు. ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ జయ ప్రకాశ్ తన శక్తి మేరకు కేడర్‌ను కూడగట్టుకుని కలెక్టరేట్ వద్ద నిరసనల బాధ్యత మోస్తున్నారు. పార్టీ అధినాయ కత్వంతో పూర్తి టచ్‌లో ఉన్నారు. ఉంగుటూరు నియోజక వర్గంలో పార్టీ కన్వీనర్ వాసుబాబు ఇంతకు ముందున్న ట్టుగా స్పీడుగా లేరు. పోలవరం నియోజకవర్గంలో బాల రాజు పాత్ర ఇటువంటిదే. నూజివీడులో ప్రతాప అప్పా రావు సాధ్యమైనంత మేర కేడర్‌ను కాపాడుకునే ప్రయ త్నం చేస్తున్నారు. చింతలపూడిలో గతంలో మాదిరిగానే పార్టీ నేతల మధ్య వైరుధ్యాలు కొనసాగుతున్నాయి. కైకలూరు నుంచి దూలం నాగేశ్వరరావు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత వహిస్తూనే తన నియోజక వర్గంలో పార్టీ కార్యక్రమాలను నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
బొత్స వచ్చి వెళ్లినా..
సుపరిపాలనలో తొలి అడుగు పేరిట తెలుగుదేశం ప్రభుత్వం ఈనెల మొదటి వారం నుంచి ప్రజల వద్దకు వెళ్లడానికి కార్యాచరణ రూపొందించుకుంది. దీనికి భిన్నంగా బాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ పేరిట నెల రోజుల పాటు ప్రజల ముందుకు వెళ్లాలని, ఊరూవాడా ప్రజలను కూడగట్టుకుని స్లైడ్‌లు వేసి అందరికీ వివరించాలని, పత్రికా సమావేశం నిర్వహించి సూపర్–6 విషయాన్ని ప్రస్తావించాలని వైసీపీ అధినాయకత్వం కేడర్‌కు పిలుపునిచ్చింది. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని ఆదే శించింది. ఇరవై రోజుల క్రితం సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పార్టీ నేతలు, కేడర్‌తో సమావేశం జరి పారు. ఆ తర్వాత నియోజకవర్గాల్లో, గ్రామస్థాయిలో పార్టీ చెప్పింది అమలు చేయలేకపోయారు. లిక్కర్ స్కాంలో నేతలు అరెస్టు కావడం, కోట్లాది రూపాయలు వెనుకేసుకు న్నారని, జనం ఆరోగ్యాన్ని దెబ్బతీశారని కొందరు ప్రాణాలు పోవడానికి కారణమయ్యారనే సిట్ నివేదికలను అటు ఖండించలేక, ఎదురుదాడి చేయలేక క్షేత్రస్థాయిలో ప్రజల కు వైసీపీ నేతలు ముఖం చాటేస్తున్నారు. ఇప్పటివరకు పార్టీ నాయకత్వం క్షేత్రస్థాయిలో ఎలా డీలాపడిందో ఈ కార్యక్రమం అమలులోకి వచ్చేసరికి బయటపడింది.
పార్టీ భవిష్యత్తేంటి ?
ఎన్నికలు పూర్తయిన తర్వాత ఏడాది కాలంలోనే పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో అంతంత మాత్ర స్థితికి రావడం పార్టీలో గందరగోళం నింపింది. నియోజకవర్గ స్థాయిలో సమీక్షలు లేకపోవడం, తగిన ప్రోత్సాహం కొరవడడం, ఇప్పుడు లిక్కర్ స్కాంలో పార్టీ ప్రతిష్ట కొంత సన్నగిల్లిన నేపథ్యంలో కార్యకర్తల్లో ధైర్యం నిపేందుకు తగినంత స్థాయిలో నాయకులు పని చేయడంలేదు. ఉమ్మడి జిల్లా నుంచి అప్పట్లో మంత్రులుగా కొనసాగిన వారు ఇప్పుడు దాదాపు సైలెంట్‌గా, తమ నియోజకవర్గానికే పరిమిత మయ్యారు. కనీసం రీజనల్ స్థాయి కో–ఆర్డినేటర్లు కార్య కర్తలను సాధ్యమైనంత మేర ప్రోత్సహించాలనుకున్నా అదీ చేయలేకపోతున్నారు. ఇలాంటి తరుణంలో పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతుందంటూ కార్యకర్తలు దగ్గర నుంచి సీనియర్ నేతల వరకు ఆందోళనలో ఉన్నారు.