నామినేటెడ్ నజరానా
ABN , Publish Date - May 12 , 2025 | 12:49 AM
ఉమ్మడి పశ్చిమలో నామినేటెడ్ పదవుల వర్షం కురిసింది. ఒక్కసారిగా కూటమి ప్రభుత్వం ఈ జిల్లాకు ప్రాధాన్యం ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యేలను వివిధ కార్పొరేషన్ల చైర్మన్లుగా నియమించారు.
మాజీ ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం
త్యాగాలు చేసిన గన్ని, వలవలకు ప్రాధాన్యం
సాధారణ కార్యకర్తలకూ జాబితాలో తగిన గుర్తింపు
ఇడా చైర్మన్‌గా ఏలూరు నగర టీడీపీ అధ్యక్షుడు
ప్రకటించిన 22 కార్పొరేషన్లలో ఉమ్మడి పశ్చిమలోనే ఏడుగురు..
ఒక్కసారిగా దయ చూపిన కూటమి ప్రభుత్వం
ఉమ్మడి పశ్చిమలో నామినేటెడ్ పదవుల వర్షం కురిసింది. ఒక్కసారిగా కూటమి ప్రభుత్వం ఈ జిల్లాకు ప్రాధాన్యం ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యేలను వివిధ కార్పొరేషన్ల చైర్మన్లుగా నియమించారు. గత ఎన్నికల్లో సీటు త్యాగాలకోర్చిన వారికి తగు న్యాయం చేశారు. సాధారణ కార్యకర్తల్ని గుర్తించి పదవులను ఇవ్వడం ఈసారి విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా 22 కార్పొరేషన్ చైర్మన్ పదవులను ప్రకటించగా ఏడుగురు ఉమ్మడి జిల్లాకు చెందిన వారే ఉన్నారు. ఏలూరు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గన్ని వీరాంజనేయులకు ఆప్కాబ్ చైర్మన్ పదవితో పాటు డీసీసీబీ చైర్మన్ పదవి వరించింది..
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ పదవుల్లో ఉమ్మడి జిల్లాకు తగిన చోటు లభించింది. రాష్ట్ర స్థాయిలో ఏడుగురికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చైర్మన్ పదవులు వరించాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు నాలుగు, ఏలూరు జిల్లాకు ఒకటి, తూర్పు గోదావరి జిల్లాకు రెండు పదవులు వచ్చాయి. ఈసారి నామినేటెడ్ నియామకాల్లో కనీ,వినీ ఎరుగని రీతిలో ఉమ్మడి పశ్చిమకు పెద్దపీట వేశారు. పార్టీలో సీనియర్లతో పాటు, కార్యకర్తలకు అవకాశం కల్పించారు. ఈ జాబితాను పరిశీలిస్తే నియోజకవర్గాల వారీగా త్యాగశీలురైన మాజీ ఎమ్మెల్యేలకు తగు ప్రాధాన్యం ఇచ్చినట్లయ్యింది. మాజీ మంత్రి పీతల సుజాతకు తొలి దఫాగా నామినేటెడ్‌లో ఒక పదవి ఇచ్చినా అప్పట్లో ఆమె దానిని స్వీకరించలేదు. ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్‌గా పీతల సుజాతను తాజాగా నియమించారు. గత ఎన్నికల్లో ఆమెకు సీటు ఇవ్వకపోయినా అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీ ప్రఽధాన కార్యాల యంలో పార్టీ పక్షాన విధానాలను ఎప్పటి కప్పుడు మీడియాకు వివరించడంలో ఆమె ముందు న్నారు. చాలా కాలంగా తనకు ప్రాధాన్యత కలిగిన పదవి ఇవ్వడం ఖాయమని, సీఎం చంద్రబాబు, యువనేత లోకేశ్‌లు ఖచ్చితంగా తనకు ప్రాధాన్యం ఇస్తారని ధీమాగా ఉండగా, ఇప్పుడది నెరవేరింది. తాడేపల్లి గూడెం నుంచి కూటమి ఎన్నికల పొత్తులో భాగంగా గతంలో పోటీ చేసే అవకాశం కోల్పోయిన వలవల బాబ్జీకి కార్పొరేషన్ చైర్మన్ పదవిని కేటాయిం చారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా చాన్నాళ్ల పాటు బాబ్జీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు తాజాగా ఆంరఽధప్రదేశ్ భవన, ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్‌గా వలవలను నియమించారు. పార్టీకి విస్తృత సేవలం దించిన తాడేపల్లిగూడెంకు చెందిన ఆకాశపు స్వామిని ఆంధ్రప్రదేశ్ టైలర్ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్‌గా నియమించగా, మరోవైపు నర్సాపురానికి చెందిన కొల్లు పెద్దిరాజును ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల సహకార సంఘం చైర్మన్‌గా నియమిం చారు. ఇంకోవైపు ఏలూరు పట్టణాభివృద్ది సంస్థ(ఇడా) చైర్మన్ పదవి కోసం సీనియర్లు ప్రయత్నించారు. అయితే దీర్ఘకాలికంగా పార్టీ పట్ల విధేయుడిగా, నమ్మకస్తుడిగా, క్రమశిక్షణ కలిగిన కార్య కర్తగా ప్రస్తుతం ఏలూరు నగర టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న పెద్దిబోయిన వాణి వెంకట శివప్రసాద్ ఇడా చైర్మన్‌గా నియమించారు. పార్టీకి బద్దులై వ్యవహరించే వారికి తగిన గుర్తింపు ఉంటుం దనే సంకేతాలు శివప్రసాద్ నియామకంతో అందరికీ తెలిసేలా చేశారు. కొవ్వూరులో గత ఎన్నికల్లో సీటు కోల్పోయిన మాజీ మంత్రి కేఎస్ జవహర్‌కు ఆంధ్ర ప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా గుర్తింపు దక్కింది. నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు గత ఎన్నికల్లో కూటమి పొత్తుల్లో భాగంగా మరోసారి పోటీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. అప్పట్లో ఖచ్చితంగా మీకు తగిన ప్రాధాన్యం కల్పిస్తామని ఆయనకు పార్టీ హామీ ఇచ్చింది. ఎమ్మెల్సీ లేదా ఇతర పదవులు దక్కుతాయని అందరూ భావించారు.అయితే కీలమైన ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా శేషారావును నియమించారు.
గన్ని.. డబుల్ బొనాంజా
డీసీసీబీ, ఆప్కాబ్ చైర్మన్‌గా నియామకం
విధేయత,త్యాగాలకు బహుమానం
డీసీఎంఎస్ చైర్మన్ పదవి జనసేనకే..
నరసాపురానికి చెందిన మురళీకృష్ణకు పట్టం
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
పార్టీ కేడర్, నేతలు ఆశిస్తున్నట్లుగా విధేయతతో పాటు పార్టీ కోసం నిర్విరామంగా కష్టపడిన ఏలూరు జిల్లా టీడీపీ అఽధ్యక్షుడు గన్ని వీరాంజనేయులును ఆప్కాబ్ చైర్మన్ పదవితో పాటు డీసీసీబీ చైర్మన్ పదవి వరించాయి. డీసీఎంఎస్ చైర్మన్‌గా నరసాపురం మండలానికి చెందిన జనసేన రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీకృష్ణను నియమించారు. దీంతో కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. ఆప్కాబ్ చైర్మన్ పదవి చాలా కాలంగా గన్నిని వరించడం ఖాయమని వినిపించింది. దానిని నిజం చేస్తూ అధికారికంగా ఆదివారం ప్రకటన వెలువడింది. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులకు మిగతా జిల్లాల్లో కొందరితో కూడిన జాబితాను పక్షం రోజుల క్రితమే ప్రకటించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన, టీడీపీకి తగిన రీతిలో నియామకాలు జరిగేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఫలితంగా ఈ రెండింటి నియామకంలో కొంత జాప్యం జరిగింది. దీనికి తెరదించుతూ ఉమ్మడి పశ్చిమ డీసీసీబీ చైర్మన్‌గా , రాష్ట్రస్థాయిలో ఆప్కాబ్ చైర్మన్‌గా నియమించి గన్నికి డబుల్ బొనంజా ప్రకటించారు. వాస్తవానికి డీసీసీబీ చైర్మన్ పదవికి జనసేన ఒకానొక దశలో పోటీకి వచ్చినట్టు అనిపించింది. అయితే తెలుగుదేశం ఆప్కాబ్ చైర్మన్ పదవి గన్నికి కేటాయించాలని చాన్నాళ్ల క్రితమే కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో తూర్పుగోదావరి డీసీసీబీ జనసేనకు కేటాయిస్తే, ఉమ్మడి పశ్చిమలో టీడీపీకి చెందిన గన్నిని నియమించాలని భావించారు. ఈ నేపథ్యంలో కొంత కీలక చర్చ జరిగింది. ఉమ్మడి పశ్చిమలో డీసీఎంఎస్ చైర్మన్ పదవిని జనసేనకు కట్టబెట్టేలా ప్రతిపాదించారు. కానీ ఆ పార్టీ పక్షాన చైర్మన్ పదవికి ఎవర్ని నియమించాలనే విషయంలో కొంత తర్జనభర్జన సాగింది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లా జనసేన అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు (చినబాబు)ను నియమించబోతున్నట్టు ప్రచారం సాగింది. అయితే డీసీఎంఎస్ చైర్మన్ పదవి పట్ల చినబాబు ఆసక్తి కనబర్చకపోవడంతో వేరొకర్ని ప్రతిపాదించే క్రమంలో మరోసారి జాప్యం జరిగింది. చివరకు నరసాపురం నియోజకవర్గం లక్ష్మణేశ్వరానికి చెందిన, జనసేన రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న చాగంటి మురళీకృష్ణను అదృష్టం వరించింది. డీసీఎంఎస్ చైర్మన్‌గా ఆయన్ని నియమిస్తూ ఆదివారం ప్రకటన వెలువడింది. సాధారణంగా పార్టీ నామినేటెడ్ పదవి విషయంలో అనేకమంది పోటీపడినా మురళీకృష్ణను గుర్తించి, నియమించడం విశేషం.
విధేయతే కలిసొచ్చింది
పార్టీకి అత్యంత విధేయుడుగా కొనసాగడం ఒక ఎత్తయితే, గత ఎన్నికల్లో ఉంగుటూరు నుంచి పోటీ చేసే అవకాశం కోల్పోవడం పార్టీ గుర్తించి మరీ గన్నికి నామినేటెడ్ పదవుల్లో అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ఉంగుటూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనే విషయంలో చివరివరకు టీడీపీ, జనసేనలో ఉత్కంఠ కొనసాగింది. చివరికి జనసేనకు కేటాయించడంతో, ఆ పార్టీయే బరిలో దిగి గెలుపొందింది. దీంతో ఈ స్థానం నుంచి మూడోసారి పోటీచేయాలని ఆశపడిన గన్నికి తగిన సమయంలో తగిన పదవి ఇస్తామంటూ టీడీపీ అధిష్ఠానం హామీ ఇచ్చింది. దీనికి తోడు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా గన్ని నియోజకవర్గాల్లో ఉన్న కొన్ని సమస్యలను పరిష్కరించారు. మరికొన్నింటిని అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పార్టీకి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పార్టీ కోసం ఉంగుటూరు సీటును త్యాగం చేసినందుకు ప్రతిగా ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం సాగింది. ఎమ్మెల్సే జయమంగళ వెంకట రమణ తన పదవికి రాజీనామా చేసినప్పుడు ఆ స్థానంలో గన్ని నియామకం ఖాయమని ప్రచారం సాగిన కార్యరూపం దాల్చలేదు. ఈ ఏడాది జనవరిలో పశ్చిమ గోదావరి పర్యటనకు వచ్చినప్పుడు నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన గన్ని వీరాంజనేయులను ఉద్దేశించి.. ‘ఆప్కాబ్ చైర్మన్ గారూ రండి’ అంటూ సాదరపూర్వకంగా పిలిచారు. అప్పటి నుంచి గన్నికి ఆప్కాబ్ ఖాయమంటూ పార్టీలో నమ్మకం ఏర్పడింది. తీరా గత డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్‌ల నామినేటెడ్ జాబితాలో గన్ని ప్రస్తావన లేకపోవడం, ఆయన అనుచరవర్గంలో టెన్షన్ పెంచింది. అయితే పార్టీ సీనియర్లు మాత్రం లోకేశ్ మాటలే నిజం అవుతాయంటూ గన్నికి భరోసా ఇచ్చారు. గన్ని ఏదైతే కోరుకుంటున్నారో అదే పదవి కట్టబెట్టడం పార్టీలో ఆయనకు ఉన్న పరపతికి నిదర్శనంగా భావిస్తున్నారు. అందరూ ఆశించనట్లుగానే ఒకవైపు డీసీసీబీ చైర్మన్ పదవి, మరోవైపు ఆప్కాబ్ చైర్మన్‌గా నామినేటెడ్ చేయడంతో గన్ని శిబిరంలో ఉత్సాహం ఉరకలేసింది. ఆప్కాబ్ చైర్మన్‌గా నియమితులైన వీరాంజనేయులను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ ఆదివారం భీమడోలులోని ఆయన నివాసంలో కలిసి అభినందనలు తెలిపి సత్కరించారు. ఆయనతో పాటు ఏలూరు టీడీపీ అధ్యక్షుడు పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారఽథి, టీడీపీ నేత బెల్లంకొండ కిశోర్ ఉన్నారు.