Share News

ఎవరికీ పట్టని పట్టిసీమ

ABN , Publish Date - Jul 21 , 2025 | 12:42 AM

పట్టిసీమ ఎత్తి పోతల పథకం నిర్వహణ అస్తవ్యస్థంగా మారడంతో ఎత్తిపోతల పథకం ప్రధాన లక్ష్యానికి గండి పడుతోం దని రైతులు, గ్రామస్థులు, పలువురు కూటమి నేత లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎవరికీ పట్టని పట్టిసీమ
విరిగిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రధాన ద్వారం షట్టర్‌

విరిగిన ప్రధాన ద్వారం షట్టర్‌..

ఇప్పటికీ మరమ్మతులు శూన్యం

24 మోటార్లకు 22 మోటార్లే దిక్కు

మరమ్మతులకు నోచుకోని మరో రెండు మోటార్లు

అరకొరగా సిబ్బంది.. ఉన్న వారిపై పని ఒత్తిడి

పోలవరం, జూలై 20(ఆంధ్రజ్యోతి):పట్టిసీమ ఎత్తి పోతల పథకం నిర్వహణ అస్తవ్యస్థంగా మారడంతో ఎత్తిపోతల పథకం ప్రధాన లక్ష్యానికి గండి పడుతోం దని రైతులు, గ్రామస్థులు, పలువురు కూటమి నేత లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి రాయలసీమ, కృష్ణా, పశ్చిమ డెల్టాల రైతులు సాగునీటికి, ప్రజలు తాగునీటికి ఇబ్బందులకు గురి కాకూడదనే లక్ష్యంతో 2014లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు. కేవలం ఏడాది వ్యవధిలో రూ.1,600 కోట్లతో ఈ పథకం నిర్మించారు. తొలుత నిర్వహణ బాధ్యతలు పథకం నిర్మాణ కంపెనీ మేఘా తీసుకో వడంతో నిర్వహణ సక్రమంగానే సాగింది. ఇటీవల పవర్‌ సొల్యూషన్‌ సంస్థకు బాధ్యతలు అప్పగించిన నాటి నుంచి నిర్వహణ అస్తవ్యస్థంగా మారడంతో పథకం ప్రధాన లక్ష్యానికి గండిపడే పరిస్థితులు నెలకొన్నాయి.

కానరాని పర్యవేక్షణ

మూడేళ్ల క్రితం పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఎడమ ప్రధాన ద్వారం షట్టర్‌ విరిగి కిందపడడంతో పథకానికి ఒకవైపు రక్షణ పూర్తిగా కరువయ్యింది. దీనికి తోడు రెగ్యులర్‌ పర్యవేక్షణ లేకపోవడంతో తరచూ నీటి పంపిణీ ప్రధాన పైపులైన్ల పొడవునా ఎయిర్‌ వాల్వ్‌లు లీకేజీలు ఏర్పడి పంటలు దెబ్బతినడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 24 మోటార్లు 24 పంపులు పనిచేయాల్సి ఉండగా నిర్వహణా లోపంతో ప్రస్తుతం 22 మోటార్లు మాత్రమే పని చేస్తున్నాయి. మిగిలిన రెండు మోటార్లు మరమ్మతులకు నోచుకోకపోవడంతో నీటి పంపిణీ తగ్గింది.

అరకొరగానే సిబ్బంది విధులు

నాన్‌ వర్కింగ్‌ సమయంలో 49 మంది సిబ్బంది, వర్కింగ్‌ సమయంలో 72 మంది సిబ్బంది మూడు షిఫ్టులలో 72 మంది సిబ్బంది పని చేయాల్సి ఉండగా నిర్వహణా భారం పేరిట సిబ్బందిని తగ్గించి కేవలం 20 మంది సిబ్బందిని మాత్రమే కొనసాగించడం వల్ల సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగి పథకం నిర్వహణ కుంటుపడుతోందన్న ఆరోపణలున్నాయి. వాస్తవానికి రెండు మోటార్లకు ఒక ఎలక్ర్టీషియన్‌తో పాటు సిబ్బందిలో ఒకరిని వినియోగించాల్సి ఉంది. అయితే తక్కువ మంది సిబ్బంది పని చేస్తున్నారని ఈ విషయంపై అధికారుల పర్యవేక్షణ కరువయ్యిందని పలువురు రైతులు, ప్రజాప్రతినిఽధులు చెబుతున్నారు. దీనిపై ఏఈ వినోద్‌ని వివరణ కోరగా 24 మోటార్లు వర్కింగ్‌ కండిషన్‌లోనే ఉన్నాయని అవసరాన్ని బట్టి మోటార్లు వినియోగిస్తామని, సిబ్బంది అవసరం ఉన్నంత వరకు పని చేస్తున్నారని తెలిపారు.

Updated Date - Jul 21 , 2025 | 12:42 AM