సాగు నీరు లేదు..!
ABN , Publish Date - Jul 16 , 2025 | 12:58 AM
సాగు నీరందక వరి నారుమడులు ఎండిపోతున్నాయని, నాట్లు వేసిన చేలు బీటలు వారాయని రైతు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏలూరు రూరల్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): సాగు నీరందక వరి నారుమడులు ఎండిపోతున్నాయని, నాట్లు వేసిన చేలు బీటలు వారాయని రైతు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగు నీరందించి పంటలు కాపాడాలంటూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు, కౌలు రైతులు మంగళవారం ధర్నా చేపట్టారు. వెంకటాపురం రైతు సేవా కేంద్రం వద్ద ఎండిపోతున్న నారుమడిలో బీటలు వారిన మట్టిగడ్డలతో నిరసన వ్యక్తం చేశారు. ఏలూరు రూరల్ మండలం వెంకటాపురం మాదేపల్లి, జాలిపూడి, చాటపర్రు, పోణంగి, కొమరవోలు, కాట్లంపూడి తదితర గ్రామాలలో వేలాది ఎకరాలకు సాగునీరు అందడం లేదన్నారు. మెయిన్ కెనాల్ నుంచి జాలిపూడి మాదేపల్లి వైపు ప్రధాన పంటకాలువ గుర్రపుడెక్క, తూడు, చెత్త, ప్లాస్టిక్ వ్యర్ధాలతో నిండిపోయిందన్నారు. అధికారులు స్పందించకుంటే బుధవారం ఏలూరు కైకలూరు రోడ్డును సుంకరవారి తోట వంతెన వద్ద దిగ్భంధనం చేస్తామని హెచ్చరించారు.