రబీ సాగునీటికి ఢోకా లేనట్టే!
ABN , Publish Date - Dec 15 , 2025 | 12:30 AM
రబీ పంటకు సాగునీటికి ఢోకా లేకుండా జలవనరుల శాఖ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగు తోంది.
జలవనరులశాఖ సమగ్ర కార్యాచరణ
రేపు ఐఏబీ సమావేశంలో సమీక్ష
రబీ పంటకు సాగునీటికి ఢోకా లేకుండా జలవనరుల శాఖ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగు తోంది. ఏటా రెండో పంటకు గోదావరి డెల్టా కింద సాగునీటి సమస్యలను రైతాంగం ఎదుర్కొనేది. గతేడాది నుంచి ముందస్తు రబీ దిశగా సాగునీటి విడుదల చేపట్టడం. నిరం తర పర్యవేక్షణతో రైతులు సాఫీగా పంటల సాగు చేపడుతున్నారు. ఈ ఏడాదీ ఏ ఇక్కట్లు రైతులు పడకుండానే జలవనరుల శాఖ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
గోదావరి డెల్టా కింద 4లక్షల60వేల ఎకరాలకు సాగు నీటిని అందివ్వడానికి సన్నద్దమవుతున్నారు. గోదావరి డెల్టా కింద నాట్లు త్వరగా పూర్తి చేయడానికి వ్యవ సాయశాఖ కసరత్తు చేస్తోంది. విజ్జేశ్వరం నుంచి గోదావరి డెల్టాకు ప్రతీ రోజు ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. అవసరాన్ని బట్టి నీటి విడుదలను పెంచుతుంటారు. శెట్టిపేట డివిజన్ ఈఈ పర్యవేక్షణలో నీటి సరఫరా జరుగుతోంది.
20 టీఎంసీల సీలేరు జలాలు..
గోదావరి డెల్టాకు సాగునీరు అందించేందుకు సీలేరు జలాలను బైపాస్ ద్వారా జిల్లా సాగునీటి అవసరాలకు మళ్లించనున్నారు. గోదావరికి ఇబ్బంది కలిగితే సీలేరు జలాలను ఫిబ్రవరి మూడో వారం నుంచి పంటలు పూర్తయ్యే వరకు జిల్లా అవసరా లకు 20 టీఎంసీలు అందివ్వనున్నారు. ఈ నీటి విడుదల సమయంలో విద్యుత్ ఉత్పత్తి దృష్ట్యా నీటిని మనకు ఇస్తారని అధికారులు చెబుతున్నారు. మరోవైపు పోలవరం నుంచి 20 టీఎంసీలు, ధవళేశ్వరం నుంచి 3 టీఎంసీలు నీటి నిల్వలు రబీ అవసరాలకు ఇవ్వనున్నారు.
కృష్ణా డెల్టాకు సాగునీటి విడుదల లేదు
కృష్ణా డెల్టా కింద దెందులూరు నియోజకవర్గంలో రెండో పంటకు సాగునీటి విడుదల చేయడం లేదని అధికారులు ప్రకటించారు. దీంతో ఇక్కడ మినుము, అపరాల పంటలను రైతులు సాగు చేస్తారు. కృష్ణా డెల్టా కింద తాగునీటి అవసరాలకు మాత్రమే నీటి విడుదల జరుగుతుంది. ఈ పరిధిలో బుడమేరుకు మరమ్మతులు చేయనుండడంతో మార్చి, ఏప్రిల్ నెలల్లో దెందులూరు నియోజకవర్గానికి, ఏలూరు తాగునీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇటీవల కృష్ణా ఎస్‌ఈ మోహన్‌రావుకు విజ్ఞప్తి చేశారు.