బేర్ మంటున్నారు!
ABN , Publish Date - Sep 17 , 2025 | 12:16 AM
బార్ తెలుపులు తెరుచుకుంటాయా..? ఈ సారైనా లైసెన్స్‌దారులు ముందుకు వస్తారా ? జిల్లాలో మిగిలిన బార్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు నేటితో గడువు ముగియనుండడంతో ఎక్సైజ్ అధికారుల్లో అలజడి నెలకొంది..
13 బార్లకు ఇదివరకే నోటిఫికేషన్
స్పందన ఎందుకు రావడం లేదో ?
ఆరా తీసిన ముఖ్యమంత్రి
వైసీపీ హయాంలో అమలు చేసిన
ట్యాక్స్‌లే కారణమని నివేదిక
బార్ తెలుపులు తెరుచుకుంటాయా..? ఈ సారైనా లైసెన్స్‌దారులు ముందుకు వస్తారా ? జిల్లాలో మిగిలిన బార్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు నేటితో గడువు ముగియనుండడంతో ఎక్సైజ్ అధికారుల్లో అలజడి నెలకొంది.. స్పందన రాకపోవడానికి కారణమేమిటని సీఎం కూడా ఆరాతీశారు.. నేడు ఏం జరుగుతుందో చూడాలి...
(భీమవరం–ఆంరఽధజ్యోతి)
బార్లపై ఎక్సైజ్ అధికారుల్లో కాస్త ఆశలు పెరిగాయి. బార్ల లైసెన్స్‌ల కోసం స్పందన ఎందుకు రావడం లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలపై తీసుకున్న రుణాలను తీర్చేందుకు అమలు చేసే ఏపీ రిటైల్ ఎక్సైజ్ టాక్స్ (ఏపీఆర్‌ఈటీ) కారణ మంటూ అధికారులు వివరించారు. దీనిపై పరిశీలించి బార్లకు అనువైన విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. దాంతో ఎక్సైజ్ అధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. రెండో విడతలో నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ లైసెన్స్‌దారుల నుంచి స్పందన రాలేదు. ఎక్సైజ్ అధికారులు ఈ విషయంలో అన్ని ప్రయత్నాలు చేశారు.జిల్లాలో మొత్తం 31 బార్లకు తొలి విడతలో 18 ఖరారయ్యాయి. మలి విడతలో మిగిలిన 13 బార్లకు నోటిఫికేషన్ జారీచేశారు. చివరిరోజు వచ్చేనాటికి కూడా లైసెన్స్‌దారుల నుంచి స్పందన కానరాలేదు. భీమవరం, నర్సాపురంలో మాత్రమే పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయి. దరఖాస్తు గడువు బుధవారంతో ముగియ నుంది. ఇప్పటిదాకా భీమవరంలో మూడు బార్లకు మాత్రం ఒక్కో దరఖాస్తు పడింది. నర్సాపురంలో ఒక బార్‌కు ఒక దరఖాస్తు వచ్చింది.భీమవరంలో నాలుగు, తాడేపల్లి గూడెంలో నాలుగు, తణకులో మూడు, నర్సాపురంలో రెండు బార్లకు నోటిఫికేషన్ జారీ చేయగా నాలుగు బార్లకు మాత్రమే ఒక దరఖాస్తు వంతున పడ్డాయి.
తాడేపల్లిగూడెంలో నిరాశాజనకం
భీమవరంలో మూడు బార్లకు దరఖాస్తులు వేస్తారని అధికారులు అంచనాతో ఉన్నారు. అక్కడ బార్‌లలో అమ్మకాలు గరిష్టంగా రూ. 1.50 లక్షల దాకా ఉన్నాయి. అయితే మిగిలిన బార్‌లు తెరచుకుంటే అమ్మకాలపై ప్రభావం పడనుంది. భీమవరంలో బార్ కల్చర్ ఉండడంతో లైసెన్స్‌దారులనుంచి ఒప్పంచి దరఖాస్తులు పడేలా అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. నర్సాపురంలోనూ అదే పరిస్థితి. అక్కడ తీర ప్రాంతాల నుంచి వచ్చే జనాలు ఉంటారు. దానిపైనే ఎక్సైజ్ శాఖ నమ్మకం పెట్టుకుంది. తణుకులోనూ పరావాలేదన్న పరిస్థితిలో ఉన్నారు. తాడేపల్లిగూడెంలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఇదే పట్టణంలో గతంలో ఖరారైన బార్‌లలో రూ. 80 వేల వరకు మాత్రమే అమ్మకాలు సాగుతున్నాయి. ఇక్కడ కొత్తగా దరఖాస్తులు వేయాలంటే లైసెన్స్‌దారులు బెంబేలెత్తి పోతున్నారు. మద్యం షాపులు ఎక్కువగా ఉన్నాయి. పైగా బార్ కల్చర్ తక్కువ.దానికి తోడు 15 శాతం రిటైల్ టాక్స్ వసూలు చేస్తున్నారు.
పన్నుపై నిర్ణయమేమిటి ?
వైసీపీ ప్రభుత్వం అదే మద్యంపై దీర్ఘకాలిక రుణాలు తీసుకుంది. ఆ రుణం తీర్చడానికి బార్లపై 15 శాతం రిటైల్ టాక్స్ అమలు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు మద్యం షాపుల్లో నాణ్యమైన మద్యం లభిస్తోంది. ధరలు తగ్గుముఖం పట్టాయి. దాంతో బార్‌లలో అమ్మకాలు కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు ఈ 15 శాతం పన్నుపైనే ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది.