నో రిజిస్ట్రేషన్
ABN , Publish Date - Dec 03 , 2025 | 12:30 AM
జిల్లాలో నాన్ లేఅవుట్ వేసిన రియల్టర్లు, కొనుగోలు చేసిన వారికి షాక్ తగిలింది. స్థలాలకు పన్ను చెల్లించే అసెస్‌మెంట్ నెంబర్లు లేకపోవడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజులను తిప్పి పంపుతున్నారు.
నాన్ లేఅవుట్‌లో స్థల యజమానులకు షాక్
పన్ను చెల్లించని స్థలాల వారినితిప్పిపంపుతున్న సబ్ రిజిస్ట్రార్లు
మునిసిపాలిటీల్లో చుక్కెదురు
అసెస్‌మెంట్ నంబర్‌తోనే రిజిస్ట్రేషన్లు
ఒత్తిడి చేస్తున్న నేతలు
జిల్లాలో నాన్ లేఅవుట్ వేసిన రియల్టర్లు, కొనుగోలు చేసిన వారికి షాక్ తగిలింది. స్థలాలకు పన్ను చెల్లించే అసెస్‌మెంట్ నెంబర్లు లేకపోవడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజులను తిప్పి పంపుతున్నారు. జిల్లాలోని తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవారం ఒకేరోజు ఎనిమిది దస్తావేజులను తిప్పి పంపారు. జిల్లా కేంద్రం భీమవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆరు దస్తావేజులు పెండింగ్‌లో పెట్టారు. రిజిస్ట్రేషన్లు చేయాల్సిందేనంటూ మరోవైపు రాజకీయ నేతల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
ఖాళీ స్థలాలకు పన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్న భూ యజమానులు ముందుకొచ్చేలా ప్రభుత్వం రిజిస్ట్రేషన్లకు అసెస్‌మెంట్ నంబర్‌తో ముడిపెట్టింది. పన్ను చెల్లించిన స్థలా లకు మాత్రమే అసెస్‌మెంట్ నెంబర్ ఉంటుంది. ఇప్పటి వర కు అసెస్‌మెంట్‌తో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ చేసేవారు. గడచిన వారం రోజుల నుంచి ప్రభుత్వం కొత్త విధానం అమలు చేస్తోంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అదే సాఫ్ట్ వేర్ పంపింది. పట్టణాల్లో అసెస్‌మెంట్ నెంబర్ ఉన్న స్థలాలకే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఒకవేళ జీరో నెంబర్ వేసి చేస్తే పన్ను చెల్లించని స్థలాలకు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అలా చేసేం దుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సిబ్బంది వెనుకంజ వేస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో అసెస్‌మెంట్ నెంబర్‌ను తప్పని సరి చేశారు.
పన్ను చెల్లించాలన్నా..
జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం పురపాలక సంఘాలతోపాటు, ఆకివీడు పట్టణం లో నాన్ లేఅవుట్‌లు ఇబ్బడిముబ్బడిగా వెలిశాయి. పలువురు స్థలాలను కొనుగోలు చేశారు. సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌కు ఆటంకం లేకపోవడంతో అక్కడక్కడా నాన్ లే అవుట్ స్థలాల కొనుగోళ్లు జోరుగా సాగాయి. దీనితో రియల్టర్లు లేఅవుట్ అనుమతి దరఖాస్తు చేయడం లేదు. నాన్ లేఅవుట్ వ్యాపారం లాభసాటిగా ఉంటోందని భావిస్తున్నారు. స్థలాలు కొనుగోలు చేసిన వారు ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు. రిజిస్ట్రేషన్లు కావడం లేదు. మునిసిపాలిటీల్లో పన్ను చెల్లించి అసెస్‌మెంట్ నెంబర్ వేసుకుందామంటే అక్కడా చుక్కెదురవు తోంది. నాన్ లేఅవుట్‌లో స్థలాలన్నింటికీ ఒకేసారి పన్ను వేసు కోవాలని మునిసిపాలిటీల్లో రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తు న్నారు. ఫలితంగా స్థలాలు కొనుగోలు చేసుకున్న యజమాను లు ఒక్కొక్కరిగా వెళ్లినా పన్ను చెల్లించలేని పరిస్థితి నెలకొంది. మొత్తంపైన అసెస్‌మెంట్ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయాలన్న నిబంధన ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.
పన్ను చెల్లిస్తేనే ప్లాన్..
పన్ను చెల్లించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్లాన్ మంజూర వుతుంది. బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు కల్పిస్తాయి. ఇప్పటి వరకు వ్యక్తిగతంగా వెళ్లి బెటర్‌మెంట్, రిజర్వుడ్ సైట్ చార్జీలు చెల్లిస్తే క్రమబద్ధీకరించి పన్ను కట్టించుకునేవారు. తర్వాత ప్లాన్ మంజూరయ్యేది. ప్రస్తుతం అమలులో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్ పథకంలో దరఖాస్తు చేసుకున్నా 50 శాతం రాయితీతో క్రమబద్ధీకరిస్తారు. అటువంటి స్థలాలను భవిష్యత్ లో విక్రయించుకోవాలన్నా రిజిస్ట్రేషన్ సునాయాసం కానుంది. నివాసాలు ఏర్పాటు చేసుకోవాలన్నా ప్లాన్ మంజూరవుతుంది. లేఅవుట్ స్థలాల్లో కొనుగోలు చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా పన్ను చెల్లింపు నుంచి, రిజిస్ట్రేషన్, ప్లాన్‌లు మంజూ రు చకాచకా జరిగిపోనుంది. కానీ రియల్టర్లు మాత్రం నాన్ లేఅవుట్‌లపై ఆసక్తితో కొనుగోలుదారులను ముంచేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌లకు ఇప్పుడు పన్ను చెల్లించే అసెస్‌మెంట్ నెంబర్‌తో ముడిపెట్టడంతో నాన్ లేఅవుట్ స్థలాలకు, ఖాళీ స్థలాలకు షాక్ తగిలినట్టయ్యింది.