ఉద్యోగానికి మార్గం పాలిటెక్నిక్
ABN , Publish Date - May 13 , 2025 | 12:16 AM
మూడు దశాబ్దాలు వెనక్కి వెళితే పాలిటెక్నిక్ విద్యార్థులకే కాదు తల్లిదండ్రులకు సైతం ఒక కల. ప్రస్తుత ఐఐటీ స్థాయి క్రేజ్ పాలిటెక్నిక్ కళాశాలల సొంతం.
డిప్లొమా కోర్సులకు ఆదరణ అంతంత మాత్రమే
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో సగం సీట్లు ఖాళీ
ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకులు, వసతుల కొరత
ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలపై అవగాహన కార్యక్రమాలు
ఈ ఏడాది ప్రవేశ పరీక్షకు పెరిగిన విద్యార్థుల సంఖ్య
మూడు దశాబ్దాలు వెనక్కి వెళితే పాలిటెక్నిక్ విద్యార్థులకే కాదు తల్లిదండ్రులకు సైతం ఒక కల. ప్రస్తుత ఐఐటీ స్థాయి క్రేజ్ పాలిటెక్నిక్ కళాశాలల సొంతం. పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా, ఆతృతగా పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష రాయడం, సీటు రాకుంటే నిరాశగా ఇంటర్‌లో చేరడం పరిపాటి. క్రమేపీ కార్పొరేట్ విద్యా సంస్థల మాయాజాలంతో పాలిటెక్నిక్ మసకబారింది. ఇంటర్‌లో చేరడం, తర్వాత మెడిసిన్, ఐఐటీ వైపు చూడడం సర్వసాధారణమైంది. అప్పట్లో పాలిటెక్నిక్ కళాశాలలో సీటు దొరకడమే మహాభాగ్యం అనుకుంటే ఇప్పుడు సీట్లు భర్తీకాని పరిస్థితి. విద్యార్థి దశలో అతి చిన్న వయసులో ఉద్యోగావకాశాలున్న ఏకైక మార్గం పాలిటెక్నిక్.. అందుబాటులో ఉన్న డిప్లొమా కోర్సులపై పరిశీలన.
తాడేపల్లిగూడెం రూరల్, మే 12(ఆంధ్రజ్యోతి): పదో తరగతి చదివిన విద్యార్థుల భవితకు పాలిటెక్నిక్ ఒక భరోసా. ఇప్పుడు ఆ పరిస్థితి తారు మారైంది. కార్పొరేట్ విద్యా సంస్థల మాయాజాలంతో పాలిటెక్నిక్ కళాశా లల వైభవం కనుమరుగైంది. డిప్లొమా కోర్సు పూర్తి చేసిన తర్వాత 18, 19 ఏళ్ల వయసులో ప్రభుత్వం రంగ సంస్థలలో ఉన్నత ఉద్యోగావకాశాలు ఉన్న ఏకైక మార్గం పాలిటెక్నిక్. ఇంటర్మీడియన్ ప్రవేశాల కోసం కార్పొరేట్ విద్యా సంస్థల ప్రచార మాయాజాలంతో విద్యార్థుల తల్లిదండ్రులు మెడిసిన్, ఐఐటీ మోజులో పడిపోయారు. దీనితో ప్రైవేటు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో సగం సీట్లు కూడా భర్తీ కాని పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఒక ప్రభుత్వ, 8 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో సీట్ల భర్తీ కావడం లేదు. ముఖ్యంగా సివిల్, మెకానికల్ కోర్సుల్లో ప్రవేశానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి. జిల్లాలో మొత్తం 3600 పాలిటెక్నిక్ సీట్లు ఉండగా వాటిలో 1460 మాత్రమే సీట్లు భర్తీ కావడం పాలిటెక్నిక్ కోర్సులపై ఉన్న ఆదరణకు అద్దం పడుతోంది.
సీట్లు మార్పు చేసినా..
విద్యార్థులు సివిల్, మెకానికల్ కోర్సుల్లో చేరడానికి ఇష్టపడడంలేదని ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల యాజమాన్యం ఆ సీట్లను ఈసీఈ, కంప్యూటర్ సైన్స్ సీట్లుగా మార్పు చేసుకున్నారు. అయునా సీట్లు భర్తీకాక పాలిటెక్నిక్ కళాశాలలు అడ్మిషన్స్ కోసం తహతహలాడుతున్నాయి.
జిల్లాలోని తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్, మెకానికల్ కోర్సులు ఉన్నాయి. ప్రైవేటు కళాశాలల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలకా్ట్రనిక్స్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్‌స్ట్రమెంటేషన్ బ్రాంచ్‌లలో సీట్లు ఉన్నాయి. డిప్లొమా కోర్సులపై సరైన ఆదరణ లేక పోవడంతో నిర్వహణకు తలలు పట్టుకునే పరిస్థితి. డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో అవకాశాలు ఉన్నాయి. ఉన్నత చదవాలనుకుంటే నేరుగా బీటెక్ రెండో సంవత్సరంలో ప్రవేశించే అవకాశం ఉంది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడంతో ఆసక్తి కనబరచడం లేదు.
120 సీట్లకు 88 సీట్లు ఖాళీ
తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పరిస్థితి మరింత దయనీయం. సివిల్, మెకానికల్ కోర్సుల్లో 120 సీట్లు అందుబాటులో ఉన్నా యి. గత ఏడాది 32 సీట్లు మాత్రమే భర్తీ కావడంతో 88 సీట్లు ఖాళీగా ఉన్నాయి. గత ఏడాది పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష రాయని పదో తరగతి ఉత్తీర్ణులకు సైతం పలు కళాశాలల్లో ప్రవేశం కల్పించడం గమనార్హం.
అధ్యాపకుల కొరత
జిల్లాలో ఏకైక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అయిన తాడేపల్లిగూడెంలో అధ్యాపక సిబ్బంది కొరత వేధిస్తోంది. 30 మంది అధ్యాపకులకు 10 మంది మాత్రమే ఉన్నారు. మెకానికల్‌లో ముగ్గురు లెక్చరర్స్ మాత్రమే ఉన్నారు. వారిలో ఒక హెడ్, ఒక లెక్చరర్స్ అవసరం ఉంది.
ప్రభుత్వ పాఠశాలల్లో అవగాహన సదస్సులు
డిప్లొమా కోర్సులతో కెరీర్ ఎలా ఉంటుంది, ఉద్యోగావకాశాలు, తదితర అంశాలతో గత ఫిబ్రవరి నుంచి పాలిటెక్నిక్ అధ్యాపకులు క్యాంపెయిన్ చేశారు. 60 ప్రభుత్వ పాఠశాలల్లో 2వేల మందికి పైగా విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాలిసెట్‌కు ఉచిత శిక్షణ కూడా ఇచ్చారు. పాలిసెట్ ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి.
అవగాహన కల్పిస్తున్నాం
పాలిటెక్నిక్ కోర్సులు అంటే గతంలో సీట్లు దొరక్క చాలా పోటీ ఉండేది. కానీ ప్రస్తుతం ఆ కోర్సులకు ఆదరణ లేదు. పాలిటెక్నిక్ పూర్తిచేసిన ప్రతీ ఒక్కరికి ఉద్యోగావకాశం ఉన్నా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల చాయిస్‌లో అది ఉండడం లేదు. ఈ కోర్సులపై అవగాహన పెంచాం. గతం కంటే ఈ ఏడాది పాలిటెక్నిక్ కోర్సులకు ఆదరణ బాగుంటుంది.
బి.ఫణీంద్ర ప్రసాద్, పాలిటెక్నిక్ కళాశాల జిల్లా కోఆర్డినేటర్