Share News

ఇంటర్‌పై మక్కువ తగ్గిందా ?

ABN , Publish Date - Jun 28 , 2025 | 12:13 AM

ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు పాఠశాల విద్యా విధానంలో కొన్ని మార్పులు తీసుకువచ్చింది.

ఇంటర్‌పై మక్కువ తగ్గిందా ?

టెన్త్‌ ఉత్తీర్ణత పెరిగినా.. అడ్మిషన్లు అంతంతమాత్రమే

మరో మూడు రోజుల్లో ముగియనున్న అడ్మిషన్ల గడువు

జిల్లాలో 130 కళాశాలల్లో 17,109 మంది విద్యార్థుల చేరిక

గత ఏడాది కంటే 2,653 తక్కువ..

ఎక్కువ మంది చూపు పాలిటెక్నిక్‌ వైపు

(భీమవరం రూరల్‌–ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు పాఠశాల విద్యా విధానంలో కొన్ని మార్పులు తీసుకువచ్చింది. విద్యా సామగ్రి అందించడంతోపాటు మధ్యాహ్న భోజనం అవకాశాన్ని ఈ ఏడాది జనవరి నుంచి కల్పిస్తోంది. విద్యాబోధనలోను ప్రణాళికగా సాగేలా ఏర్పాట్లు చేశారు. అయినప్పటికి అడ్మిషన్ల పరంగా వెనుకబాటు కనిపిస్తోంది. జిల్లాలో 15 ప్రభుత్వ కళాశాలలు, రెండు ఎయిడెడ్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిలో గత ఏడాది 2,223 మంది విద్యార్థులు చేరారు. ప్రస్తుతం 1,819 మంది విద్యార్థులు మాత్రమే ప్రవేశాలు పొందారు. ఈ ఏడాది ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల చేరిక ఎక్కువ ఉంటుందని అంచనా వేశారు. కాని, గత ఏడాదికంటే తక్కువగానే కనిపిస్తోంది. మిగిలిన వ్యవధిలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాల ద్వారా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఇప్పుడిప్పుడే అడ్మిషన్లు తీసుకుంటున్నారు.

పెరిగిన టెన్త్‌ ఉత్తీర్ణత

రెండేళ్లుగా చూస్తే ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెరిగింది. 2022–23 విద్యా సంవత్సరంలో 45 శాతం. 2023–24లో 50 శాతంలోపు ఉత్తీర్ణత సాధిస్తే 2024–25లో 72 శాతం మంది అంటే 9,200 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీంతో ఇంటర్‌లో చేరే విద్యార్థుల సంఖ్య గడిచిన రెండేళ్ళకంటే ఈ ఏడాది పెరుగుతుందని ఇంటర్‌ కళాశాలల యాజమాన్యాలు అంచనా వేశాయి. ప్రస్తుత గణాంకాలను బట్టి చూస్తే ఆ పరిస్థితి కనిపించడం లేదు.

పాలిటెక్నిక్‌ వైపు విద్యార్థుల చూపు

విద్యార్థుల్లో అధిక శాతం మంది పాలిటెక్నిక్‌ కోర్సుల మీద మక్కువ చూపిస్తున్నారు. దీని ప్రభావం ఇంటర్మీడియట్‌ అడ్మిషన్లపై కనిపిస్తోంది. ఈ ఏడాది పాలిటెక్నిక్‌లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. ఉమ్మడి పశ్చిమలో నాలుగు వేల మంది వరకు పాలిసెట్‌లో ఉత్తీర్ణత సాధించారు. ఒక ప్రభుత్వ కళాశాల, ఎనిమిది ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 3,200 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పాలిసెట్‌ ఫలితాలను బట్టి సీట్ల భర్తీ పెరిగే అవకాశం ఉంది. వీరిలో ఎక్కువ మంది ఇంటర్‌లో చేరాలనుకుని పాలిటెక్నిక్‌ వైపు మక్కువ చూపినవారే. పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ముందస్తుగానే రావడం వచ్చే నెల 3న సీట్లు కేటాయించడం, పాలిటెక్నిక్‌లో చేరాలనుకునే విద్యార్థులకు మంచి అవకాశంగా మారింది.

Updated Date - Jun 28 , 2025 | 12:13 AM