Share News

ఆ ఊరికి బస్సు లేదు!

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:21 AM

పాలకోడేరు, ఉండి మండలాలమధ్యలో ఉన్న గ్రామం మైప. తాడేపల్లిగూడెం రహదారి, తణుకు వెళ్లే ప్రధాన రహదారి మధ్య దీవిలా ఉంటుంది.

ఆ ఊరికి బస్సు లేదు!
కోరుకొల్లు నుంచి మైప వెళ్లే మార్గం

పాలకోడేరు మండలం మైప గ్రామస్తుల ఇక్కట్లు

పాలకోడేరు, మార్చి 12(ఆంధ్రజ్యోతి): పాలకోడేరు, ఉండి మండలాలమధ్యలో ఉన్న గ్రామం మైప. తాడేపల్లిగూడెం రహదారి, తణుకు వెళ్లే ప్రధాన రహదారి మధ్య దీవిలా ఉంటుంది. సుమారు 3 వేల మంది జనాభా ఉన్న గ్రామానికి ఆర్టీసీ బస్సు మాత్రమే కాదు కనీసం ఆటోలు ఇతర ప్రైవేటు వాహనాలు కూడా లేవు. గ్రామస్తులు కిలో మీటరు దూరంలోని కోరుకొల్లు నుంచి మైప నడిచివెళ్లాల్సిందే. మరోవైపు యండగండి నుంచి మైప వచ్చేందుకు ప్రధాన రహదారి కూడా ఉన్నా వాహనాలు ఉండవు. కోరుకొల్లు లేదా యండగండి నుంచి మైప వెళ్ళాలన్నా మూడు కిలోమీటర్లు ఏ వాహన సౌకర్యం ఉండదు. సుమారు 25 ఏళ్ల క్రితం భీమవరం నుంచి కోరుకొల్లు మీదుగా మైప వరకు ఉదయం, సాయంత్రం రెండు ట్రిప్పులు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండేది. తర్వాత నిలిపివేసిన బస్సు సౌకర్యం నేటి వరకు లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

బస్సు సౌకర్యం కల్పించాలి

సుమారు 25 ఏళ్ల క్రితం గ్రామానికి ఆర్టీసీ బస్సు ఉదయం, సాయంత్రం నడిపేవారు. కొద్దికాలం తర్వాత నిలిపివేసిన బస్సు ఇప్పటివరకు రాలేదు. బస్సు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాలిన నడక లేదా సైకిల్‌, ద్విచక్ర వాహనం ఉండాల్సిందే. అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలి.

తంగెళ్ళ ఆనంద్‌, మైప

ఆకివీడు బస్టాండ్‌లో మొరాయించిన బస్సు

ఆకివీడు, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): కండిషన్‌ లేని పాత ఆర్టీసీ బస్సులతో ప్రయాణికులు త్రీవర ఇబ్బందులు పడుతున్నారు. భీమవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు భీమవరం నుంచి ఏలూరు బయలు దేరింది. సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆకివీడు కొత్త బస్టాండు వద్ద సాంకేతికలోపంతో బస్సు నిలిచిపోయింది. డ్రైవరు, కండక్టరపై ప్రయాణికులు ఆగ్రహించారు. ప్రయాణికులను ఆర్డినరీ బస్సులలోనే ఎక్కించాల్సి ఉంది. ప్రత్యామ్నాయంగా మొత్తం ప్రయాణికులను ఒక బస్సులో సర్దుబాటు చేయడం సాధ్యం కాలేదు. దీనితో రెండు, మూడు బస్సులు వచ్చే వరకు ప్రయాణికులు వేచి ఉన్నారు. కొందరు మళ్లీ టిక్కెట్‌ తీసుకుని ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌లో వెళ్లిపోయారు. ఆర్టీసీ పాత బస్సులు రోజూ ఎక్కడో ఒకచోట నిలిచిపోతున్నాయని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Mar 13 , 2025 | 12:21 AM