హా..క్వా విశ్వవిద్యాలయం
ABN , Publish Date - May 14 , 2025 | 12:45 AM
గోదావరి జిల్లాలు దేశంలోనే ఆక్వా ఉత్పత్తుల్లో ప్రథమ స్థానంలో నిలిచాయి. ఆక్వా సంబంధిత కోర్సులు అందించడానికి ఆక్వా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చారు.
ప్రభుత్వ భవనం లేదు.. అద్దెకు ఎవరూ ఇవ్వరు!
తుఫాను భవనంలో తరగతులు
ఉండి కేవీకేలో ప్రయోగాలు
ల్యాబ్‌లు లేవు... లైబ్రరీ లేదు..
గాలికొదిలేసిన గత ప్రభుత్వం
విద్యార్థులకు తప్పని తిప్పలు
గోదావరి జిల్లాలు దేశంలోనే ఆక్వా ఉత్పత్తుల్లో ప్రథమ స్థానంలో నిలిచాయి. ఆక్వా సంబంధిత కోర్సులు అందించడానికి ఆక్వా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చారు. తర్వాత ప్రభుత్వం మారడంతో వైసీపీ పాలనలో మొక్కుబడి చర్యలు తీసుకున్నారు. నరసాపురంలో ఆక్వా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినా భవనం, కార్యాలయాలు లేవు. తరగతి గదులు, ప్రయోగశాల, లైబ్రరీ ఏర్పాటు చేయలేదు. ఎన్నికల ముందు ఏడాది హడావుడిగా ప్రవేశాలు నిర్వహించి విద్యార్థులను గాలికొదిలేశారు.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
పేరుకే విశ్వవిద్యాలయం.. కనీసం తరగతులు నిర్వహించే పరిస్థితి లేదు. భవనాలు, కార్యాలయం, తరగతి గదులే కాదు.. ఆక్వా విద్యకు కీలకమైన ప్రయోగశాలల ఆచూకీ కూడా లేదు. పిల్ల పెంపకం నుంచి, చేప, రొయ్యల సాగు, వ్యాధుల నిర్ధారణ, నివారణ వంటి చర్యలకు ప్రయోగాత్మక బోధన చేపట్టాలి. కానీ విద్యార్థులు తరగతి గదులకే పరిమిత మవుతున్నారు. తుఫాను భవనంలో ఉన్న చిన్న చిన్న ల్యాబ్‌లనే వినియోగించుకుంటున్నారు. పది రోజుల పాటు ఉండి కృషి విజ్ఞాన కేంద్రం లో మత్స్య పరిశోధన స్థానాలను సందర్శిస్తు న్నారు. పది రోజుల కోసం విద్యార్థులకు ఉచిత బస్సును ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవానికి ఆక్వా విశ్వవిద్యాలయానికి ప్రత్యేక బస్సును సమ కూర్చాలి. అవసరమైనప్పుడు విద్యార్థులు మత్స్య పరిశోధనా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడే నాణ్యమైన విద్యతో నిపుణులుగా విద్యార్థులు బయటకు వస్తారు. ఇప్పటికే రెండు బ్యాచ్‌లకు నరసాపురం కళాశాలలో ప్రవేశాలు కల్పించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగియడంతో వేసవి సెలవుల తర్వాత మరో బ్యాచ్ రానుంది. ఇప్పటి వరకు మూడు బ్యాచ్‌లకు 40 మంది చొప్పున విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నారు.
హాస్టల్ వసతి లేక ఇబ్బందులు
విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినప్పుడు అనుబంధంగా హాస్టల్ కూడా ఏర్పాటు చేయాలి. కనీసం తాత్కాలిక భవనాల్లోనైనా హాస్టల్స్ ఏర్పాటు చేయాలి. తరగతులకు దిక్కులేనప్పుడు హాస్టల్ ఏర్పాటు అత్యాశగానే కనిపిస్తుంది. విద్యార్థుల హాస్టల్ కోసం ప్రైవేటు భవనాల కోసం నరసాపురంలో ప్రయత్నించినా లభ్యం కాకపోవడంతో ప్రైవేటు పీజీ హాస్టల్స్‌లో పలు వురు ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే ప్రభుత్వం హాస్టల్ వసతి సమకూర్చాలి. గత ప్రభుత్వం ఇవేమీ చూడకుండానే విశ్వ విద్యాలయాన్ని ప్రారంభించేసింది.
నత్తనడకన పనులు
ఆక్వా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నరసా పురం మండలం లిఖితపూడి వద్ద 40 ఎకరాలు కేటాయించారు. భవన నిర్మాణ పనులు ప్రారం భించారు. కొంత భాగం పిల్లర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇతర స్థలమంతా పూడికతోనే సరిపెట్టారు. నిర్మాణాలు నత్తనడకన సాగుతు న్నాయి. పరిపాలనా భవనం, కళాశాల. వైస్ ఛాన్స్‌లర్ బంగ్లా, స్టాఫ్ క్వార్టర్స్, విద్యార్థులకు హాస్టల్స్ నిర్మించాలి. నిధులు కేటాయించకుంటే పనులు పూర్తయ్యే అవకాశం లేదు. శాశ్వత క్యాంపస్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంది.
స్వర్ణాంధ్ర కోసం ప్రయత్నాలు
నూతన విద్యా సంవత్సరం మూడో బ్యాచ్ రానుంది. అనుభవజ్ఞులైన సిబ్బంది ఉన్నా వస తుల లేమి వేధిస్తోంది. స్వర్ణాంధ్ర కళాశాలలో తాత్కాలికంగా తరగతులు నిర్వహించడానికి అవకాశం ఇస్తామని యాజమాన్యం ముందుకొ చ్చింది. ప్రభుత్వ అనుమతి రాకపోవడంతో 2 పర్యాయాలు చేసిన ప్రయత్నాలు వృథా అయ్యా యి. తాజాగా మరోసారి ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ప్రయోగాల కు అవసరమైన ఆక్వా ల్యాబ్‌లను నిర్మించాలి. సాగుకు అనువుగా చెరువులను ఏర్పాటు చేయా లి. గత ప్రభుత్వంలో ఆక్వా పార్క్ ఏర్పాటుకు భూమిని కేటాయించగా పూడికతో సరిపెట్టారు. ఆక్వా విశ్వవిద్యాలయానికి అనుసంధానంగా ఆక్వా పార్క్ ఉంటుందని అప్పట్లో వైసీపీ నేత లు హడావుడి చేశారు. చుట్టు పక్కల సొంత చెరువులు ఉండేలా ప్రణాళికలు చేసుకున్నారు కానీ పార్క్ అందుబాటులోకి రాలేదు. ఇప్పుడైనా ఆక్వా పార్క్ అభివృద్ధి చేస్తే విద్యార్థుల ప్రయోగ శాలగా అది ఉపయోగపడుతుంది.
తుఫాన్ భవనంలో తరగతులు!
నరసాపురం మండలం లక్ష్మీపురం తుఫాను భవనంలో ఆక్వా బీఎస్సీ తరగతులు నిర్వహిస్తున్నారు. అద్దె భవనాల కోసం అధికారులు ప్రయ త్నించినా ప్రయోజనం లేదు. నరసాపురంలో ప్రైవేటు కళాశాలలను సంప్రదించగా ఒక కళాశాల ముందుకొచ్చింది. అక్కడ తరగతులు నిర్వ హణకు ఇంకా అనుమతి రాలేదు. తుఫాను భవనంలోనే తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. అక్కడ విద్యార్థులకు సరైన మౌలిక వసతులు లేవు. నానా ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. గత ప్రభుత్వంలో దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వంలోనైనా విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్న ఆశతో అంతా ఎదురుచూస్తున్నారు.