సన్నద్ధ్దం
ABN , Publish Date - Nov 29 , 2025 | 12:41 AM
ప్రతిభావంతులైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారిని ఉన్నత విద్యవైపు నడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చేయూతనందిస్తోంది.
డిసెంబరు 7న ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష
జిల్లా నుంచి 2,660 మంది విద్యార్థుల దరఖాస్తు
జంగారెడ్డిగూడెం రూరల్, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): ప్రతిభావంతులైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారిని ఉన్నత విద్యవైపు నడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చేయూతనందిస్తోంది. ఎన్‌ఎంఎంఎస్ (నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్) స్కీమ్‌లో భాగంగా పైచదువుల కోసం స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నారు. దీనిలో భాగంగా ఏటా 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అర్హత పరీక్ష నిర్వహిస్తోంది. అర్హత పొందిన వారికి నాలుగేళ్లు అంటే 9, 10వ తరగతితో పాటు, ఇంటర్మీడియేట్ మొదటి, ద్వితీయ సంవత్సరాల్లో ఏటా రూ.12 వేలు చొప్పున రూ.48వేలు స్కాలర్‌షిప్‌గా అందజేస్తారు. జిల్లాలో 2,660 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేశారు. వీరికి డిసెంబరు 7వ తేదీన పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష నిర్వహణకు
జిల్లాలోని ఏలూరు డివిజన్‌లో 6, నూజివీడు డివిజన్‌లో మూడు, జంగారెడ్డిగూడెం డివిజన్‌లో మూడు మొత్తం 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో సుమారు 240 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు దగ్గర పడుతున్న క్రమంలో పాల్గొనే విద్యార్థులకు ఆయా పాఠశాలల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. 150 మార్కులకు ఈ పరీక్ష జరగనుంది. 7వ తరగతి సిలబస్‌కు సంబంధించి 75 మార్కులకు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ కింద మరో 75 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఓఎంఆర్ షీట్‌పై జవాబులు ఇవ్వాలి. ఆ దిశగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు శిక్షణ ఇస్తున్నారు.
అందుబాటులో హాల్‌టిక్కెట్లు : డీఈవో
ఏలూరు అర్బన్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఉపకారవేతన పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్) డిసెంబరు 7న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందని డీఈవో వెంకటలక్ష్మమ్మ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. హాల్‌టిక్కెట్లను మన–వాట్సాప్‌లో అందుబాటులో ఉంచామన్నారు. హాల్ టిక్కెట్లలో ఏవైనా సవరణలుంటే సంబంధిత పాఠశాల హెచ్‌ఎం ధ్రువీకరించిన లేఖతో పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌ను కలిసి సెంటర్ నామినల్ రోల్‌లో తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని కోరారు. పరీక్ష కేంద్రం లొకేషన్‌ను హాల్ టిక్కెట్‌పై ముద్రించిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చన్నారు.