కొత్త పెన్షన్లు ఎప్పుడో ?
ABN , Publish Date - Nov 26 , 2025 | 12:21 AM
పెన్షన్‌ల కోసం అర్హుల జాబితాలో ఉన్న లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. రెండేళ్లుగా కొత్త పెన్షన్ అవకాశం కల్పించకపోవడంతో దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. కలెక్టరేట్, ఆర్డీవో, మండల కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌లలో పెన్షన్‌ల కోసం వినతులు వస్తున్నాయి.
జిల్లాలో 20 వేల దరఖాస్తులు
సచివాలయాల్లోనే పెండింగ్
లింక్ ఇస్తేనే ఆన్‌లైన్ అయ్యేది
కొనసాగుతున్న పాత
పెన్షన్ల వెరిఫికేషన్ ?
పెన్షన్‌ల కోసం అర్హుల జాబితాలో ఉన్న లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. రెండేళ్లుగా కొత్త పెన్షన్ అవకాశం కల్పించకపోవడంతో దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. కలెక్టరేట్, ఆర్డీవో, మండల కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌లలో పెన్షన్‌ల కోసం వినతులు వస్తున్నాయి. కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో అయితే ఇప్పటి వరకు 2,283 మంది పెన్షన్‌ల కోసం వినతులు ఇచ్చినట్టు సమాచారం..
భీమవరం రూరల్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి) :జిల్లాలో సచివాలయాల వారీగా దరఖాస్తులు మొత్తం దాదాపు 20 వేలకు చేరాయి. ఆన్‌లైన్ లింక్ ఓపెన్ కాకపోవడంతో దరఖాస్తులు ఆన్‌లైన్ అవక పక్కన మూలుగుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయం కోసం లబ్ధిదారులు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వృద్ధుల పెన్షన్ రూ. 4 వేలు అందిస్తున్నారు. వృద్ధులకు పెన్షన్ భరోసాగా నిలిచింది. 60 ఏళ్ళు దాటినవారు పెన్షన్ కోసం దరఖాస్తులు ఇస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో కొత్త పెన్షన్‌ల కోసం దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. 2023 నవంబర్ నెల వరకు కొత్త పెన్షన్‌లు ఇచ్చారు. తర్వాత 6900 కొత్త పెన్షన్‌లు ఆన్‌లైన్ దరఖాస్తులుగానే ఉండిపోయాయి. అప్పట్లో జనవరి, జూన్ నెలల్లో కొత్త పెన్షన్‌లు మంజూరు ఆరు నెలలకు ఒకసారి చేస్తూ వచ్చారు.
షిప్టింగ్ పెన్షన్‌లు 2,500
కూటమి ప్రభుత్వం ఏడాది నుంచి షిఫ్టింగ్ పెన్షన్‌లు ఇస్తూ వస్తుంది. భర్త చనిపోయినప్పుడు దానిని భార్యకు పెన్షన్‌గా అందిస్తున్నారు. ఏడాదిలో జిల్లా మొత్తం మీద 2,500 పైగా షిఫ్టింగ్ పెన్షన్‌లుగా అందిస్తున్నారు. దీంతో భర్త చనిపోయిన వారికి పెన్షన్ వెనువెంటనే అందుకుంటున్నారు.
కొత్త ఏడాది వచ్చాకనేనా .?
గత ప్రభుత్వం హయాంలో పెన్షన్‌ల మంజూరులో తేడా జరిగిందనే ఫిర్యాదులతో కూటమి ప్రభుత్వం మంచాన పడిన , దివ్యాంగ పెన్షన్‌దారులకు సంబంధించి వెరిఫికేషన్ మొదలుపెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి వైద్యులచే వారికి వెరిఫికేషన్ జరుగుతోంది. బెడ్ మీద ఉన్న 1,510 పెన్షన్‌దారుల వెరిఫికేషన్ చేసి వారిలో 72 అనర్హులుగా గుర్తించారు. మిగిలినవారిలో వారి పొజిషన్ బట్టి పెన్షన్ ఇచ్చేలా నిర్ణయించారు. దివ్యాంగులు 27,611 మందికిగాను 16 వేల మంది వెరిఫికేషన్ అయ్యింది. వెరిఫికేషన్ జరిగిన వారిలో 870 మంది 40 శాతం లోపు వైకల్యం వున్నవారిని గుర్తించి నోటీసులు ఇచ్చారు. వారు రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దానిని నిరూపించుకోవలసి ఉంది. మిగిలిన దివ్యాంగుల వెరిఫికేషన్ ఇంకా జరుగుతుంది. ఇదంతా పూర్తయ్యాకే కొత్త పెన్షన్‌ల వైపు ప్రభుత్వం చూస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం జనవరి, జూన్ నెలలో కొత్త పెన్షన్‌లు ఇచ్చేది. ఆ రూపేణా వచ్చే జనవరి నుంచి కొత్త పెన్షన్‌లు ఇస్తారనే ఆలోచనలో లబ్ధిదారులు ఉన్నారు. వచ్చే నెలలోనైనా కొత్త పెన్షన్‌ల ఆన్‌లైన్ దరఖాస్తులు లింక్ ఓపెన్ అయితే కొత్త సంవత్సరం మొదటి నెలలో కొత్త పెన్షన్‌లు అందుకుంటారు.
వితంతు పెన్షన్ కోసం తిరుగుతున్నా
నా వయసు 60 ఏళ్ళు దాటింది. భర్త పోయి మూడేళ్లు దాటింది. వితంతు కొత్త పెన్షన్ కోసం తాడేపల్లిగూడెంలోని సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నాను. మంజూరు కాలేదు. కలెక్టర్ కార్యాలయంలో జరిగే పీజీఆర్‌ఎస్‌లో విన్నవించుకుందామని వచ్చాను.
– జి.లక్ష్మి, తాడేపల్లిగూడెం
నడవలేని పరిస్థితిలో ఉన్నా
దివ్యాంగ పెన్షన్ కోసం లిఖితపూడి సచివాలయంలో రెండేళ్ల క్రితం దరఖాస్తు ఇచ్చాను. అప్పట్లో సదరం సర్టిఫికెట్ పొందాను. ఇంకా పెన్షన్ మంజూరు కాలేదు. కలెక్టర్ కార్యాలయంలో జరిగే పీజీఆర్‌ఎస్‌లో విన్నవించేందుకు వచ్చాను. నడవలేని పరిస్థితుల్లో ఉన్నాను.
– పి.పండు, లిఖతపూడి, నరసాపురం మండలం