కొత్తగా.. మరింత చేరువగా..
ABN , Publish Date - May 14 , 2025 | 01:00 AM
ప్రభుత్వ పాఠశాలలను పునర్వ్యవస్థీకరిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు మంగళవారం విడుదల చేసిన జీవోలతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తొమ్మిది రకాల బడులు వచ్చే విద్యా సంవత్స రం నుంచి ప్రారంభం కానున్నాయి.
ఉమ్మడి పశ్చిమ జిల్లాలో 9 రకాల బడులకు తుదిరూపు !
ఇప్పుడున్న 2,921 ప్రభుత్వ పాఠశాలలన్నీ యథాతథం
రెండు రోజుల్లోగా టీచర్ల సర్దుబాటు : డీఈవో
ఏలూరు అర్బన్, మే 13(ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ పాఠశాలలను పునర్వ్యవస్థీకరిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు మంగళవారం విడుదల చేసిన జీవోలతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తొమ్మిది రకాల బడులు వచ్చే విద్యా సంవత్స రం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పుడున్న 2,921 పాఠశాలల్లో ఏ ఒక్కటీ మూసేయకుండానే అన్నింటినీ కొనసాగిస్తూ కొత్త బడులను ప్రారంభిస్తుండడం విశేషం. విద్యాహక్కు చట్టం నిబంధనలకు లోబడి నూతన పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు గత కొన్ని నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సదస్సులు, విస్తృత చర్చలు, సమావేశాలు, కూడికలు, తీసివేతల కసరత్తు తర్వాతే నూతన పాఠ శాలలపై నిర్ణయానికి వచ్చారు. దీని కనుగుణంగానే పాఠశాలల్లో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను ప్రామా ణికంగా తీసుకుని కొత్త బడులకు ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ కేడర్ ఉపాధ్యాయులను హేతుబద్దీకరణ విధానం ద్వారా సర్దుబాటుచేసే ప్రక్రియను దాదాపు ఓ కొలిక్కి తెచ్చేందుకు జిల్లా విద్యాశాఖ ముమ్మర కసరత్తుచేస్తోంది. కొత్త బడుల ఉత్తర్వులపై డీఈవో వెంకటలక్ష్మమ్మ మంగళవారం రాత్రి వివరణ ఇస్తూ ‘ నూతన బడులకు ఉపాధ్యాయుల సర్దుబాటు మరో రెండురోజుల్లో పూర్తవుతుంది. మొత్తంమీద టీచర్ల బదిలీల షెడ్యూలు విడుదలయ్యే నాటికి పాఠశాలల వారీగా సర్దుబాటు పూర్తిచేస్తాం.’ అని వివరించారు.
తొమ్మిది రకాల బడుల స్వరూపమిలా..
శాటిలైట్ ఫౌండేషనల్ స్కూలు.. పూర్వ ప్రాథమిక విద్య పీపీ–1, పీపీ–2 (ఎల్‌కేజీ, యూకేజీ) బోధి స్తారు. ప్రస్తుతమున్న ప్రాథమిక పాఠశాలకు ఒక కిలోమీటరు దూరంలోపు ఇవి ఏర్పాటవుతాయి. అంగన్‌వాడీ వర్కర్లు బోధిస్తారు. ఉమ్మడి జిల్లాలో పూర్వ ప్రాథమికవిద్య పాఠశాలల సంఖ్యను మహి ళాభివృద్ధి, శిశు సంక్షేమ సంస్థ నిర్ధారించాల్సిఉంది.
ఫౌండేషనల్ స్కూలు.. పీపీ–1, పీపీ–2తోపాటు ఒకటో తరగతి, రెండో తరగతి బోధిస్తారు. ఉపాధ్యా య, విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ 1:30 నిష్పత్తికి ఒక ఎస్జీటీ.. 31:60 నిష్పత్తికి ఇద్దరు ఎస్జీటీలు ఉంటారు. పూర్వ ప్రాథమికవిద్య తరగతులకు అంగన్‌వాడీ వర్కర్లే బోధిస్తారు. ఉమ్మడి జిల్లాలో ఇవి గడచిన విద్యాసంవత్సరం (2024–25)లో 164ఉండగా, వచ్చే జూన్‌నుంచి ప్రారంభమయ్యే 2025–26 విద్యాసంవత్సరంలో మరింత వికేంద్రీకరించి 315 ప్రారంభించాలని నిర్ణయించారు.
బేసిక్ ప్రైమరీ స్కూలు.. పీపీ–1, పీపీ–2లతోపాటే, ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధిస్తారు. విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ ఆధారంగా ఎస్జీటీ కేడర్ ఉపాధ్యాయపోస్టులను నిర్ణయించారు. గత విద్యాసంవత్సరం వరకు ఫౌండేషనల్ ప్లస్ స్కూళ్లుగా పిలిచిన ఈ స్కూళ్లను ఇపుడు బేసిక్ ప్రైమరీ పాఠశాలలుగా నామకరణం చేశారు. దీనికనుగుణంగానే గతంలోవున్న 2,147 ఫౌండేష నల్ ప్లస్ పాఠశాలల సంఖ్యను స్థానిక అవసరా లకు అనుగుణంగా కుదించి ఉమ్మడి జిల్లాలో 1508 బేసిక్ పాఠశాలను ఏర్పాటుచేయనున్నారు.
మోడల్ ప్రైమరీ స్కూలు.. గత ప్రభుత్వంలో ప్రైమరీ స్కూళ్లనుంచి బలవంతంగా 3, 4, 5 తరగతులను సమీప 186 హైస్కూళ్లకు తరలించి ఏర్పాటు చేసిన ప్రీహైస్కూళ్ల నుంచి నిర్వహించగా, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు హైస్కూళ్లకు తరలించిన ప్రాథమిక తరగతులను మళ్లీ పూర్వపు ప్రాథమిక పాఠశాలలకే వెనక్కిరప్పించి, వాటికి కొన్నింటిని అదనంగాచేర్చి అన్ని వసతులతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న పాఠశాలలే మోడల్ ప్రైమరీ స్కూళ్లు. ఉమ్మడి జిల్లాలో ఈ పాఠశాలలు 528 ఏర్పాటవుతున్నాయి. వీటికి హెచ్‌ఎంలుగా స్కూల్ అసిస్టెంట్ కేడర్ ఉపాధ్యాయులను, ప్రతీ ప్రాథమిక తరగతికి ఒక ఎస్జీటీని నియమిస్తారు.
అప్పర్‌ప్రైమరీ స్కూలు.. పీపీ–1, పీపీ–2లతోపాటు ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధిస్తారు. బీపీఎస్/ఎంపీఎస్ మార్గదర్శకాల మేరకు టీచర్ల నియామకం ఉంటుంది. గతంలో 3 నుంచి 10వ తరగతి వరకు, 3 నుంచి 12వ తరగతి వరకు బోధించడానికి ప్రారంభించిన 159 రెండు రకాల హైస్కూళ్లను సంస్కరించి, వాటిస్థానే 84 ప్రాథమికోన్నత పాఠశా లలను ప్రారంబించనున్నారు. వీటిలో ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్ కేడర్ టీచర్లు బోదిస్తారు.
హైస్కూలు.. గతంలో వున్న 255 ఉన్నత పాఠశాలలను సంస్కరించి, తాజాగా 6 నుంచి 10వ తరగతి వరకు, 6నుంచి 12వ తరగతి వరకు స్కూల్ అసిస్టెంట్ కేడర్ ఉపాధ్యాయులతో బోధిచేందుకు ఉమ్మడి జిల్లాలో 391 రెండు రకాల హైస్కూళ్లను ప్రారంభిస్తున్నారు.
హైస్కూలు ప్లస్.. బీపీఎస్ స్కూల్.. (బేసిక్ ప్రైమరీ స్కూలు) కలిపి ఒకే ప్రాంగణంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు/ ఒకటో తరగతినుంచి 12వ తరగతి (ఇంటర్‌విద్య)వరకు బోధించేందుకు ఉమ్మడి జిల్లాలో మొత్తం 41 పాఠశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గతంలో వున్న 10హైస్కూళ్ల(1–10తరగతులు)స్థానే నూతన విధానంలో 41 పాఠశాలలను ప్రారంభిస్తున్నారు.
మోడల్ ప్రైమరీ స్కూలు, హైస్కూలు ప్లస్.. ఒకే ప్రాంగణంలో ఒకటనుంచి పదో తరగతి వరకు లేదా ఒకటి నుంచి 12వ తరగతి వరకు బోధించేలా రెండు ప్యాట్రన్లలో ఉమ్మడి జిల్లాలో 54 పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు.