Share News

శ్రావణమాసం గృహప్రవేశం

ABN , Publish Date - Jul 17 , 2025 | 12:20 AM

వైసీపీ హయాంలో ఇల్లు నిర్మించుకోలేని వారికి మూడో ఆప్షన్‌ కింద తామే నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చి చివరకు చేతులెత్తేసింది. కూటమి ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి జిల్లాలో తొలి విడతలో 6,525 ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు కాంట్రాక్టర్లను నియమించింది.

శ్రావణమాసం గృహప్రవేశం

మూడో ఆప్షన్‌ ఇళ్లు పేదలకు అప్పగింత

కూటమి ప్రభుత్వం రాకతో కదలిక

జిల్లాలో 6,525 ఇళ్లకు 1,198 నిర్మించిన కాంట్రాక్టర్లు

నిర్మించని వారికి నోటీసులు

అత్తిలి ప్రాంతంలో లబ్ధిదారుల నుంచి లక్ష చొప్పున కాంట్రాక్టర్‌ సొమ్ముల వసూళ్లు

ఇళ్లు నిర్మించకుండా పరార్‌.. అధికారుల ఫిర్యాదు పోలీసుల కేసు నమోదు

వైసీపీ హయాంలో ఇల్లు నిర్మించుకోలేని వారికి మూడో ఆప్షన్‌ కింద తామే నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చి చివరకు చేతులెత్తేసింది. కూటమి ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి జిల్లాలో తొలి విడతలో 6,525 ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు కాంట్రాక్టర్లను నియమించింది. వారు ఇప్పటి వరకు 1198 నిర్మాణం పూర్తి చేశారు. వీటిని శ్రావణమాసంలో లబ్ధిదారులకు అప్పగించి గృహ ప్రవేశం చేయించేలా ప్రభుత్వం కృత నిశ్చయంతో వుంది. ఇక మిగిలిన ఇళ్లు త్వరలోనే పూర్తి చేయించేలా కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకొస్తోంది.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

పేదల ఇళ్ల అప్పగింతకు ముహూర్తం కుదిరింది. శ్రావణ మాసంలో వారికి అప్పగించి గృహ ప్రవేశం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభు త్వ హయాంలో నిర్మించకుండా వదిలేసిన మూడో ఆప్షన్‌లో నిర్మించిన ఇళ్లను పంపిణీ చేయనున్నారు. జిల్లాలో మూడో కేటగిరీలో 1,198 మంది ఇళ్లను నిర్మించారు. వాస్తవానికి ప్రధానమంత్రి ఆవాస యోజనలో గత ప్రభుత్వం జిల్లాలో 72 వేల ఇళ్లు కేటాయించింది. కేవలం రూ.1.80 లక్షలు మాత్రమే రాయితీ ఇచ్చింది. అంత మొత్తంలో ఇళ్లు నిర్మించుకో లేమంటూ లబ్ధిదారులు చేతులెత్తేశారు. ప్రభుత్వమే 6,525 ఇళ్లు నిర్మించేలా చర్యలు తీసుకుని కాంట్రా క్టర్లకు బాధ్యతలు అప్పగించింది. వైసీపీ హయాంలో కాంట్రాక్టర్లు నిర్మాణం చేపట్టలేదు. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్‌లతో సంప్రదించడంతో ఇప్పటికి 1,198 ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. మిగిలినవి నిర్మాణంలో ఉన్నాయి. అయితే కొందరు కాంట్రాక్టర్‌లు తమకు గిట్టుబాటు కాదని చేతులెత్తేశారు. వారితో గృహ నిర్మాణశాఖ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.

కొత్త దరఖాస్తుదారులకు రాయితీ పెంపు

కూటమి ప్రభుత్వం సొంత స్థలం వున్న లబ్ధి దారులకు రాయితీ పెంచింది. పట్టణాలు, పల్లెల్లో రూ.2.50 లక్షల వంతున రాయితీ ఇవ్వాలని నిర్ణయిం చింది. అందులో కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు మంజూరుచేస్తుంది. మరో లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. సొంత స్థలం ఉన్న వారు జిల్లాలో 7,560 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారంతా ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తు న్నారు. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. సొంత స్థలం లో ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి రుణాలు అందించే కసరత్తు జరుగుతోంది. గత టీడీపీ హయాంలో పట్టణాల్లో ఇళ్లు నిర్మించు కుంటే రూ.4 లక్షలు కేటాయించేవారు. అందులో ప్రభుత్వం రూ.2.50 లక్షల రాయితీ, బ్యాంకుల నుంచి రూ.1.50 లక్షల వంతున రుణం మంజూరుచేసేవి. సొంత స్థలం ఉన్న లబ్ధిదారులకు ఇది ఎంతగానో ప్రయోజనం చేకూర్చింది. ప్రస్తుతం రూ.2.50 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. బ్యాంకుల నుంచి గతంలో మాదిరి రుణ సౌకర్యం కల్పిస్తే దర ఖాస్తుదారులకు మరింత ప్రయోజనం కలుగుతుంది. ఆ దిశగా ప్రభుత్వ స్థాయిలో కసరత్తు జరుగుతు న్నట్టు అధికారులు చెబుతున్నారు. రాయితీ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం ప్రకటన చేసింది. బ్యాంకు రుణాలు విషయంలోనే తర్జనభర్జన పడుతు న్నారు. ప్రభుత్వ ఆదేశాల కోసం దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు.

లబ్ధిదారులను ముంచేసిన కాంట్రాక్టర్‌

జిల్లాలో ఓ కాంట్రాక్టర్‌ లబ్ధిదారులను ముంచేశాడు. అత్తిలి ప్రాంతంలో ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి లబ్ధిదారుల నుంచి ఏకంగా లక్ష రూపాయల వంతున వసూలు చేశాడు. ప్రభుత్వం ఇచ్చిన రూ.1.80 లక్షలు తీసుకుని ఇళ్లను నిర్మించాలి. లబ్ధిదారుల నుంచి సొమ్ములు పోగేసుకుని ముఖం చాటేశాడు. అతనిపై అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇతర కాంట్రాక్టర్‌లకు నోటీసులు జారీ చేస్తున్నారు. భీమవరంలోనే మూడో కేటగిరీలో అంటే ప్రభుత్వమే కాంట్రాక్టర్‌ ద్వారా నిర్మాణం చేపట్టిన ఇళ్లు ముందడుగులో ఉన్నాయి. కాంట్రాక్టర్‌ నిర్మాణం చేపడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో పునాది దశలో కాంట్రాక్టర్‌లు విడిచిపెట్టేశారు.

Updated Date - Jul 17 , 2025 | 12:20 AM