Share News

కుదుటపడని కొత్త జిల్లా

ABN , Publish Date - Dec 08 , 2025 | 12:35 AM

జిల్లాల పునర్విభజనలో భాగంగా భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడి దాదాపు నాలుగేళ్లు పూర్తి అవుతున్నది.. అయినా ఇంకా కష్టాల కడలిలో కొట్టు మిట్టాడుతోంది..

కుదుటపడని కొత్త జిల్లా
భీమవరం

ప్రైవేటు భవనంలో కలెక్టరేట్‌ నిర్వహణ

రవాణా సౌకర్యం లేని ప్రాంతంలో ఏర్పాటు

రికార్డులు భద్రపరచుకోవడం కష్టమే

ఇరుకుగదుల్లో సర్దుకుపోతున్న ఉద్యోగులు

సరైన వసతులు లేక అవస్థలు

రెవెన్యూ డివిజన్‌, ఎస్పీ కార్యాలయాలదీ అదే పరిస్థితి

జిల్లాల పునర్విభజనలో భాగంగా భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడి దాదాపు నాలుగేళ్లు పూర్తి అవుతున్నది.. అయినా ఇంకా కష్టాల కడలిలో కొట్టు మిట్టాడుతోంది.. ప్రధానమైన కార్యాలయాలు కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి.. అద్దె భవనాల్లో అరకొర వసతులతో నెట్టుకొస్తున్నాయి.. కొత్త జిల్లా కదా..

అని ఇంకా సర్దుకుపోతున్నారు..

భీమవరం పట్టణానికి జిల్లా కేంద్రంగా చేశారు. జిల్లాలోని అన్ని నియోజక వర్గాలకు పట్టణం అందుబాటులో ఉంది. భీమ వరం అనగానే ఎందరో అధికారులు ఇక్కడ పని చేసేందుకు ఆసక్తి చూపారు. ప్రభుత్వం బదిలీపై ఇక్కడకు పంపితే ఆగమేఘాలపై వచ్చి చేరి పోతున్నారు. తీరా ఇక్కడకు వచ్చాక సమస్యలు తెలిసి వస్తున్నాయి. తాత్కాలిక భవనంలో కలెక్టరేట్‌ కార్యాలయం ఉంది. ఊరికి మూడు కిలో మీటర్ల దూరంలో రవాణా సౌకర్యం లేని ప్రాంతంలో కలెక్టరేట్‌ ఏర్పాటు చేశారు. అందులో అనేక ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. ఏ ఒక్క కార్యాలయానికి సరైన సౌకర్యం లేదు. ఇరుకు గదులు. సిబ్బంది కూర్చుంటే పక్కకు తిరిగే పరిస్థితి లేదు. కుర్చీ కదపడానికి కూడా అనువుగా ఉండవు. రికార్డులు భద్ర పరిచే గదులు కూడా లేవు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కామన్‌ మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్‌ కళాశాల కావడంతో కామన్‌ మరుగుదొడ్లే ఉన్నాయి. వాటిని కూడా తాత్కాలిక కలెక్టరేట్‌ ఏర్పాటు చేసిన తర్వాత మరమ్మతులు చేశారు.

రికార్డులకు దిక్కులేదు

సర్వే శాఖకు ఇప్పుడు నిత్యం పని ఉంటోంది. చిన్న గదిలో దాదాపు 30 వరకు కంప్యూ టర్‌లు న్నాయి. అంతమంది సిబ్బంది పని చేస్తున్నారు, వేసవిలో అయితే కంప్యూటర్‌లు వేడెక్కి పోతుంటాయి. రికార్డులు భద్రపరిచే గదికూడా లేదు. టేబుల్‌పైన భద్రపరచి కప్పి ఉంచారు. అంతకు మించి ఆ శాఖకు దారిలేదు. కలెక్టరేట్‌కు సరిపడిన భవనం అదొక్కటే. సంబంధిత కార్యాల యాలకు వచ్చే ప్రజలు కూర్చోవడానికి కూడా సరైన వసతులు లేవు. తాత్కాలిక కలెక్టరేట్‌ అంటూ అధికారులు, సిబ్బంది సర్దుకుపోతున్నారు. పంచాయతీరాజ్‌, సర్వే, ఎన్నికల శాఖ, ప్లానింగ్‌, బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖలు, ట్రెజరీ, పౌర సరఫరాలు, అగ్నిమాపకశాఖ, అటవీ శాఖ, ముఖ్యంగా విద్యాశాఖ తదితర ముఖ్య కార్యాల యాలు కలెక్టరేట్‌లో కొలువు తీరాయి. ఏలూరు కలెక్టరేట్‌ నుంచి తెచ్చుకున్న పాత కుర్చీలనే వేసుకుంటున్న శాఖలు కూడా ఇప్పటికీ ఉన్నాయి. అధికారులు, సిబ్బంది వాహనాలను పార్కింగ్‌ చేసుకునే షెడ్డులు కూడా లేవు. రికార్డు పుస్తకా లను ఆరుబయటే దించేస్తున్నారు. అక్కడ నుంచి సంబంధిత కార్యాలయాలకు తరలి స్తున్నారు. ప్రభుత్వ పరంగా బడె ్జట్‌ అంతంత మాత్రంగానే ఉంటోంది. జిల్లా కేంద్రమైన తర్వాత భీమవరం రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేశారు. దానికి కూడా సొంత కార్యాలయం లేదు. మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. ఎస్పీ కార్యాల యానిదీ అదే దుస్థితి. ప్రైవేటు విద్యా సంస్థలోనే ఏర్పాటు చేశారు. ఇటు కలెక్టరేట్‌, అటు ఎస్పీ కార్యాలయాలు పట్టణానికి దూరంగానే ఉంటు న్నాయి. రవాణా సౌకర్యం లేని ప్రదేశంలో వీటిని ఏర్పాటు చేశారు.

కలెక్టరేట్‌పై చర్చ

భీమవరంలో కొత్త కలెక్టరేట్‌ ఎక్కడనేదానిపై ఇటీవల భీమవరంలో పెద్ద చర్చే జరిగింది. కలెక్టరేట్‌ నిర్మాణానికి అవకాశం ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్‌ నాగరాణి కొన్నినెలల క్రితం తణుకు లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. దీనిని దాతల సహకారంతో పెద అమిరం లోని స్థలంలో నిర్మిస్తారన్న ప్రచారం జరిగింది. వైసీపీ హయాంలో కలెక్టరేట్‌ కోసం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ స్థలాన్ని కేటాయించారు. అక్కడ 20 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. మార్కెట్‌ కమిటీ కూడా రైతులకు పెద్దగా ప్రయోజనం చేకూర్చడం లేదు. గోదాములన్నీ వృథాగా పడి ఉన్నాయి. షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించినా సరే అక్కడకు ఏ ఒక్క వ్యాపారి రావడం లేదు. మత్స్యశాఖ, ఎంపెడా కార్యాలయాలను అందులోనే నిర్మించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వం ఏఎంసీ స్థలాన్ని కలెక్టరేట్‌కు కేటాయిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. నిర్మాణానికి నిధులు కూడా కేటాయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కలెక్టరేట్‌ విషయంపై మళ్లీ కొత్త చర్చలు ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు మాత్రం జిల్లా కలెక్టరేట్‌ను ఏఎంసీలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏదైనా భీమవరం బ్రాండ్‌కు తగ్గట్టుగానే కలెక్టరేట్‌ ఉండాలంటూ జనం కోరుకుంటున్నారు. దానికి సువిశాల స్థలం అవసరం కానుంది. ప్రభుత్వం దీనిపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలి. లేదంటే అధికారులకు, సిబ్బందికి, ప్రజలకు ఇబ్బందులు తప్పవు.

Updated Date - Dec 08 , 2025 | 12:36 AM