పోలీస్ శాఖకు కొత్త బైక్‌లు
ABN , Publish Date - Jun 26 , 2025 | 12:53 AM
జిల్లా పోలీస్ యంత్రాంగానికి ప్రభుత్వం కొత్తగా 17 బుల్లెట్ వాహనాలు అందించింది.
జిల్లాలో ముమ్మర గస్తీకి చర్యలు
ఏలూరు క్రైం, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీస్ యంత్రాంగానికి ప్రభుత్వం కొత్తగా 17 బుల్లెట్ వాహనాలు అందించింది. అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన, డ్రోన్ల సహాయంతో రహదారి ప్రమాదాల నివా రణ, ట్రాఫిక్ నియంత్రణకు ద్విచక్ర వాహనాలు రావడం ముందడుగని ఎస్పీ కేపీఎస్ కిశోర్ అన్నారు. కొత్త ద్విచక్ర వాహనాలను ఎస్పీ కిశోర్ జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద బుధవారం ప్రారంభించారు. స్వయంగా ఆయన బుల్లెట్ వాహనాన్ని నడిపారు. ఆయన మాట్లాడుతూ జిల్లాకు ప్రత్యేకంగా హైటెక్ బైక్‌లను కేటాయించారని, 112 డయల్‌కు వచ్చే ఫిర్యాదులపై తక్షణం పోలీసులు హాజరవడానికి ఈ వాహనాలు ఉపయోగపడతాయ న్నారు. డ్రోన్ల పర్యవేక్షణ ద్వారా ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు నివారించడం, అసాంఘిక కార్యకలాపాల నివారణకు డ్రోన్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. రాత్రివేళ గస్తీ పోలీసులు చిన్న వీధులలో కూడా సులభంగా వెళ్లడానికి ఈ బైక్‌లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ వాహనాలకు కెమెరాలు, టెక్నాలజీ సపోర్టు ఉండడం ద్వారా ఆధారాలు సేకరించడానికి వీలవుతుందన్నారు. ప్రమాద స్థితిలో బాధితులకు రక్షణ కల్పించేందుకు సత్వర చర్యలు కల్పించేందుకు వీలుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు, డీటీసీ డీఎస్పీ ప్రసాద్, ఎఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ట్రాఫిక్ ఎస్‌ఐ లక్ష్మణరావు, ఎఆర్‌ఆర్‌ఐ పవన్‌కుమార్, డీసీఆర్బీ అబీబ్ బాషా, సీఐ కోటేశ్వరరావు, పలువురు పాల్గొన్నారు.