Share News

కొత్త బార్‌లకు వేళాయె

ABN , Publish Date - Aug 12 , 2025 | 12:38 AM

జిల్లాలోని ప్రస్తుతం నడుస్తున్న బార్‌ల లైసెన్స్‌లు ఆగస్టు నెలాఖరుకు ముగియనున్నాయి. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కొత్తబార్‌లు రానున్నాయి.

కొత్త బార్‌లకు వేళాయె

ఈనెలాఖరుతో ముగియనున్న

పాత బార్‌ల గడువు

జిల్లాలో 26 బార్‌లకు త్వరలో నోటిఫికేషన్‌

లాటరీ ద్వారా కేటాయింపు.. మార్గదర్శకాలపై ప్రభుత్వం కసరత్తు

ప్రైవేటు మద్యం షాపులతో బార్‌లపై తగ్గిన మోజు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని ప్రస్తుతం నడుస్తున్న బార్‌ల లైసెన్స్‌లు ఆగస్టు నెలాఖరుకు ముగియనున్నాయి. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కొత్తబార్‌లు రానున్నాయి. ఈ మేరకు 26 బార్‌లకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో బార్‌ల ఆదాయం మూ డు పువ్వులు ఆరు కాయలుగా వికసించింది. ప్రభుత్వ మద్యం షాపుల్లో నాసి రకం మద్యం అమ్మడంతో మద్య పాన ప్రియులు బార్‌లపై ఆసక్తి చూపేవారు. ఫలితంగా వాటి అమ్మకాలు తగ్గి.. ప్రతి బార్‌లోనూ రోజు వారీ విక్రయాలు సగటున రూ.3 లక్షల వరకు జరిగేవి. కూటమి ప్రభుత్వం రాకతో ప్రభుత్వ మద్యం షాపుల స్థానంలో ప్రైవేటు దుకా ణాలను ఏర్పాటు చేసి లైసెన్స్‌దారులకు అమ్మకాల బాధ్యతను అప్పగిం చారు. నాణ్యమైన బ్రాండ్‌లను వినియోగంలోకి తెచ్చింది. దీంతో బార్‌లు పడకేశాయి. జిల్లాలో రోజు వారీ విక్రయాలు సగటున లక్ష రూపాయలకు పడి పోయింది. చాలా వరకు నష్టాల్లో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించే కొత్త మార్గదర్శకాల కోసం బార్‌ యజమానులు చూస్తున్నారు.

లాటరీ ద్వారా ఎంపిక

గతంలో వేలం పాటల ద్వారా బార్‌లను కేటాయించేవారు. దీంతో యజమానులు సిండికేట్‌ అయి లైసెన్స్‌లు దక్కించుకునే వారు. ఈసారి ప్రభుత్వం లాటరీ పద్ధతిలో లైసెన్స్‌లు మంజూరు చేయాలని భావిస్తోంది. మూడేళ్ల కాలానికి లైసెన్స్‌లు మంజూరుచేస్తారు. బార్‌లలో ధరలు అధికంగా ఉంటాయి. అధికంగా విక్రయించుకునే వెసులుబాటు ఉంటుంది. మరోవైపు ఎంఆర్పీ ధరలకే బార్‌లకు మద్యం సరఫరా చేస్తారు. ప్రైవేటు మద్యం దుకాణాలకు ఎంఆర్‌పి ధరలోనే కమీషన్‌ తగ్గించి కేటాయిస్తారు. అందుకే ఎంఆర్‌పి ధరలకే షాపుల్లో విక్రయించాలంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే 20 శాతం కమీషన్‌ ఇవ్వడంలేదంటూ లైసెన్స్‌దారులు ఘొల్లుమంటున్నారు. ఒకటి రెండు బ్రాండ్‌లపై రూ.10 అధికంగా విక్రయించాలని ప్రయత్నాలు చేసినా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ కేసులు నమోదు చేస్తోంది. జిల్లాలో ఇప్పటికే నాలుగు కేసులు నమోదు చేశారు. లైసెన్స్‌దారుల నుంచి రూ.20 లక్షలు జరిమానా వసూలు చేశారు. దీంతో ప్రైవేటు మద్యం షాపుల్లో ఎమ్మార్పీ ధరకే అమ్మకాలు సాగిస్తున్నారు. అదే బార్‌లలో ఎంఆర్‌పి కంటే క్వార్టర్‌ బాటిల్‌పై రూ.40 అధికంగా విక్రయించుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రైవేటు మద్యం షాపులతో పోటీ పడేందుకు బార్‌లలోనూ ధరలు తగ్గించారు. మరోవైపు అమ్మకాలు తగ్గాయి. దాంతో ఈసారి లైసెన్స్‌లపై పోటీ పడేందుకు మీమాంసలో పడ్డారు.

షాపులకు పర్మిట్‌ రూమ్‌లు

ప్రైవేటు మద్యం షాపుల్లోనూ పర్మిట్‌ రూమ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. ఇది కూడా బార్‌లపై ప్రభావం చూపనుంది. వీటన్నింటినీ బేరీజు వేసుకుని బార్‌ల కోసం రంగంలోకి దిగాలన్న తలంపుతో ప్రస్తుత లైసెన్స్‌దారులున్నారు. సెప్టెంబర్‌ మొదటి వారం నుంచి కొత్తబార్‌లు అందుబాటులోకి వస్తాయి. అప్పటిలోగా బార్‌లకు లైసెన్స్‌లు మంజూరు కానట్టయితే ఉన్నవాటి గడువును పెంచే అవకాశం ఉంటుంది.

Updated Date - Aug 12 , 2025 | 12:38 AM