Share News

పశ్చిమలో కొత్త ఆక్వా జోన్‌

ABN , Publish Date - Oct 05 , 2025 | 12:52 AM

జిల్లాలో ఆక్వా రైతులకు భారీ ఊరట లభించనుంది. ఆక్వా జోన్‌ పరిధిలోకి వేలాది ఎకరాలు చేరేలా మత్స్యశాఖ చర్యలు తీసుకుంది. జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి నేతృత్వంలో కమిటీ కొత్త ఆక్వా జోన్‌కు ఆమోదముద్ర వేసింది.

పశ్చిమలో కొత్త ఆక్వా జోన్‌

జోన్‌ పరిధిలోకి అదనంగా 27,700 ఎకరాలు

మరో 6,200 ఎకరాల్లో కొత్త చెరువుల

తవ్వకానికి అనుకూలం

ప్రభుత్వ ఆమోదమే తరువాయి

రిజిస్ర్టేషన్‌కు అధికారులు కసరత్తు

జాయింట్‌ ఎల్‌పీ నంబర్లే అసలు సమస్య

జిల్లాలో ఆక్వా రైతులకు భారీ ఊరట లభించనుంది. ఆక్వా జోన్‌ పరిధిలోకి వేలాది ఎకరాలు చేరేలా మత్స్యశాఖ చర్యలు తీసుకుంది. జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి నేతృత్వంలో కమిటీ కొత్త ఆక్వా జోన్‌కు ఆమోదముద్ర వేసింది. దాదాపు అన్ని చెరువులు జోన్‌ పరిధిలోకి వచ్చేస్తున్నాయి. జిల్లాలో దాదాపు 1.42 లక్షల ఎకరాల్లో చెరువులు విస్తరించి ఉన్నాయి. అందులో 1.15 లక్షల ఎకరాలు మాత్రమే జోన్‌ పరిధిలోకి వచ్చాయి.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

గతంలోనూ కూటమి ప్రభుత్వమే జోన్‌ విధానాన్ని అమలు చేసింది. దాని పరిధిలోనే చెరువులు తవ్వు కోవాలని దిశానిర్దేశం చేసింది. ఇష్టా రాజ్యంగా చెరువుల తవ్వకానికి చెక్‌ పెట్టింది. ప్రభుత్వం ఇచ్చే విద్యుత్‌ రాయితీ కూడా వాటికే వర్తింప చేసింది. వైసీపీ హయాంలోనూ పాత జోన్‌ విధానాన్నే అమలు చేశారు. దాంతో ఆక్వాజోన్‌ వెలుపుల ఉన్న రైతులకు నష్టం వాటిల్లింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్వా రంగంపై దృష్టి సారించింది. ఉత్పత్తులు పెంచాలంటూ జిల్లాల వారిగా లక్ష్యాలను ఇస్తోంది. ఆక్వా రైతులకు అవసరమైన వసతులను కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విద్యుత్‌ రాయితీని విస్తరించేందుకు ఆక్వాజన్‌ పరిధిలోకి చెరువులన్నింటనీ తెచ్చేలా ఆదేశాలు జారీచేసింది. ఆ మేరకు గడచిన మూడు నెలలుగా జిల్లాలో కసరత్తు చేస్తున్నారు. గ్రామాలు, మండలాల వారీగా ఆక్వా సభలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలోనూ సమీక్ష నిర్వహించారు. . ఆక్వాజోన్‌, చెరువుల రిజిస్ర్టేషన్‌పై అవగాహన కల్పించారు. జిల్లాలో మరో 22,700 ఎకరాల్లో చెరువులను ఆక్వాజోన్‌ పరిధిలోకి తెచ్చేలా ప్రతిపాదన చేశారు. ప్రభుత్వానికి నివేదిక పంపారు. రైతులంతా రిజిస్ర్టేషన్‌ చేసుకునేలా నోటీసులు జారీచేయనున్నారు. మరో 6,200 ఎకరాల్తో కొత్తగా చెరువులు తవ్వుకునే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. జిల్లాలో ఆక్వా విస్తరించేదిశగా మత్స్యశాఖ కసరత్తు చేస్తోంది.

రిజిస్ర్టేషన్‌ తప్పనిసరి

ఆక్వా చెరువులను రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లాలో 50వేల ఎకరాల్లోనే రిజిస్ర్టేషన్‌ చేసుకున్నారు. మరో 85వేల ఎకరాల్లో రైతులు రిజిస్ర్టేషన్‌ చేసుకోవాల్సి ఉంది. సర్వే నెంబర్‌లతో రిజిస్ర్టేషన్‌ చేసుకోవడానికి అవకాశం లేదు. ఎల్‌పీ నంబర్‌లు ఉండాలి. వైసీపీ హయాంలో జాయింట్‌ ఎల్‌పీ నంబర్‌లు కేటాయించారు. అదే ఇప్పుడు రిజిస్ర్టేషన్‌కు పెద్ద అవరోధంగా మారింది. జాయింట్‌ ఎల్‌పీ నంబర్‌లను కూటమి ప్రభుత్వం విడదీసే ప్రయత్నం చేస్తోంది. సరిహద్దులు గుర్తించలేక పోవడంతో గత ప్రభుత్వం జాయింట్‌ ఎల్‌పీ నెంబర్‌లు కేటాయించి రైతులను ముంచేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దస్తావేజులను పరిశీలిస్తున్నారు. హద్దులను నిర్ధారిస్తున్నారు. వేర్వేరు ఎల్‌పీ నంబర్‌లు కేటాయిస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను పరిష్కరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఆక్వా డెవలప్‌మెంట్‌ అథారిటీలో రిజిస్ర్టేషన్‌ చేసు కుంటేనే ప్రభుత్వ కల్పించే ప్రయోజనాలు రైతులకు అందుబాటులోకి రానున్నాయి. విద్యుత్‌ రాయితీకి కూడా రిజిస్ర్టేషన్‌తో ముడిపెట్టారు. గడువు విధించారు. కానీ క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు పరిష్కరించాలి. అప్పుడే రిజిస్ర్టేషన్‌కు అవకాశం ఉంటుంది. ఆక్వా విస్తరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో రైతుల్లో కాస్త ఆశాజనక వాతావరణం నెలకొంది.

Updated Date - Oct 05 , 2025 | 12:53 AM