కొత్త యూనిఫాం, బ్యాగ్, విద్యా సామగ్రి
ABN , Publish Date - May 26 , 2025 | 12:15 AM
కొత్త విద్యాసంవత్సరంలో ప్రభు త్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర (ఎస్‌ఆర్‌కేవీఎం) పేరిట కిట్లు సిద్ధమవుతున్నాయి.
కొత్త యూనిఫాం, బ్యాగ్, విద్యా సామగ్రి
ఏలూరు అర్బన్, మే 25 (ఆంధ్రజ్యోతి): కొత్త విద్యాసంవత్సరంలో ప్రభు త్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర (ఎస్‌ఆర్‌కేవీఎం) పేరిట కిట్లు సిద్ధమవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో పాఠశాలలను కూడా వదలకుండా రాజకీయ రంగులు, జగన్ బొమ్మలతో నింపేసిన విద్యాకానుక కిట్లను కూటమి ప్రభు త్వం సమూలంగా మార్చివేసింది. విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థిమిత్ర పేరిట కిట్లను పంపిణీ చేయనుంది.
జిల్లాలో 27 మండలాల్లోని 1,609 ప్రభుత్వ పాఠశాలల్లో 1,22,665 మంది విద్యార్థులు ఉంటారన్న అంచనాలతో కిట్లను సిద్ధం చేస్తున్నారు. పుస్తకాల సంచి భారాన్ని తగ్గించేందుకు వీలుగా భాష, ఇతర సబ్జెక్టులకు సెమిస్టర్ విధానంలో ముద్రించిన పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్‌లను ఇప్పటికే జిల్లాకు చేర్చారు. బూట్లు, బెల్టులు వస్తున్నాయి. ఆరో తరగతిలో కొత్తగా చేరే 11,665 మంది విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలను ఇవ్వనున్నారు. పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు దాదాపు 90 శాతం జిల్లాకు సరఫరా అయ్యాయని సమగ్రశిక్ష జిల్లా కార్యాలయ వర్గాలు తెలిపాయి.
హుందాగా యూనిఫాం, స్కూలు బ్యాగ్‌లు
విద్యార్థిమిత్ర కిట్లలో మూడు జతల స్కూల్ యూనిఫాంకు సరిపడా వస్త్రం రంగు, డిజైన్ కార్పొరేట్ స్థాయిలో హుందాగా ఉండేలా రూపొందిం చారు. ఆలివ్‌గ్రీన్ కలర్ గళ్ల డిజైన్‌తో కూడిన వస్త్రాన్ని పంపిణీ చేస్తున్నారు. గ్రీన్ కలర్ స్కూల్ బ్యాగ్‌పై సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర లోగో ముద్రించి ఇవ్వనున్నారు. వీటిపై యూనిక్ ఐడీ ముద్రించి మండ లాల వారీగా సరఫరా చేయనున్నారు. ఐడీ వల్ల సంబంధిత కిట్ దుర్వినియోగ మైనా, పాడైనా సులువుగా గుర్తించేందుకు వీలవుతుంది. యూనిఫాం దుస్తుల తయారీకయ్యే కుట్టుకూలీ డబ్బులను బాల బాలికల తల్లుల బ్యాం కు ఖాతాలకు జమ చేస్తామని సీఎంవో రవీంద్ర తెలిపారు.