Share News

పరీక్ష కేంద్రాల బయటే పాదరక్షలు వదిలి..

ABN , Publish Date - Aug 03 , 2025 | 11:52 PM

వైద్యవిద్య ఎండీ, ఎంఎస్‌, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ఆది వారం నిర్వహించిన నీట్‌–పీజీ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు అతి జాగ్రత్తల మాటున కాళ్లు సుర్రుమనిపించారు.

పరీక్ష కేంద్రాల బయటే పాదరక్షలు వదిలి..

ఓ కేంద్రంలో అపరిశుభ్రంగా వాష్‌రూమ్‌లు ..

కనీసం నీటివసతిని పట్టించుకోలేదు..

నీట్‌–పీజీ పరీక్షార్థుల పాట్లు!

ఏలూరులో రెండు కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ

మొత్తం 30 మంది గైర్హాజరు

ఏలూరు అర్బన్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): వైద్యవిద్య ఎండీ, ఎంఎస్‌, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ఆది వారం నిర్వహించిన నీట్‌–పీజీ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు అతి జాగ్రత్తల మాటున కాళ్లు సుర్రుమనిపించారు. కాపీయింగ్‌ నిరోధానికి తనిఖీలు, పలు అంచెల్లో అన్ని చర్యలను చేపట్టడం సహజమే అయినా అదికాస్తా పరీక్షార్థులు ధరించిన పాదరక్షలను సైతం తొల గించిన తర్వాతే అనుమతించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కాగా జిల్లాకేంద్రం ఏలూరులో జరిగిన నీట్‌–పీజీ పరీక్షకు సీఆర్‌ఆర్‌ ఇంజ నీరింగ్‌ కళాశాల కేంద్రానికి 200 మంది అభ్యర్థులను కేటాయిం చగా 181 మంది, సిద్థార్థ క్వెస్ట్‌ కేంద్రానికి 173 మందిని కేటాయించగా 162 మంది హాజరయ్యారు. పరీక్ష ప్రశాంతంగానే ముగిసినా వట్లూరు లోని ఓ కేంద్రంలో అభ్యర్థులు కనీస వసతులు లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి కేంద్రంలో వాష్‌రూమ్‌లు అపరిశుభ్రంగా ఉండడంతో పాటు, వాటికి నీటి సరఫరా లేదని వాపోయారు. దీనికితోడు పరీక్షకేంద్రం సెక్యూరిటీ వద్దే పాదరక్షలను వదిలేయాలని ఆదేశించడంతో, అక్కడినుంచి పరీక్షగది వరకు, చివరకు నిర్వహణ సరిగా లేక భయానకంగా వున్న వాష్‌రూమ్‌కు వట్టికాళ్లతోనే వెళ్లాల్సి వచ్చిందని వైద్యవిద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకుముందు జరిగిన నీట్‌ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల పాదరక్షలను వదిలివెళ్లాలనే నిబంధన తాము చూడలేదని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. కాపీ యింగ్‌కు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి అభ్యంతం లేదని, కానీ పాదరక్షలతో వెళ్లడాన్ని అనుమతించకపోవడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ఇప్పటివరకు అమలు ేస్తున్న నిబంధనల ప్రకారం పరీక్షార్థులు జడక్లిప్పులు, చెవి దిద్దులు, ఉంగరాలు, తదితర వస్తువులను అనుమతించడం లేదు. దీంతో విద్యార్థినులు జుట్టు విరబోసుకుని రావడం పరీక్షకేంద్రాల వద్ద కనబడేది. కాగా ముందుగా ఎన్‌బీఈ చెప్పిన విధంగానే పరీక్ష ప్రారంభ సమయానికి అంటే 9గంటలకు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాల ప్రవేశద్వారాలను మూసివేశారు. దీంతో సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల కేంద్రానికి పావుగంట ఆలస్యంగా ఉదయం 8.45 గంటలకు వచ్చిన ఓ అభ్యర్థిని నిర్వాహకులు అనుమతించలేదు

Updated Date - Aug 03 , 2025 | 11:52 PM